హిందూ హృదయ సామ్రాట్-ఛత్రపతి శివాజీ మహారాజ్
- February 20, 2025
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీ మహారాజ్కే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ మహా యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. నేడు హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం....
హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన ఇప్పటి మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జున్నార్ పట్టణం దగ్గర శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో, ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నారు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.
శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నారు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియబాయి పూస గుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. దౌత్యం మరియు రాజనీతి మెళకువలు నేర్చుకుంటూ.. తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నారు.
శివాజీ మహారాజ్ 17వ ఏటలోనే కత్తి పట్టారు. అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్‌కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్ఘడ్, కొండన ప్రాంతాలను ఛేజిక్కుంచుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ ఈ ముఖ్య యుద్ధ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు.
శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించారు. పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం.
శివాజీ తన ఏలుబడిలో పాలనా యంత్రాంగం పని వేగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. సమాచారాన్ని అందచేయడం నుంచి రహస్య సందేశాలను చేరవేయడం దాకా, రాజ్య రక్షణ నుంచి శత్రువుల రాజ్యంపై దాడి వరకూ, అన్ని కీలకమైన విషయాల్లోనూ వేగవంతంగా పనిచేయడానికి ఆయన పాలన, పాలనా యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. శివాజీ వేగమే విత్తమని భావించేవారు. ఎందుకంటే వేగంగా పనిచేయడం వలన తక్కువ సమయం ఖర్చయ్యేది. సమయమే ధనమన్న విషయాన్ని ఆయన తన పాలనలో, పనితీరులో పాటించేవారు.
మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ మహారాజ్ అంటే భయం. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బంధించినపుడు చాకచక్యంగా తప్పించుకొన్నారు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, నావికాదళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ’ఛత్రపతి ’ అని బిరుదును ప్రదానం చేసారు.
27 ఏండ్లపాటు యుద్ధాల్లో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ మహారాజ్ నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలోనే మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో మరణించారు. హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వేశారు ఛత్రపతి.‘‘అదిగో ఛత్రపతి.. ధ్వజమెత్తిన ప్రజాపతి...భరతమాత నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు’’ అంటూ రక్తం మరిగించే మన తెలుగు పాట శివాజీ పౌరుషానికి ప్రతీక.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







