సమాజాభ్యుదయ కారకుడు-రావిపూడి వెంకటాద్రి

- January 21, 2025 , by Maagulf
సమాజాభ్యుదయ కారకుడు-రావిపూడి వెంకటాద్రి

హేతువాదం, నాస్తికత్వం, భౌతికవాదం, భావవాదం, గతితార్కిక భౌతికవాదం, భౌతిక వాస్తవికవాదం, మానవతావాదం, మానవవాదం వంటి అనేక తాత్వికవాదాల మధ్య గల భేదాలను, సామ్యాలను, పరిధులను విశ్లేషించి, వివరించిన సాహిత్యం రావిపూడి వారిది. ఇటువంటి భావవిప్లవ సాహిత్యం దేశంలోని మరే భాషలోనూ లభించకపోవడం గమనార్హం. భావ విప్లవమంటే ఏమిటి? దాన్ని సాధించడమెలా? భావవిప్లవాల ఆవశ్యకత ఏమిటి? భారతదేశంలో భావవిప్లవం విజయం సాధించలేకపోవడానికి కారణమేమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రావిపూడి వెంకటాద్రి సృష్టించిన హేతువాద, మానవవాద భావవిప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. తెలుగులో ఇటువంటి అపూర్వమైన, అపురూపమైన సమగ్ర భావవిప్లవ సాహిత్యాన్ని సృష్టించిన ఘనత రావిపూడి వారికే  దక్కుతుంది. నేడు రావిపూడి వెంకటాద్రి వర్థంతి. 

ఆంధ్రదేశంలో హేతువాదిగా, మానవవాదిగా లబ్ధప్రతిష్ఠులైన రావిపూడి వెంకటాద్రి 1922, ఫిబ్రవరి 9న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని అవిభక్త గుంటూరు జిల్లాలో భాగమైన ఇంకొల్లు తాలూకాలోని నాగండ్ల గ్రామంలో మోతుబరి రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో ఆయన ఆధ్యాత్మిక భావనలతో పూజలు చేస్తూ ఉండేవారు. తమ మాస్టారు చిన్నం రామయ్య ప్రేరణతో కవిరాజు త్రిపురనేని రామస్వామి రచించిన శంభూకవధ నాటకాన్ని వేటపాలెం సారస్వత నికేతనం నుంచి తెచ్చుకుని చదివి నాస్తికుడిగా మారారు. 

1943 ఏప్రిల్‌ 5న నాగండ్లలో కవిరాజాశ్రమం స్థాపించారు. దాని తొలి వార్షికోత్సవానికి ప్రముఖ సంఘసంస్కర్తలు పెరియార్‌, అన్నాదురైలను ఆహ్వానిస్తూ చిన్న కార్డు ముక్క రాశారు. ఆ ఇరువురూ మద్రాసు నుంచి నాగండ్లకు వచ్చి, సభలో ప్రసంగించారు. ఆపై పెరియార్‌తో రావిపూడి పరిచయం కొనసాగింది. 1945లో సోషలిస్ట్‌ ఎంఎన్‌ రాయ్‌ ప్రసంగాలకు ప్రభావితమై రాడికల్‌ డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. 1946లో బాపట్ల- ఒంగోలు నియోజకవర్గం నుంచి రాడికల్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వెంకటాద్రి గారు తన స్వగ్రామమైన నాగండ్ల గ్రామానికి 1956 -96 వరకు 40 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే నాగండ్ల గ్రామం ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు లభించింది.    

1996లో స్థానిక రిజర్వేషన్లలో నాగండ్ల పంచాయితీ ప్రెసిడెంట్‌ పదవి వెనుకబడిన వర్గాల మహిళకు కేటాయించడం వల్ల వెంకటాద్రి గారు తప్పుకోవలసి వచ్చింది. పంచాయితీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ డబ్బును తానే సర్దుబాటు చేశారే తప్ప గ్రామ ప్రజల నుంచి వసూలు చేయలేదు. గ్రామంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా కులమతాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వారిని చైతన్య వంతుల్ని చేశారు. ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం నాగండ్ల గ్రామానికి పోలీసులు రావలసిన అవసరం ఏర్పడలేదంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది.

శాస్త్రం-మతం, హేతువాదం-నాస్తికత్వం, మార్క్సిజం-హ్యూమనిజం తదితర అంశాలతో ప్రజల్లో ఆలోచన దృక్పథానికి పదునుపెట్టే రచనలు ఎన్నో చేస్తూ వచ్చారు. వాటిని కవిరాజాశ్రమం, హేమ పబ్లికేషన్స్ నుంచి ప్రచురించే ప్రక్రియ ఆయన తుదిశ్వాస వరకు సాగింది. మతానికి, విజ్ఞాన, ఖగోళశాస్త్రాలకు మధ్య ఘర్షణను ‘విశ్వాన్వేషణ’ పేరుతో రాసి 1946లో ప్రచురించారు. ఆనాటి నుంచి వివిధ అంశాలపై లోతైన అధ్యయనంతో సుమారు 100కు పైగా రచనలు చేశారు. హేతువాద, నవ్య మానవతావాద ఉద్యమానికి అంకితమైన ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకి. మార్క్సిజం ఒక విఫల ప్రయోగమని, దానికీ నవ్య మానవతావాదానికి పోలిక లేదంటూ పలు పుస్తకాలు రాశారు. 

 విప్లవమంటే హింసతో కూడిన సాయుధ పోరాటాల ద్వారా, రక్తపాతంతో కూడిన యుద్ధాల ద్వారా రాజకీయాధికారాన్ని కైవసం చేసుకోవడమని భావించారు. ఇప్పటికీ ఇంకా అలా భావించేవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఆరు దశాబ్దాలు గడుస్తున్నా వర్గ పోరాటాల పేరుతో కమ్యూనిస్టు విప్లవ గ్రూపులు ఇంకా సాయుధ పోరాటాలను కొనసాగిస్తుండడాన్ని మనం చూస్తున్నాం. వారి లక్ష్యాన్ని, నిజాయితీని ఎవరూ శంకించలేరు. కాని వారి మార్గం మాత్రం సరైనది కాదని రుజువైంది. అందువల్ల వాస్తవాలను గుర్తించి మార్గాంతరాల కోసం అన్వేషించాలి పలు సందర్భాల్లో రావిపూడి వారు పేర్కొన్నారు. 

రావిపూడి వారు 1979-89 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  హేతువాద సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగా,1989 నుంచి 2002 వరకు భారత హేతువాద సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2008లో మరలా భారత హేతువాద సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మిత్రులతో కలసి ఇంకొల్లులో రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1988లో కవిరాజు త్రిపురనేని అవార్డు, 1992లో హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తాపీ ధర్మారావు అవార్డు, 1996లో చీరాలలో అన్నం సత్యన్నారాయణ ట్రస్టు నుంచి మంచి హ్యూమనిస్టు అవార్డును, అదే ఏడాది కవిరాజు త్రిపురనేని జాతీయ అవార్దును అందుకున్నారు. 

హేతువాదం, మానవతావాదం ఒకటే అనుకుంటున్నారు. కాని ఒకటి కావు. మానవ కారుణ్యమే ప్రాతిపదికగా గలది మానవతా వాదం. దానినే హ్యుమానిటేరియనిజం అంటారు. మానవుడి భవితవ్యాన్ని, కర్తృత్వాన్ని పూర్తిగా మనిషి అధీనంలో ఉంచేది మానవవాదం. దానినే హ్యూమనిజం అంటాం. మానవవాదం అవశ్యంగా మానవతావాదాన్ని ఇముడ్చుకుంటుంది. అందువల్ల ప్రతి మానవవాదీ అవశ్యంగా మానవతావాది కూడా అవుతాడు. కానీ ప్రతి మానవతావాదీ మానవవాది కానవసరం లేదని, ఆ రెండింటి మధ్య గల భేదాన్ని వివరించారు. హేతువాద లక్ష్యం మానవవాదమని వెంకటాద్రి గారు ప్రకటించారు.

రాజకీయాలు గురించి ఆయన మాట్లాడుతూ పార్టీల అవతారమెత్తి, అధికార రాజకీయాలు మారినాయి. పార్టీలన్నీ ప్రజలకు మంచి చేయాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటాయి. కాబట్టి ప్రజాశ్రేయస్సే తమ లక్ష్యమని ప్రకటించే పార్టీల లక్ష్యం ప్రజాశ్రేయస్సు నుంచి పార్టీ అధికారం మీదకు మారుతుంది. పార్టీ అధికారంలోకి రావాలంటే ముందుగా ఎన్నికల్లో గెలవాలి. దాంతో లక్ష్యం గెలుపు మీదకు మారుతుంది. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు, అధికారం, విద్వేష ప్రచారం, శుష్కవాగ్దానాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి సంకుచిత భావాలతో ప్రజలను రెచ్చగొట్టడం, మద్యంతో మభ్యపెట్టడం వంటి అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడాలి. అందుకే అధికారం కోసం పాకులాడే రాజకీయ పార్టీలన్నీ అవశ్యంగా అవినీతి కార్యకలాపాల్లో మునిగి దిగజారిపోక తప్పడం లేదు. ఇవే నేటి పార్టీ రాజకీయాలన్నారు .

తీరా గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పార్టీ నాయకుని ఆదేశానుసారం పాలనను కొనసాగిస్తారు. అంటే ప్రజాస్వామ్యం పేరిట పార్టీస్వామ్యం, పార్టీ నాయక స్వామ్యం రాజ్యమేలుతుంది. ఈవిధంగా పార్టీ నాయకుల నియంతృత్వాన్నే ప్రజాస్వామ్యంగా భ్రమపెడతారని ఆయన రచనల్లో విశ్లేషించారు. పార్టీల స్వభావమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంతర్గత ప్రజాస్వామ్యమే లేని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయనుకోవడం జరగని పని. అందువల్ల పార్టీ రహిత, నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం కావాలి. అది విజయవంతం కావడానికి ప్రజలు విద్యావంతులు, చైతన్యవంతులు కావాలి. అందుకోసం హేతువాద, మానవవాద భావవిప్లవం రావాలని వెంకటాద్రి ఆశించి కృషి చేశారు.  

పేదరికం పోవలసిందే. అంతమాత్రాన మానసిక పరాధీన భావం నుంచి మనిషి విముక్తి పొందడు. విద్యను పెంపొందించవలసిందే. కాని ఆ పేరుతో మూఢనమ్మకాలను, కట్టుకథలను, దురభిమానాలను బోధించడం వల్ల మనిషి మానసిక జడత్వం వదలదు. ప్రజాస్వామ్యం కావలసిందే. కాని ఆ పేర ఓటు హక్కు కల్పించినంత మాత్రాన స్వామ్యం మనిషి వద్దకు చేరదు. సౌకర్యాలు కావలసిందే. కాని ఆ పేరుతో మనుషులు రాజకీయ బానిసలు కాకూడదు. అన్నిటికంటె ముందుగా మనిషి భావాలపరంగా స్వతంత్రుడు కావాలని ఆయన ఆశిస్తున్నారు. భావ విప్లవం సాంస్కృతిక విప్లవానికి దారితీస్తుంది. సాంస్కృతిక విప్లవం సాంఘిక పరివర్తనకు దారితీస్తుంది. అది రాజకీయ, ఆర్థిక విప్లవాలకు దారిచూపుతుంది. రోగం భావాల్లో ఉన్నప్పుడు ఆ రోగాన్ని కుదర్చకుండా భావేతర రంగాల్లో విప్లవాలు తెస్తామనడం, అభ్యుదయాన్ని సాధిస్తామనడం వ్యర్థ ప్రలాపాల కింద చేరతాయని రావిపూడి వారు చక్కగా విశ్లేషించారు. 

హేతువాదం అనే ఒక్క పదంపైన ఆయన రాసినంత విస్తృతంగా, లోతుపాతులతో – వాసిలోనే కాదు, రాశిలోనూ విస్తారంగా రాసిన రచయిత, నిత్యగమనశీల కార్యకర్త వెంకటాద్రి కాకుండా ప్రపంచంలో మరెవ్వరూ లేరు. వారు హేతువాద ఉద్యమానికి మానవవాద మలుపును ఇచ్చిన తాత్వికులు. కేవలం హేతువాదం అంటే నాస్తికత్వం అని, ప్రతి విషయాన్ని నిర్దంద్వంగా వ్యతిరేకించే వారని, మూఢ నమ్మకాల నిర్మూలనకు మాత్రమే పరిమితమైనవారని అప్పటి వరకు ఉన్న అపోహలను, అపార్థాలను తొలగించడం కోసం వారు పడ్డ ‘శ్రమ’ అసామాన్యమైనది. 

1999లో ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ మానవవాద నైతిక సంఘ అంతర్జాతీయ సదస్సులో ‘బుద్ధుడు- హ్యూమనిస్ట్ దృక్పథం’ అంశం మీద ఉపన్యాసం చేసి అంతర్జాతీయ వేదికలపై ఎందరినో ఆలోచింపజేశారు. నిజానికి వెంకటాద్రి గారి గొప్పతనం ఏమిటంటే వారు నిరంతరం తనకు ఉన్న జ్ఞానస్థాయిని అప్‌డేట్ (Update) చేసుకుంటూ జీవితాంతం హేతువాద, మానవవాద ఉద్యమానికి లైట్ హౌస్‌గా వేలాది మందికి స్ఫూర్తిని కలిగించారు.

ఏదో ఒకస్థాయిలో ఎవరికైనా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో అసహనం, ఆటంకాలు సహజంగా కలుగుతూ ఉంటాయి. కానీ, వెంకటాద్రి ఆలోచనలు నిరంతరం పెరుగుతున్న శాస్త్ర, సాంకేతిక, తాత్వికవిషయాలపైన ఉండడం వారిని నిత్య విద్యార్థిని చేసింది. తనకు కేవలం ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనేవి మాత్రమే తెలుసునని ప్రకటించిన ఆధునిక కాలపు సోక్రటీస్ అనడం ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయన కలం తాకని అభ్యుదయ అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన రచనలు దాదాపు 7000 పేజీల ప్రింట్ రూపంలోని సాహిత్యం రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ -ఇంకొల్లు ప్రాంగణంలో ఉంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ‘ప్రపంచ భావగమన చరిత్ర’ లో ఆయన మస్తిష్కం వెలువరించిన భావాలు చిరంతరంగా నిలిచే ఉంటాయి. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com