మందుల మాంత్రికుడు - యల్లాప్రగడ
- January 12, 2025
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు.. తమ మేధస్సును రంగరించి, చేసిన ఆవిష్కరణలే మన ప్రపంచాన్ని ఎప్పటికప్పడు కొత్త బాట పట్టిస్తున్నాయి. భూమి మీద ఐదు వేల సంవత్సరాల మానవవాళి చరిత్రలో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు.చర్మ, కంటి, జననేంద్రియాలు, ఉదర, మూత్రకోశ వ్యాధులు.. నిమోనియా వంటి ఎన్నో జబ్బులను మానవాళి సమర్థంగా తట్టుకుంటోందంటే.. మనిషి ఆయుః ప్రమాణం పెరిగిందంటే.. కేవలం ఒక్క మహానుభావుడి పుణ్యమే! ఆయనే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు.పెన్సిలిన్ కంటే ప్రభావవంతమైన యాంటీ బయోటెక్ ‘క్లోరో టెట్రా సైక్లిన్’ను ఆవిష్కరించినది సైతం ఆయనే. అలాగే, ఫ్లోరిక్ యాసిడ్ ను కనిపెట్టారు. కీమోథెరపీకి పునాది వేసిన మెడిసిన్ ‘మేథో ట్రెక్సీట్’ను, బోధకాలును నివారించే ‘పెట్రాజెన్’ను ఆయనే కనిపెట్టారు. నేడు మందుల మాంత్రికుడు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి.
యల్లాప్రగడ సుబ్బారావు 1895, జనవరి 12న ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని అవిభక్త గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జగన్నాథం, వెంకమ్మ దంపతులకు జన్మించారు. 18 ఏళ్లకే తండ్రిని కోల్పోయారు. ఈయన ఇద్దరు సోదరులూ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఈయన ఆరోగ్యమూ అంతంతమాత్రంగా ఉండేది. తండ్రి మరణం తర్వాత అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యలూ తోడయ్యాయి. దీంతో రెండుసార్లు మెట్రిక్యులేషన్ తప్పారు. తల్లి నగలు అమ్మగా వచ్చిన సొమ్ము, స్నేహితుల ఆర్థిక సాయంతో.. మద్రాసులోని హిందూ హైస్కూల్లో చదివిన సుబ్బారావు.. మూడో దఫాలో మెట్రిక్ పాసయ్యారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్ చదివిన సుబ్బారావు.. గణితంలో డిస్టింక్షన్ సాధించారు.
సుబ్బారావు చదువుకు స్వస్తి చెప్పి రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారాలనుకున్నారు. కానీ తల్లి, మఠం నిర్వాహకులు నచ్చజెప్పటంతో ఆయన దృష్టి వైద్య విద్యపై ఆకర్షితులయ్యారు. అలా మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరారు. కానీ.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తిన పరిస్థితిలో ‘మా అమ్మాయిని పెళ్లాడతానంటే.. ఆ డబ్బు నేనే ఇస్తాను’ అని కస్తూరి సూర్యనారాయణ ముందుకు రావటంతో ఆయన కుమార్తె శేషగిరిని పెళ్లి చేసుకున్నారు.
స్కూలు విద్యార్థిగా కొన్నాళ్లు రాజమండ్రిలో ఉన్న సుబ్బారావు నాటి స్వాతంత్ర సమరయోధుల ప్రసంగాలు వినేవారు. అయితే వైద్య విద్యార్థిగా ఉండగా మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా విదేశీ వస్తువులు వద్దనీ, ఖద్దరు కట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ భావాలు కలిగిన సుబ్బారావు.. మర్నాడు ముతక ఖద్దరుతో చేసిన సర్జికల్ ఏప్రాన్ ధరించి.. మెడికల్ కాలేజీకి వెళ్లారు. దీంతో అక్కడి సర్జరీ విభాగపు హెడ్.. బ్రిటిష్ జాతీయుడైన ఎం.సీ. బ్రాడ్ ఫీల్డ్‌కు కోపాన్ని తెప్పించింది. ‘మీ గాంధీ దేశానికి వైశ్రాయ్ అయిన తర్వాత దీన్ని ధరించుదువులే’ అని అందరి ముందూ ఎగతాళి చేశాడు. గాంధీజీని అవమానించటంతో తట్టుకోలేకపోయిన సుబ్బారావు అంతే రోషంగా.. ‘మా గాంధీజీ ఏనాటికీ మీ వైశ్రాయ్ స్థాయికి దిగజారడు’ అని క్లాసు రూమ్‌లో అనటంతో బ్రాడ్‌ఫీల్డ్.. సుబ్బారావు మీద కక్ష గట్టాడు.
ఆయనకు ఎంబీబీఎస్ పట్టా ఇవ్వకుండా అంతకన్నా తక్కువదైన ఎల్ఎంఎస్ సర్టిఫికెట్తో సరిపుచ్చారు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో ఉద్యోగానికి ఇది ఆటంకమైంది. అయితే.. బ్రాడ్‌ఫీల్డ్ పుణ్యామా అని వైద్య వృత్తి పట్టా దక్కని సుబ్బారావు ఆయుర్వేదంపై దృష్టి సారించారు. గతంలో ‘ఉష్ణమండల స్ప్రూ’ అనే రోగం బారిన పడ్డ సుబ్బారావుకు స్థానిక ఆయుర్వేద వైద్యుడైన లక్ష్మీపతి ఇచ్చిన మందు పనిచేసింది. దీంతో ఆయుర్వేదం మీద ఆసక్తి పెరిగి, మద్రాసులో లక్ష్మీపతి నిర్వహించే ఆయుర్వేద కాలేజీలో అనాటమీ లెక్చరర్‌గా చేరి, పరిశోధనలు ఆరంభించారు.
సరిగ్గా.. ఆ సమయంలో భారత్‌కు వచ్చిన అమెరికన్ వైద్యుడు జాన్ ఫాక్స్ కెండ్రిక్స్.. సుబ్బారావు మేధస్సును గుర్తించి, విదేశాల్లో పరిశోధన చేయమని సూచించారు. అప్పట్లో అందరూ పైచదువుల కోసం బ్రిటన్ వెళుతున్నా.. భారతీయులను పీడిస్తున్న బ్రిటన్‌కు బదులు.. అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేశారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో డిప్లొమాలో ఫిజీషియన్‌కి బదులు కెమిస్ట్ కోర్సుకి అడ్మిషన్ వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ (కాకినాడ) వారి సాయంతో 1923 అక్టోబరులో సుబ్బారావు అమెరికా చేరి కోర్సు పూర్తి చేశాక జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉద్యోగం ఇచ్చారు.
అప్పట్లో ఆయనకు హార్వర్డ్ యూని వర్శిటీలో కేవలం 2,700 డాలర్ల జీతం మాత్రమే. ఒక్కసారిగా పెద్ద అవకాశం. అందులో చేరితే అప్పులన్నీ తీరిపోతాయి. ఎగిరి గంతేయాలి కానీ ఎక్స్పెరిమెంట్స్ కోసం బిల్డింగ్ ఇచ్చే మాటైతే సగం జీతానికే పని చేస్తానని సుబ్బారావు కోరారు. రీసెర్చి అంటే ప్రాణం పెట్టే లీడర్లీ ప్రెసిడెంట్ విలియం బ్రౌన్‌బెల్ కొత్త బిల్డింగూ ఇచ్చాడు, ఆఫర్ చేసిన జీతమూ ఇచ్చాడు. హార్వర్డ్‌లోనే పరిశోధన పూర్తి చేసి పీహెచ్డీ సాధించారు.
1922లో నోబెల్ బహుమతి అందుకున్న సిద్ధాంతాన్ని సుబ్బారావు పరిశోధనాత్మకంగా పరిశీలించి, అర్థవంతంగా లేదని రుజువు చేశారు. ఆ సిద్ధాంతంపైనే మళ్లీ పరిశోధన సాగించి, దిగ్భ్రాంతి గొలిపేలా సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతమే ‘డా. ఫిస్కే–సుబ్బారావు మెథడ్’గా నేటి వైద్య కళాశాలల్లో పాఠ్యాంశంగా ఉంది. ఇది ప్రపంచ వైద్య పరిశోధనా రంగంలో ఒక అనూహ్యమైన చారిత్రాత్మక సంఘటన.
‘న్యారోస్పెక్ట్రమ్ యాంటి బయాటిక్స్– పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ వంటి మందులు కనుగొన్న వారికి నోబెల్ బహుమతులు లభించాయి. కానీ వాటికన్నా శ్రేష్ఠమైన, ప్రపంచంలో తొలి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటి బయాటిక్ టెర్రా‘మైసిన్’ మాతృక టెట్రా‘సైక్లిన్’ మందును కనుగొన్న డా. యల్లాప్రగడకు నోబెల్ బహుమతి ఇవ్వకపోవడం శోచనీయం. అయితే నోబెల్ బహుమతిని ఎంపిక చేసే ‘స్టాక్‌హోమ్’ నగరంలోని వారి ప్రధాన కార్యాలయంలో సుబ్బారావు తైలవర్ణ చ్రితం దర్శనమిస్తుంది. బహుశా నోబెల్ బహుమతి ఇవ్వనందుకు ప్రాయశ్చిత్తంగా ఆ చిత్రాన్ని అక్కడ ఉంచారేమో!
ఒకప్పుడు ప్లేగు మహమ్మారి ప్రపంచ మానవాళిని చుట్టపెట్టినప్పుడు టెర్రామైసిన్ మందు ప్రాణరక్షక ఔషధంగా కాపాడింది. ఇటీవల భూగోళాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కరోనా వ్యాధిని డాక్స్‘సైక్లిన్’, అజిత్రో‘మైసిన్’ వంటి మందులు కీలకపాత్ర వహించి ప్రజలను కాపాడాయి. ఈ మందుల సృష్టికర్త సుబ్బారావు. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌కి కీమోథెరపిలో తొలితరం ఔషధం మెథాట్రాక్సిన్ మందును, క్షయ వ్యాధికి ‘ఐసోనెక్స్’, బోదకాలు, ఇస్నోఫీలియాకు హెట్రజన్ మందును ఆయన కనుగొన్నారు.
ప్రపంచ మానవాళిని గడగడలాడించిన ప్రాణాంతక ఉష్ణమండల–‘స్ప్రూ’ వ్యాధికి దివ్యౌషధం ‘ఫోలిక్ ఆసిడ్’ పోషకాన్ని డా. యల్లాప్రగడ 1945 జూలై 20న కనుగొన్నారు. తద్వారా ఆ వ్యాధి కోరలు ఊడబెరికి భూగోళం నుండి పారద్రోలారు. ఈ స్ప్రూ వ్యాధి ఒకటి ఉన్నదని నేటి తరం వారికి అసలు తెలియనే తెలియదు. తన సోదరుని మరణానికి కారణమైన ఈ వ్యాధికి కనిపెట్టిన ఆనాటి ‘ఫోలిక్ ఆసిడ్– పోషక విటమిన్’ ఈ రోజు గర్భిణులకు సంజీవనిలాగాను, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి ‘వెన్ను’ దన్నుగాను పనిచేస్తున్నది. అంతేగాక క్యాన్సర్, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు, పక్షవాతం మొదలైన వాటిని నియంత్రించడంలో ‘కల్పతరువులా–యాంటి ఆక్సిడెంట్’గా ఉపయోగపడుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే ఆయన వైద్య పరిశోధనా ఫలితాలు ఎంతటి మహత్తరమైనవో కదా!
కనుగొన్న స్వల్పకాలానికే నిరుపయోగమవుతున్న మందులున్న ఈ రోజుల్లో కూడా డా. యల్లాప్రగడ కనుగొన్న ఆనాటి మందులు బహుళ ప్రయోజన ఔషధాలుగా పనిచేస్తున్నాయి. తాను కనుగొన్న మందుల ద్వారా ప్రపంచ మానవాళికి ఒక ‘శాశ్వత ఆరోగ్యకవచం’ అందించిన క్రాంతదర్శి, అపర ధన్వంతరి డా. యల్లాప్రగడ సుబ్బారావు. మనకు చరిత్ర తెలియక నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు అన్నీ విదేశీయులు, ఇంగ్లీషు శాస్త్రవేత్తలు కనిపెట్టినవే అనుకుంటున్నాం. ఇప్పుడున్న మందుల షాపుల్లో స్థిరమైన మందులు ఎక్కువగా మన తెలుగువాడు డా.సుబ్బారావు కనిపెట్టినవే!
గతంలో డా. సుబ్బారావు అమెరికా వెళ్లి తిరిగి రాలేదని కొందరు భావించారన్న వార్తలు వినవచ్చాయి. 1948లో అమెరికా నుంచి ఒకసారి స్వదేశం వచ్చిన ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో తాను గతంలో డా. లక్ష్మీపతి ఆయుర్వేద వైద్య కళాశాలలో ‘అనాటమీ లెక్చరర్’గా పనిచేసి, ఆయుర్వేదంపై అధ్యయనం చేసి, ఆ అనుభవంతో ‘ప్రాచీన ఆయుర్వేదం పునాదిపై ఆధునిక అల్లోపతి వైద్యశాస్త్ర సమన్వయంతో నా వైద్య పరిశోధనలలో సత్ఫలితాలు సాధించాను’ అని తెలియజేశారు. కాబట్టి మన దేశంలో ఆయుర్వేదం, అల్లోపతి–ఆంగ్లవైద్యం సమన్వయంతో ‘ఇంటిగ్రేటెడ్ మెడికల్ కాలేజీ’ ఏర్పాటు చేయాలని, ‘క్యాన్సర్ పరిశోధన హాస్పిటల్’ ఏర్పాటుచేసి ప్రజలకు తన వైద్యసేవలు అందించాలని’ ఆనాటి సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపిన కథనం ఉంది.
“ఈ తరంలో చాలా మంది సుబ్బారావు పేరు విని ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన జీవించి ఉండటం వల్లే నేడు మనమంతా ఆరోగ్యంగా, సజీవంగా ఉంటున్నాం’ అనే అమెరికన్ రచయిత డోరోన్ ఆంట్రిమ్ మాటలను బట్టి ఆయన ఎంత గొప్ప పరిశోధకుడో మనకు అర్థమవుతుంది.
వైద్య రంగంలో ఇన్ని అద్భుత ఆవిష్కరణలు చేసినప్పటికీ వర్ణ వివక్ష కారణంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుకు నోబెల్ బహుమతి దక్కలేదు. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకెళ్లి పరిశోధనలు చేసిన వారి శిష్యులకు మాత్రం నోబెల్ పురస్కారాలు లభించడం గమనార్హం. 1948 ఆగస్టు 9న 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన కనిపెట్టిన అజరామరమైన దివ్యౌషధాలు ప్రపంచ మానవాళి శ్వాసలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







