ఎఫిషియెంట్ పొలిటీషియన్ - సింధియా
- January 08, 2025
జ్యోతిరాదిత్య సింధియా... భారత దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన సింధియా తన కుటుంబం నుంచి రాజకీయాన్ని వారసత్వంగా అందుకున్నా, అనతి కాలంలోనే తన అకుంఠిత దీక్షాదక్షతలతో రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు భారతదేశ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించాయి. రాబోయే దశాబ్దంలో భారతదేశ రాజకీయాలను శాసించగలిగే అన్ని అర్హతలు ఉన్న నేతల్లో సింధియా ఒకరు. ఈరోజు కేంద్ర మంత్రి మరియు గ్వాలియర్ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం... !
జ్యోతిరాదిత్య పూర్తి పేరు జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా. గ్వాలియర్ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని 300 ఏళ్ళ పాటు పాలించిన మరాఠా కుర్మీ రాజవంశానికి చెందిన మాధవరావ్ సింధియా, మాధవి రాజే దంపతులకు సింధియా జన్మించారు. సింధియా ముంబైలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, డెహ్రాడూన్ లోని ప్రసిద్ధ డూన్ స్కూల్లో ప్లస్ టూ వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సింధియాతో కలిసి చదువుకున్నారు. అనంతరం అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ (ఎకనామిక్స్), స్టాన్ఫోర్డ్ బిజినెస్ గ్లోబల్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు.
జ్యోతిరాదిత్య ఎంబీఏ చేస్తున్న సమయంలోనే ఐక్యరాజ్య సమితి ఆర్థికాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఎంబీఏ తర్వాత అమెరికాలో మెరిల్ లించ్ (Merrill Lynch), మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) వంటి ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ (investment banker)గా పనిచేశారు.
సింధియా తాత గారైన గ్వాలియర్ మహారాజైన "శ్రీశ్రీ శ్రీమంత్ మహారాజాధి రాజా సర్ జార్జ్ జీవాజీ రావ్ సింధియా" గారు సర్దార్ పటేల్ గారి కోరిక మేరకు స్వతంత్ర భారతదేశంలో గ్వాలియర్ రాజ్యాన్ని విలీనం చేశారు. పటేల్ మీదున్న గౌరవభావంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి తొలుత మద్దతు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణం తర్వాత ఆయన చిత్ర పటాన్ని తన సొంత ఖర్చుతోనే చేయించి పార్లమెంట్లో ఆవిష్కరింపజేశారు. అయితే, దేశ మొదటి ప్రధాని నెహ్రూ అసమర్థ, అరాచకపు పాలనా విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మహారాజుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన పరోక్ష సహాయ సహకారాలతోనే హిందూ మహాసభ, జనసంఘ్ పార్టీలు గ్వాలియర్ కేంద్రంగా చేసుకొని రాజకీయంగా బలమైన పునాదులు ఏర్పరచుకున్నాయి.
సింధియా నానమ్మ రాజమాత విజయరాజే సింధియా తన భర్త ప్రోత్సాహంతో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి దేశ రాజకీయాల్లో దిగ్గజ నాయకురాలిగా ఎదిగారు. పార్లమెంట్ వేదికగా ఇందిరా గాంధీ నియంతృత్వ విధానాలను చీల్చి చెండాడిన విపక్ష నాయకురాలు సైతం రాజమాతనే కావడం విశేషం. కాంగ్రసేతర రాజకీయాలకు అండగా నిలుస్తూ జనసంఘ్, జనతా మరియు భాజపా పార్టీల్లో కొనసాగారు. ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు సైతం వెళ్లారు. వాజపేయ్, అద్వానీలతో కలిసి భాజపాను స్థాపించారు. ఆ పార్టీని తొలిరోజుల్లో ఆర్థికంగా సైతం ఆదుకున్నారు. విజయరాజే రాజకీయ వారసులుగా కుమారుడు స్వర్గీయ మాధవరావ్ సింధియా, కుమార్తెలు వసుంధర రాజే సింధియా (రాజస్థాన్ మాజీ సీఎం), యశోధర రాజే సింధియాలు దేశ రాజకీయాల్లో రాణించారు.
జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్ సింధియా తల్లి విజయరాజే బాటలోనే కాంగ్రసేతర వాదిగానే రాజకీయాల్లో పెట్టినా, ప్రధాని ఇందిరా తనయులైన సంజయ్, రాజీవ్ గాంధీలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా తల్లితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండేవారు. రాజీవ్, నరసింహారావు ప్రభుత్వాల్లో మానవవనరులు, రైల్వే, పౌరవిమానయాన శాఖల మంత్రిగా పనిచేశారు. గ్వాలియర్, గుణ లోక్ సభ స్థానాల నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడంలో కూడా మాధవరావ్ కీలకంగా వ్యవహరించారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉండబోతున్నారని ప్రచారం కూడా జరిగింది.
2001లో కాన్పూర్ పట్టణ పర్యటనకు వెళ్తూ విమాన ప్రమాదంలో మాధవరావ్ మరణించారు. ఆయన రాజకీయ వారసుడిగా జ్యోతిరాదిత్య కాంగ్రెస్ నుంచి 2001లో గుణ లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004,2009,2014లలో అదే స్థానం నుంచి ఎన్నికైన సింధియా కాంగ్రెస్ పార్టీ యువ రాజకీయవేత్తల్లో రాహుల్ గాంధీతో సమానంగా అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా నిలిచారు. 2007లో తొలిసారిగా అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ & ఐటి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2009-14 వరకు యూపీఏ 2 ప్రభుత్వంలో సింధియా వాణిజ్య & పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, విద్యుత్ శాఖ (స్వతంత్ర) మంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవాలో సైతం నాలుగోసారి లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం సింధియా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. 2014-19 వరకు పార్లమెంట్ వేదికగా అధికార ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 2016లోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు జరిపారు. శివరాజ్ సర్కార్ వైఫల్యాలపై సింధియా రాజీ లేని పోరాటం చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు.
కాంగ్రెస్ తరపున మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులో అగ్రస్థానంలో ఉండటంతో పాటుగా ఆ పదవికి అన్ని అర్హతలు ఉన్న సింధియాను కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, పైగా రాష్ట్రేతరుడైన కమల్ నాథ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ అధిష్ఠానం పట్ల ఆగ్రహం పెల్లుబికింది. ఈ సమయంలోనే తన ఆత్మీయ మిత్రుడైన రాహుల్ గాంధీ మౌనం వహించడం పట్ల సింధియా విస్మయానికి గురైయ్యారు. ఆనాటి నుంచి గాంధీ కుటుంబానికి, సింధియాకు దూరం పెరుగుతూ వచ్చింది.
2019 ఎన్నికల్లో సింధియా ఓటమి చవిచూసిన తర్వాత కాంగ్రెస్ ఆయన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పార్టీ పెద్దల్లో తన పట్ల మారిన వైఖరిని, వారు పదే పదే అవమానిస్తూ రావడాన్ని సింధియా సహించలేక పోయారు. దశాబ్దాల పాటుగా ఎన్ని అటుపోట్లు, ఒత్తిళ్లు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడవని సింధియా కుటుంబాన్ని ఇలా పొమ్మనకుండా పొగబెట్టడాన్ని సింధియా అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. అదే సమయంలో ఆయన మేనత్తలు మరియు భాజపా సీనియర్ నాయకురాళ్లలైన వసుంధర, యశోధర రాజేల ద్వారా తమ పార్టీలో చేరమని భాజపా పెద్దల నుంచి ఆహ్వానం రాగ, తమ అభిమానులు సైతం ఒకే చెప్పడంతో ప్రధాని మోడీ సమక్షంలో భాజపాలో చేరారు. జ్యోతిరాదిత్య సింధియా చేరికతో ప్రస్తుతం సింధియా కుటుంబమంతా భాజపాలోనే ఉంది.
సింధియా భాజపాలోకి రావడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు చోటు చేసుకున్నాయి. సింధియాతో పాటుగా ఆయన అనుచర కాంగ్రెస్ ఎమ్యెల్యేలు సైతం భాజపాలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోవడం, భాజపా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. భాజపాలోకి సింధియా వచ్చిన వెంటనే ఆయన్ని రాజ్యసభకు పంపించి 2021లో మోడీ మంత్రివర్గంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐదో సారి గుణ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సింధియా మోడీ 3.0 మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్ & ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సింధియా రాజకీయ నాయకుడిగానే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా సైతం పేరు గడించారు. కమ్యూనికేషన్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలోనే "డిజిటల్ భారత్ " (ప్రస్తుతం డిజిటల్ ఇండియా) ప్రాజెక్టును విజయవంతంగా ప్రవేశపెట్టారు. టెలికాం రంగంలో సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు, నరేగా పథకంలో పనిచేసిన కార్మికుల వేతనాల చెల్లింపుల్లో జాగు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు పడేలా చేయడంలో సింధియా పాత్ర కీలకం. దేశ వాణిజ్య రంగం లోటును పూడ్చేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఆ శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో పడకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. నాటి యూపీఏ 2 ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యుల పనితీరు రికార్డులు పరిశీలిస్తే సింధియా మొదటి 5 స్థానాల్లో ఎప్పుడూ ఉండేవారు.
మోడీ 2.0 ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా దేశ విమానయాన రవాణా సామర్థ్యాన్ని పెంచడం, దేశంలోని పలు నగరాల్లో ఎయిర్ పోర్ట్స్ నిర్మాణం పనులు వేగవంతంగా చేయించారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో అన్ని విధాలుగా భారత్ మొదటి 5 స్థానాల్లో ఉండాలనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. మోడీ 3.0 మంత్రివర్గంలో సైతం ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల మంత్రిగా ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్స్ కు అనుమతిచ్చారు. ఇక కమ్యూనికేషన్ల శాఖలో పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు రాబోయే రోజుల్లో శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. తన పనితీరుతో ప్రధాని మోడీని సైతం మెప్పించి వ్యక్తిగతంగా పలు మార్లు ప్రశంసలు అందుకున్నారు.
రాజకీయాల్లో నిరంతరం బిజీగా గడిపే సింధియా మంచి క్రికెటర్ మరియు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ! స్కూల్, కాలేజీ స్థాయిల్లో ఆడిన సింధియా పార్లమెంట్ క్రికెట్ జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రంలో జిల్లాల వారీగా పలు నూతన స్టేడియంల నిర్మాణానికి మరియు పాత స్టేడియంల ఆధునీకరణకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఇండియా జట్టుకు సెలెక్ట్ అయ్యే క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇండోర్, గ్వాలియర్ స్టేడియాల్లో జరిగే ఇండియా మ్యాచులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పిచ్ లను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం గ్వాలియర్ పట్టణంలోనే 60 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన మాధవరావ్ సింధియా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం సింధియా పర్యవేక్షణలో జరుగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని క్రికెట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా సింధియా పనిచేస్తున్నారు. బీసీసీఐ బోర్డులో కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తిగత జీవితానికి వస్తే బరోడా రాజ కుటుంబానికి చెందిన ప్రియదర్శిని రాజేను వివాహాం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు మహానార్యామన్ సింధియా, కుమార్తె అనన్య రాజే సింధియా ఉన్నారు. తండ్రి ఆకస్మిక మరణంతో గ్వాలియర్ మహారాజుగా బాధ్యతలు చేపట్టిన సింధియాకు ఈ వ్యవహారాలను చూసుకునే పూర్తి బాధ్యతలను తన సహధర్మచారిణి ప్రియదర్శినికి అప్పగించారు. గ్వాలియర్ ఎస్టేట్ వ్యవహారాలు, విద్యాసంస్థల బాధ్యతలు మరియు కోర్టులో నడుస్తున్న ఆస్తుల వివాదాల బాధ్యతలను రాజేనే చూస్తూ ఉంటారు. వీటితో పాటుగా గ్వాలియర్ ప్రాంత ప్రజల సంక్షేమం మరియు ఉపాధి కల్పన బాధ్యతల పర్యవేక్షణ, ఎన్నికల ప్రచారాల సమయంలో సింధియా తరపున ప్రచార కార్యక్రమ బాధ్యతలు సైతం నిర్వహిస్తారు.
అతి పిన్న వయస్సులోనే గ్వాలియర్ మహారాజుగా, కేంద్ర మంత్రిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా భారత రాజకీయాల్లో తమ కుటుంబ కీర్తిని వెలిగిస్తునే ఉన్నారు. ఈనాటి భారత రాజకీయాల్లో అవినీతి మరకలు అంటని సచ్చిలుడైన రాజకీయ నాయకుడిగా అన్ని పార్టీల నాయకులతో ప్రశంసలు అందుకున్నారు. రాబోయే దశాబ్దంలో భారత దేశ ప్రగతి రథానికి సారథ్యం వహించే బాధ్యతలను చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్న నేతగా సింధియా కనిపిస్తున్నారు.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







