13 ఏళ్ల వయసులోనే రెండు శతకాలు వ్రాసిన తెలుగు బాలుడు అవధాని సంకీర్త్

- January 16, 2025 , by Maagulf
13 ఏళ్ల వయసులోనే రెండు శతకాలు వ్రాసిన తెలుగు బాలుడు అవధాని సంకీర్త్

ఆస్ట్రేలియా: 13 ఏళ్ల వయసులోనే శతకం రాసిన తెలుగు బాలుడు అవధాని సంకీర్త్ వింజమూరి. జనార్దన మరియు శ్రీ నరసింహ శతకాల పై తెలుగు భాష ప్రేమికుల ప్రశంసల వర్షం.

తెలుగు పదాలను, పద్యాలను సరిగా పలకలేని విద్యార్ధులు ఉన్న ఈ తరంలో 13 ఏళ్ల వయసులోనే జనార్దన మరియు శ్రీనరసింహ శతకాలను రాసి చరిత్ర సృష్టించాడు తెలుగు విద్యార్థి సంకీర్త్ వింజమూరి.. హైదరాబాద్‌ అమీర్‌పేటల లోని సిస్టర్ నివేదిత స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంకీర్త్‌కు చిన్ననాటి నుంచే తెలుగుపై మక్కువ ఎక్కువ. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంకీర్త్ తెలుగులో పద్యాలు నేర్చుకున్నాడు. అవధానార్చన భారతి బిరుదాంకితులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి వద్ద పద్య విద్యలో శిక్షణ పొందిన సంకీర్త్  13 ఏళ్ల వయస్సులోనే జనార్థన శతకాన్ని రచించి అందరిని ఆశ్చర్యపరిచాడు.  

జనార్దన శతకంలోని ప్రతి పద్యంలో ఎంతో అనుభవం ఉన్న కవిలా వ్రాయడంపై తెలుగు భాష ప్రేమికులు, సాహితీ వేత్తల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తెలుగు భాష మాధుర్యాన్ని పద్యంలోని ప్రతి పదంలో నింపుతూ ఎంతో చక్కగా జనార్దన శతకం వ్రాసినందుకు సంకీర్త్ వింజమూరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  చిన్న వయస్సు నుంచే సంకీర్త్ తల్లిదండ్రులు వింజమూరి భార్గవ, తేజస్వీలు తెలుగు భాష పై ప్రేమ పెరిగేలా సంకీర్త్‌ను తీర్చిదిద్దారు. తెలుగు భాషా పాండిత్యాన్ని పెంచేందుకు తటవర్తి గురకులంలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. అదే ఈ రోజు సంకీర్త్‌ను 13 ఏళ్ల వయస్సులోనే శతకం వ్రాసేలా తీర్చిదిద్దింది. నేర్చుకోవాలనే అభిలాష, భాష మాధ్యురాన్ని ఆస్వాదించగల సామర్థ్యం చిన్న వయస్సులోనే రావడం సంకీర్త్‌కు కలిసి వచ్చిన అంశమని గురువు తటవర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. అంతర్జాల వేదికగా తెలుగు సాహితీవేత్తలు, రచయితలు సంకీర్త్  రచించిన జనార్థన శతకాన్ని ఆవిష్కరించారు.  తటవర్తి గురుకులం శతశతకయజ్ఞము లో భాగంగా పద్యశతకాలను పేదవిద్యార్థుల చదువుల అవసరాల కొరకు  సహాయం చేస్తూ ఆవిష్కరించటం సాంప్రదాయంలా కొనసాగిస్తూ వస్తుంది. ఆ పరంపరలో భాగంగానే సంకీర్త్ రచించిన ఈ రెండు శ్రీనరసింహా మరియు జనార్దన శతకాలు నిజామాబాద్ జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పది మంది డిగ్రీ విద్యార్థులకు సహాయానికి గుర్తుగా వీటిని ఆవిష్కరించారు. చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ  ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మారేపల్లి పట్వర్థన్ కూడా శతావధాని కావడంతో ఆ కాలేజీ విద్యార్ధులను కూడా భాష పరంగా ప్రోత్సహిస్తున్నారు. అందులో ఆ పది మంది విద్యార్థులు ఈ రెండు శతకాలలోని పద్యాలను గానం చేసి వినిపించారు. ఇలా పద్యసాహిత్యంతో తెలుగు భాష వైభవం, సేవా నిరతిని రెండింటిని మేళవించి తటవర్తి  గురుకులం శత శతక యజ్ఞాన్ని నిర్వహిస్తోంది.

కళ్యాణ్ చక్రవర్తి వృత్తి రీత్యా ఐటీ రంగానికి చెందినా, ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక వికాసం, ఇంటింటా తెలుగుపద్యం, సమాజం సాహిత్యం, సంస్కృతి.. ఇవి తటవర్తి గురుపథం గా ఒక మార్గాన్ని ఎంచుకుని కరోనా సమయంలో జూమ్ ద్వారా సెషన్స్ నిర్వహిస్తూ, వయో బేధం లేకుండా, 8 సం.ల బాలుర నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకూ వారికి సులువుగా పద్య నిర్మాణ మెళుకువలు నేర్పించి, పద్య సేద్యం చేస్తూ తెలుగు భాషకు తనవంతు కృషి చేస్తున్న కృషీవలుడు.త్వరలో తన శతశతక యజ్ఞము ద్వారా పేద విద్యార్థుల కోసం తన ప్రయత్నం లో మరింత మంది పద్యకవులు, పద్యకావ్యాలు వెలుగులోకి రావాలని ఆశిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com