జాతీయ యువజన దినోత్సవం
- January 12, 2025
ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారత దేశం మనది. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా యువతపైనే’ అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి. ఈరోజు ”జాతీయ యువజన దినోత్సవం” సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
మానవ సమాజం నిరంతరం ప్రవహించే జీవనది. ఆదిమవ్యవస్థ నుంచి ఆధునిక సోషలిస్టు సమాజం వరకూ వివిధ దశలుగా సాగుతూనే వుంది. వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, మానవుడు కొనసాగుతూనే వుంటాడు. మానవజాతికి సుదీర్ఘ చరిత్ర వుంది. పుట్టింది మొదలు చనిపోయే వరకూ మనిషి నిరంతరం పరిణామం చెందుతూనే వుంటాడు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మార్పు జరుగుతూ వుంటుంది. ముందు తరాలకన్నా తర్వాతి తరాలు మరొక అడుగు ముందుకేస్తుంటాయి. ఈ క్రమంలో పాత విలువలు, సాంప్రదాయాలను దాటుకొని, కొత్తదనం వైపు యువత పరుగులు పెడుతుంది.
యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.
యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథచక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్టురసత్యం. దేశంలో దాదాపు 16 శాతం నిరుద్యోగం ఉంది. సామర్థ్యం ఉన్నప్పటికీ చదువుకు తగ్గ ఉద్యోగాలులేక నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. పెద్దపెద్ద ప్యాకేజీల గురించి వార్తలు వస్తున్నా.. నిజానికి అలాంటి వేతనాలు పొందుతున్న వారి సంఖ్య మూడు శాతానికి మించిలేదు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో పనిఒత్తిడి, పనిగంటలు దారుణంగా ఉంటున్నాయి.
‘క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటారు గుర్రం జాషువ. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. దేశాభ్యుదయానికి యువశక్తి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్ లాంటి మహనీయుల త్యాగాలను అందుకోవాలి.
చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, పాలకులు వారి అనుకూల వర్గాలకు ఇచ్చే రాయితీలు, కార్పొరేట్ ప్రపంచానికి అనుకూలంగా చేసే చట్టాలపై యువత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ ఆశయాలు ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలు సాధన కోసం పాటుపడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత ఒత్తిడి పెంచాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువు ‘కొని’ ఇస్తున్నారు. మార్కులు, గ్రేడులే లక్ష్యంగా, డబ్బు సంపాదనే ధ్యేయంగా వారికి విద్యనందిస్తున్నారు.అలా కాకుండా విలువలు, మానవ సంబంధాలు కలిగిన వారిగా వారిని పెంచాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోంలు కనుమరుగవుతాయి.
“జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని.. ఆ ఆలోచన మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి’’ అన్న వివేకానంద మాటలు పేరెంట్స్, పిల్లలకు వివరించాలి. అయితే కొంత మంది యువకులు ఇటీవల కాలంలో మద్యానికి, మత్తులకు బానిసలై, బలహీనంగా మారడం అటు తల్లిదండ్రులకు, ఇటు ప్రభుత్వానికి, దేశానికి తీవ్రమైన సమస్యగా మారుతున్నారు. ఇది ఇంకా తీవ్రం కావొద్దంటే తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాలి.
ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. యువజన దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు.
జాతీయ యువజన దినోత్సవం 2025 థీమ్ "సుస్థిర భవిష్యత్తు కోసం యువత: స్థితిస్థాపకత, బాధ్యతతో దేశాన్ని రూపొందించడం (Youth for a Sustainable Future: Shaping the Nation with Resilience and Responsibility)". ఈ థీమ్ వాతావరణ మార్పులలో యువత బాధ్యతలు వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఆవిష్కరణ, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.
యువకులు మంచి నడవడిక, కుటుంబం, మానవతా, నైతిక విలువలు పెంపొందించుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలి. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువశక్తి మనదేశంలో ఉండటం సానుకూల అంశమే. ఈ శక్తిని ఇటు యువత, అటు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమే. అప్పుడే ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత నాకు కావాలి” అని ఆశించిన వివేకానందుడి లక్ష్యం నెరవేరుతుంది.
వివేకానందుని స్ఫూర్తితో యువత తమ మెదళ్లకు పదును పెట్టాలి. ప్రభుత్వాలు యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసం స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం తెచ్చారో.. వాటి సాధనకు యువత నడుం బిగించాలి. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ యవనికపై భారత జెండా సగౌరవంగా రెపరెపలాడుతుంది.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!







