స్టార్ రైటర్-కోన వెంకట్
- February 19, 2025
చదువుల తల్లి దయ ఉండాలే కానీ, రచనలు చేయవచ్చు. పదాలతో పదనిసలు పలికించవచ్చు. పదవిన్యాసాలతో మురిపించవచ్చు. పదబంధాలతో మైమరిపించవచ్చు. లక్ష్మీకటాక్షంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగు పెట్టిన కోన వెంకట్, తరువాత సరస్వతీ కరుణతో కలం పట్టి కదం తొక్కారు. ఆ పై పలు వినోదాల తేరులను తన పదబంధాలతో పరుగులు తీయించారు. తరువాత నటునిగానూ అలరించారు. నేడు సుప్రసిద్ధ కథా రచయిత కోన వెంకట్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీప్రయాణంపై ప్రత్యేక కథనం మీకోసం....
కోన వెంకట్ 1965 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఓ నాటి నటులు, తరువాత రాజకీయాల్లో రాణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ మరియు మాజీ గవర్నర్ కోన ప్రభాకర రావు మనవడే కోన వెంకట్. వెంకట్ తండ్రి పోలీసు ఉద్యోగం చేయడం వల్ల తరచు బదిలీలు అయ్యేవి. అందుకని హైదరాబాదులో తాతయ్య దగ్గరే పెరిగారు. హైదరాబాదులో బీకాం పూర్తి చేసి గ్రూప్స్ పరీక్షలు రాసి పాసయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతానికి పౌరసరఫరా శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. కొద్దినెలలకే ఆ పనిమీదా ఆసక్తి పోయింది.
తన తాత ప్రభాకర్ రావు ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మొదలు పెట్టారు వెంకట్. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేస్తే దానికి కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఆ బాధ్యతల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా సినిమా వాళ్లతో ప్రచారం చేయించేవారు. ఈ క్రమంలోనే ఆయనకు నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నరేష్ పరిచయం అయ్యారు.
తాత కోన ప్రభాకర్ రావు లాగే చిత్రసీమ పట్ల వెంకట్ ఆకర్షితులయ్యారు. దాంతో తమ కుటుంబానికి పరిచయం ఉన్న ప్రముఖ సినీ రచయిత ఆత్రేయతో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఆయనతో కలసి తిరగడం వల్ల చిత్రసీమలోని సాధకబాధకాలు కోన వెంకట్ ఇట్టే తెలుసుకున్నారు.
వినోదం పంచే చిత్రాలను రూపొందించాలనే లక్ష్యంతో తనకు కాంగ్రెస్ పార్టీలో పరిచయమైన ప్రముఖ హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ సినిమాను నిర్మించారు. తొలి చిత్రం నిరాశ పరచింది. అయినా, పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావించి, చిత్రసీమలోనే సాగారు. ఆ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడం, ఆయన ప్రోత్సాహంతో కోన వెంకట్ రచయితగా మారారు. రాము హిందీలో తెరకెక్కించిన “సత్య” చిత్రం తెలుగు వర్షన్ కు కోన వెంకట్ మాటలు రాశారు. అలాగే హిందీ నుండి తెలుగులోకి అనువాదమైన “దిల్ సే, కౌన్, మస్త్, జంగిల్, కంపెనీ” చిత్రాలకూ అనువాద రచనలో పాలు పంచుకున్నారు.
రసూల్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఒకరికి ఒకరు’ సినిమాతోనే వెంకట్‌కు రచయితగా గుర్తింపు లభించింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’తో మంచి ఆదరణ దక్కింది. “శివమణి, వెంకీ, సాంబ, బాలు, భగీరథ, చుక్కల్లో చంద్రుడు, షాక్” చిత్రాలకూ రచన చేశారు వెంకట్. శ్రీను వైట్ల ‘ఢీ’తో రచయితగా కోన వెంకట్ కు మరింత పేరు లభించింది. ఆపై “రెడీ, చింతకాయల రవి, కింగ్, అదుర్స్, బాద్ షా, అఖిల్, బ్రూస్లీ, జై లవకుశ, నిశ్శబ్దం” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు.
వ్యక్తిగతంగా తాను క్లీన్ హ్యూమర్ నే ఇష్టపడతాననీ, అదే వృత్తిలో కూడా ప్రతిఫలిస్తుందని వెంకట్ పేర్కొంటారు. ఈ అంశంపై మాట్లాడుతూ నేను మితిమీరిన ద్వందార్థాలు, వెగటు హాస్యం రాయను. నాకు ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళతో కలిసి నా సినిమా చూసి నేనే ఇబ్బంది పడే స్థితి తెచ్చుకోకూడదు కదా. మాస్ పేరును అడ్డం పెట్టుకుని గీతలు దాటి రాసే ప్రయత్నం చేయనని పేర్కొన్నారు
1997లో ‘తోకలేని పిట్ట’ నిర్మించి, నష్ట పోయినా, మళ్ళీ 2014లో ‘గీతాంజలి’తో నిర్మాణంలో అడుగు పెట్టారు కోన వెంకట్. తరువాత “శంకరాభరణం, అభినేత్రి, సాహసమే శ్వాసగా సాగిపో, నిన్నుకోరి, నీవెవరో, నిశ్శబ్ధం, గల్లీ రౌడీ” చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన ‘ఎందుకంటే… ప్రేమంట!’ సినిమాలో విలన్‌గానూ నటించారు కోన వెంకట్. 2008లో ‘నేను తను ఆమె’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న కోన వెంకట్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ మరింతగా వినోదం పంచుతారని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







