ఆధ్యాత్మిక సామాజికవేత్త-సంత్ సేవాలాల్ మహారాజ్
- February 15, 2025
బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్. భారత అంటూ ధర్మానికి హాని కలిగినప్పుడు జన్మిస్తానన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి కారణజన్ముడు మహారాజ్. బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచారు, లిపిలేని బంజారాల భాషను ఒక క్రమ పద్ధతిగా మర్చి 10 కోట్ల లంబాడా ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా మాట్లాడుకోగలిగేలా చేసిన ఘనత ఆయన సొంతం. ఆధ్యాత్మిక చింతనతో బంజారా ప్రజల్లో చైతన్యం తెస్తూ, మనోధైర్యాన్ని నింపి. నిజాం సామ్రాజ్యాన్ని తన ఆధ్యాత్మిక శక్తితో గడగడలాడించి పేరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్రాంతివీరుడుగా ప్రసిద్ధి కెక్కినాడు. నేడు బంజారా ఆధ్యాత్మిక గురువు, సమాజసేవకుడైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం ...
సంత్ సేవాలాల్ మహరాజ్ 1739 ఫిబ్రవరి 15న ఇప్పటి అనంతపూర్ జిల్లాలోని గుత్తి మండలంలోని రాంజీనాయక్ తాండలోని రామావత్ గోత్రంలో భీమానాయక్, ధర్మణిమాత దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్తేటప్పుడు తల్లి కట్టియిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసేవారు. తాను మాత్రం బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవారు. ఈ వింత ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది. పండగలు, జాతర్ల సమయంలో జంతుబలిని చేయడాన్ని ఒప్పుకునేవారు కాదు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని ఒకానొకసారి సేవాలాల్ తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర ఉంచుతారు.
‘నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమ’ని ప్రార్థిస్తాడు. అమ్మవారు కరుణించి సేవాలాల్‌కి మరలా ప్రాణం పోస్తుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ‘సేవాలాల్ నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి’ అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి జగదాంబ మాతనే తన గురువుగా స్వీకరించారు. అన్ని విద్యలను నేర్చుకొని సమాజ సేవలో నిమగ్నమయ్యారు.
సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి.హింస మహా పాపమని, మద్యం ,ధూమ పానం శాపమని హితవు పలికారు. ఆ రోజుల్లోనే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశారు. ఒకప్పుడు నిజాం పాలనలోనిహైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన రాజు… సేవాలాల్ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలించాడని చరిత్ర తెలుపుతోంది.
సంత్ సేవాలాల్ మహరాజ్ అద్భుత మహిమలపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పురుషుడిని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో పదివేల మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం. వంటివి అందులో కొన్ని. సేవాలాల్‌ను ఆటపట్టించి, అపకీర్తి తీసుకురావాలని జాదూగర్ వడితియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్ తథాస్తు అని దీవించడంతో ఆ పురుషుడు నిజంగానే స్త్రీగా మారిపోతాడు.
సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక శక్తిని నిజాం నవాబు గ్రహించి ఆయనతో నిజాం సంధి కుదుర్చుకున్నారని చెబుతారు. తన ఆధ్యాత్మిక చింతనతో బంజారా ప్రజల్లో చైతన్యం తెస్తూ, మనోధైర్యం నింపిన యుగపురుషుడుగా బంజారాలు కొలుస్తారు.హైదరాబాద్‌లో కొంతకాలం నివసించిన తర్వాత మహారాష్ట్ర పోరాఘడ్లో స్థిరపడి అక్కడి నుంచి పొహరాఘడ్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పచుకొని బంజారాలను సంస్కరించే బోధనలు కొనసాగించారు. 1806 డిసెంబర్ 4న మరణించారు. ఆరోజు నుండి బంజారా (లంబాడీ)ప్రజలు సంత్ సేవాలాల్ మహారాజ్‌ను తమ ఆధ్యాత్మిక దైవంగా భావిస్తూ పూజిస్తుంటారు. జయంతి, వర్ధంతులను పండుగలా నిర్వహిస్తారు. జయంతి రోజున పూజలు జరిపి బోగ్ బండారి ప్రసాదాన్ని వండుతారు. సామాన్యునిగా పుట్టి తన సత్కర్మలతో అసామాన్యునిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్.
సంత్ సేవాలాల్ కూడా కేవలం తన బంజారాల కోసమే పనిచేశాడు అనేది తప్పు. ఆయన బోధనలలో అత్యంత ముఖ్యమైన బోధన పర్యావరణ పరిరక్షణ, అడవులను కాపాడుకోవడం. పర్యావరణ పరిరక్షణ అనేది ఈ ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో అతి ముఖ్యమైన అంశం. పలు అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కానీ 300 సంవత్సరాల క్రితమే సేవాలాల్ ఇది చెప్పాడని మనం సమాజానికి చెప్పడంలో విఫలమయ్యాం. ఇదే మన మొదటి వైఫల్యం.ఇప్పుడైనా మనం ప్రపంచ పౌరులుగా మారుదాం. మనవాడు గొప్ప, అవతలి వాడు కాదు అనే విషపూరితమైన ఆలోచనలు వదిలి పెడదాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







