జననేత-పిజెఆర్

- January 12, 2025 , by Maagulf
జననేత-పిజెఆర్

పిజెఆర్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రజల కోసమే రాజకీయాలు తప్ప స్వలాభాలం కోసం కాదు అని నమ్మిన ప్రజా నాయకుడు. భాగ్యనగరంలో నిరుపేద కార్మిక, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం అహర్నిశలు పని చేసిన పేదల పక్షపాతి. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తుల్లో ఆయన ముఖ్యులు. మూడు దశాబ్దాల పాటు ఎన్ని కష్టాలు, ఒత్తిడులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని వీడని క్రమశిక్షణ కలిగిన సైనికుడు. నేడు జననేత పిజెఆర్ జయంతి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పిజెఆర్‌గా సుపరిచితులైన పబ్బతిరెడ్డి జనార్ధన రెడ్డి గారు 1948, జనవరి 12న ఒకప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పాపిరెడ్డి,  శివమ్మ దంపతులకు జన్మించారు. మసబ్ ట్యాంక్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత సనత్‌నగర్‌లోని ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశారు.

పిజెఆర్‌ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సమయంలోనే కార్మికుల సాధక బాధలను అర్థం చేసుకొని వారి తరపున పోరాటాలు చేయడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో నాటి హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ నాయకుడైన టంగుటూరి అంజయ్య గారి సహకారంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చిన ఆయన్ని హైదరాబాద్ ఆల్విన్, కేశవ్రామ్ సిమెంట్స్, ఎన్టిపిసి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ,  అసోసియేటెడ్ గ్లాస్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్, ఎపి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ఎపి అగ్రో ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్, కృషి ఇంజిన్‌ పరిశ్రమల కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నాయి.

కార్మిక నేతగా ఉంటూనే అంజయ్య గారి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ హైదరాబాద్ విభాగంలో పనిచేయడం మొదలు పెట్టారు. 30 ఏళ్ళ వయస్సులో అంజయ్య గారి సిఫారస్సుతో 1978లో అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్ నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1985,1989,1994 మరియు 2004లలో అదే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో సహకార, యువజన సేవల మంత్రిగా, 1982లో ఆర్కైవ్స్ మంత్రిగా, 1990- 92 వరకు నేదురుమల్లి జనార్దన రెడ్డి మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, గృహనిర్మాణ మంత్రిగా, 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో  పౌర సరఫరా మంత్రిగా పని చేశారు. 1994 - 1999 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.  

తెలంగాణ మలి దశ ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తుల్లో పిజెఆర్ ఒకరు. ఆంధ్ర ప్రాంత పాలకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతుందని, నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా దాస్యం ప్రణయ్ భాస్కర్, ఇంద్రా రెడ్డి వంటి నేతలతో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై గళమెత్తారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం ద్వారా  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పాడు బెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రాంతం వివక్ష చూపిస్తే ప్రజలు తిరగబడే సమయం వచ్చిందని ఆయన అప్పట్లోనే హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పనిచేసిన ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరితో ఉండేవారు. వారికి కావాల్సిన విషయాల్లో తనవంతు సహాయ సహకారాలను అందించారు.  

పిజెఆర్ గొప్ప ప్రజాస్వామ్యవాది. రాజకీయాల్లో ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పించి, నేతల వ్యక్తిగత రాగ ద్వేషాలను  తీర్చుకోవడానికి కాదని నమ్మేవారు. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా చట్ట సభల్లో ప్రజా సమస్యలపై, ప్రజా సంక్షేమం కోసం జీవితాంతం ఆయన పోరాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి కరడుగట్టిన నియంతను సైతం కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా ఎదుర్కున్న నాయకుడు పిజెఆర్. వైఎస్సార్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన వ్యక్తుల్లో వీరు ఒకరు.    

జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి అంటే ముందుగా గుర్తొచ్చేది పిజెఆర్. పెద్దమ్మ తల్లి భక్తుడైన ఆయన, ప్రజల సహకారంతో పాటుగా తన సొంత నిధులను వినియోగించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆయన ఏ కార్యాన్ని తలపెట్టలన్న ముందుగా పెద్దమ్మ తల్లిని దర్శించి మొదలు పెట్టారు. ఈనాడు పెద్దమ్మ గుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాశస్త్యం తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే సొంతం.

పిజెఆర్ రాజకీయాల్లో అజాత శత్రవు. రాజకీయాల్లో ఆయన ప్రజా సమస్యల కోణంలోనే ఇతర పార్టీల నాయకులపై విమర్శలు చేసేవారు తప్పించి వ్యక్తిగతంగా ఏనాడూ ఎవరిని దూషించలేదు. ఆయనకు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. టైగర్ ఆలె  నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, దేవేందర్ గౌడ్, సలావుద్దీన్ ఓవైసీ, చంద్రబాబు నాయుడు ఇలా చాలా మంది ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన శిష్యులైన మాజీ మంత్రులు దానం నాగేందర్, టి. పద్మారావు గౌడ్ లు ఇప్పుడు ఎమ్యెల్యేలుగా ఉన్నారు.  

పిజెఆర్ గారిని హైదరాబాద్ బడుగు, బలహీన వర్గాల వారు తమ ఒకడిగా చూసేవారు. తమకు ఏ కష్టం, సమస్యా వచ్చినా వారు ముందుగా వెళ్ళేది  పిజెఆర్ వద్దకే! ఆయన వద్దకు వెళ్లిన వారిని పార్టీలకతీతంగా వారి పనిచేసి పెట్టేవారు. ఆయన్ని కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకుంటే తీరిపోతాయని భాగ్యనగర వాసులు నమ్మేవారు. 

పిజెఆర్ సైతం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి వెళ్లి పరిష్కరించేవారు. అందుకే ఆయన్ని పార్టీలకతీతంగా ప్రజలు అభిమానించేవారు. జీవితాంతం నిరు పేదల అభ్యన్నతి కోసం కృషి చేసిన పిజెఆర్ 2007,డిసెంబరు 28న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణించి 18 ఏళ్ళు గడుస్తున్నా హైదరాబాద్ ప్రజల హృదయాల్లో జననేతగా ఇప్పటికి జీవిస్తూనే ఉన్నారు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com