మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..

- January 09, 2025 , by Maagulf
మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..

బెంగళూరు: ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను 225 మీటర్ల సమీపానికి తెచ్చినప్పుడు వాటి దిశ ఊహించిన దాని కంటే కొంత తేడాగా ఉండటంతో డాకింగ్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఇస్రో బుధవారం ‘ఎక్స్‌’లో ప్రకటించింది.

ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. డాకింగ్‌ ప్రక్రియ వాయిదా పడటం ఇది రెండోసారి. మంగళవారం జరగాల్సి ఉన్న ఈ ప్రక్రియ గురువారానికి వాయిదా పడింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే సామర్థ్యాన్ని అందుకునేందుకు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా స్పేడెక్స్‌ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే.

ఇకపోతే..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తదుపరి చైర్మన్‌గా డాక్టర్‌ వీ నారాయణన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ పదవీకాలం ముగియనుండటంతో జనవరి 14న నారాయణన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. నారాయణన్‌ సారథ్యంలో చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌, శుక్రయాన్‌, మంగళ్‌యాన్‌-2, పునర్వినియోగ వాహకనౌక తయారీ వంటి కీలక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టనుంది. 1984లో శాస్త్రవేత్తగా ఇస్రోలో చేరిన నారాయణన్‌ నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యారు. ఆయన నాయకత్వంలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ సహా అనేక ఇస్రో ప్రయోగాలకు ఎల్‌పీఎస్‌సీ 183 లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌లు, కంట్రోల్‌ పవర్‌ ప్లాంట్లను అందించింది. చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రయోగాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే III వాహక నౌకకు సంబంధించిన సీ25 క్రయోజెనిక్‌ ప్రాజెక్టుకు ఆయన ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com