భారత దౌత్య ప్రతినిధి - జైశంకర్

- January 09, 2025 , by Maagulf
భారత దౌత్య ప్రతినిధి - జైశంకర్

జైశంకర్ .. భారతదేశ ప్రతినిధిగా అంతర్జాతీయవ్యాప్తంగా సుపరిచితమైన దౌత్య రాజకీయవేత్త. భారత విదేశాంగ విధానంలో ప్రధాని మోడీ తీసుకురావాలనుకున్న సంస్కరణలకు అనుగుణంగా విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ ఏ వైఖరిని అవలంభిస్తుందని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా చూసేలా చేయడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. స్వాతంత్ర భారతావనిలో భారత విదేశాంగ విధాన రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఘనత జైశంకర్ సొంతం. నేడు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పుట్టినరోజు.  

ఎస్.జైశంకర్ లేదా జైశంకర్ పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జైశంకర్. 1955,జనవరి 9న కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం, సులోచన దంపతులకు దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. జైశంకర్ బాల్యం,విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీ, బెంగళూరులో సాగింది. ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఎస్సి కెమిస్ట్రీ, JNU నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఫిల్ మరియు phd ని పూర్తి చేశారు. 1977లో భారత విదేశాంగ సర్వీస్ (IFS)కు ఎంపికయ్యారు. 

జైశంకర్ తండ్రి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం అలియాస్ కె. సుబ్రహ్మణ్యం గారి ఐఏఎస్ అధికారిగానే కాకుండా, రక్షణ రంగ నిపుణుడిగా ప్రసిద్ధి గాంచారు. ఆయన్ని భారత అణు విధానానికి రూపశిల్పిగా కూడా పరిగణిస్తారు. తండ్రి స్పూర్తితో విదేశాంగ విధానం పట్ల ఆసక్తి పెంచుకున్న జైశంకర్ IFS అధికారిగా చేరారు. రష్యాలో మొదటి పోస్టింగ్ పొందిన జైశంకర్ ఆ తర్వాత హంగేరీ, జపాన్, శ్రీలంక, అమెరికా,  చెక్ రిపబ్లిక్, సింగపూర్, చైనా దేశాల్లో పని చేశారు. ఈ సమయంలోనే ఆయన చైనా, తూర్పు ఆసియా, అమెరికా వ్యవహారాల్లో సంపూర్ణ పట్టు సాధించారు. 2015లో మోడీ ప్రభుత్వం ఆయన్ని భారత విదేశాంగ కార్యదర్శిగా నియంచింది. 2015-18 వరకు ఆ పదవిలోనే శంకర్ కొనసాగారు. 

విదేశాంగ కార్యదర్శి బాధ్యతల్లో శంకర్ ఉన్న సమయంలోనే ప్రధాని మోడీ తలపెట్టిన దేశ విదేశాంగ సంస్కరణలకు ఊతమిస్తూ వాటిని అమలు చేసేందుకు అహర్నిశలు శ్రమించారు. అంతర్జాతీయ వేదిక మీద భారత్ సత్తా ఏంటో చూపే దిశగా మునుపెన్నడూ లేని రీతిలో  చిన్న, పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలతో మైత్రి మరియు సత్సంబంధాల బలోపేతానికి కృషి చేశారు. సరిహద్దు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ మరియు చైనా దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేశారు. ఇదే సమయంలో 
ఐక్యరాజ్య సమితి వేదికగా ఇండియా మీద పాక్ చేస్తున్న అసంబద్ధ ఆరోపణలకు దీటుగా బదులిచ్చారు. 

పాక్ దొడ్డి దారిన ఇండియన్ ఆర్మీపై చేసిన దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఊరి, బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ దాడుల రూపకల్పనలో జైశంకర్ పాత్ర కీలకం. మోడీకి విదేశాంగ విధానం మీద సంపూర్ణ పట్టు సాధించే ప్రక్రియలో విదేశాంగ కార్యదర్శిగా శంకర్ బాగా ఉపయోగపడ్డారు. అలాగే, చైనా, అమెరికా దేశాలతో భారత్ మైత్రి సంబంధాలను పటిష్టం చేసేందుకు దోహదపడ్డారు. జైశంకర్ సేవలను మెచ్చిన మోడీ తన రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే తన మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ అధికారి నుంచి విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి జైశంకర్. జైశంకర్ కంటే ముందు దివంగత నట్వర్ సింగ్ యూపీఏ 1 ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 

జైశంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపాలని ప్రధాని మోడీ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం మొదలు పెట్టారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్, పాలస్తీనా, లెబనాన్ - ఇజ్రాయిల్ యుద్ధ సమయాల్లో బాధిత దేశాలకు మద్దతుగా నిలుస్తూనే, వైరి పక్షాలతో సన్నిహిత సంబంధాలను భారత్ నెరపడం ద్వారా తన దౌత్య నీతిని ప్రదర్శించారు. ప్రధాని మోడీని, ఇండియాను లక్ష్యంగా చేసుకొని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో వామపక్ష వాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జైశంకర్ కీలకమైన పాత్రను పోషించారు.

ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుతూ సమితిలో శాశ్వత దేశాలు, ఐరోపా దేశాల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం, మిగిలిన దేశాల సమస్యల పట్ల దాట వేత వైఖరితో ఉన్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అలాగే, అంతర్జాతీయంగా పెరుగుతున్న  ఇస్లామిక్  తీవ్రవాదం పట్ల అవసరం ఉన్న ప్రతి సారి గళాన్ని విప్పేందుకు వెనుకాడేవారు కాదు. ప్రధాని మోడీ దౌత్య విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావడంలో జైశంకర్ సఫలం అయ్యారు. భారత దేశ విదేశాంగ విధానంలో ఇంకా చేయాల్సిన మార్పులు చేర్పుల మీద, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్రను మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తున్నారు.      


- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com