రాజకీయ దురంధరుడు-నేదురుమల్లి
- February 20, 2025
నేదురుమల్లి జనార్ధన రెడ్డి... మునపటి తరం భారతదేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని మొదలు నాటి నుంచి చివరి శ్వాస వరకు ఆ పార్టీ జెండాను మోస్తూ వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన జనార్దన రెడ్డికి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లోనే మంచి పలుకుబడి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవిని చేపట్టిన రెండో నెల్లూరీయుడిగా జనార్దనరెడ్డి నిలిచిపోయారు. నేడు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన రెడ్డి జయంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం మీద ప్రత్యేక కథనం...
నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త నెల్లూరు జిల్లా వెంకటగిరి జమీందారీలో భాగమైన వాకాడు గ్రామంలో నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు విఆర్ కళాశాల నుంచి బిఎ, ఎస్వీయూ నుంచి బిఇడి పూర్తి చేశారు. అనంతరం తమ కుటుంబానికి చెందిన ఎన్.బి.కె.ఆర్ విద్యాసంస్థల నిర్వహణలో పాలుపంచుకొని హైస్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు అవసరం అయ్యే అన్ని విద్యాసంస్థలను స్థాపించారు. కుగ్రామమైన వాకాడును విద్యలవాడగా మార్చిన ఘనత నేదురుమల్లి సొంతం.
నేదురుమల్లి విద్యార్ధి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.1952లో మద్రాస్ నగర పొలిమేర్లలో ఉన్న అవడిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో సేవాదళ్ తరపున వాలంటీర్ బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత విద్యాసంస్థల నిర్వహణలో భాగంగా తరచూ రాష్ట్రస్థాయి రాజకీయ నాయకులను, మంత్రులను, అధికారులను కలుస్తూ క్రమంగా క్రియాశీలక రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఒకవైపు విద్యాసంస్థలను నిర్వహిస్తూనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. 1969లో తన పలుకుబడితో కాంగ్రెస్ తరపున పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి జనసంఘ్ దిగ్గజం వై.సి.రంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఎమ్యెల్సీ ఎన్నికలో ఓటమి చవిచూసినప్పటికి 1971 చివరికి అప్పటి రాష్ట్ర సీఎం పివి నరసింహారావుకు దగ్గరయ్యారు. 1972 ఎన్నికల్లో గూడూరు నుంచి పివి అభ్యర్థిగా పోటీ చేసిన శారదాంబ తరపున అన్నీతానై వ్యవహరించి ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం పనిచేసినప్పటికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆ ప్రాంత యువనేత, కోట జమీందారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఆమె ఓడినా పివి మాత్రం జనార్దన రెడ్డి పనితీరు పట్ల సంతృప్తి చెంది 1972లో రాజ్యసభకు నామినేట్ చేశారు.
1972-78 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జనార్దనరెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో తన పరపతిని పెంచుకున్నారు. పివి ఢిల్లీ రాజకీయ దూతగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారులైన సంజయ్, రాజీవ్ గాంధీలకు దగ్గరయ్యారు. గాంధీలతో పాటుగా వామపక్ష, జనసంఘ్, సోషలిస్టు నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఓటమి తర్వాత ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు సైతం కీలకమైన మలుపు తీసుకున్నాయి. బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలడం మెజారిటీ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యంగా అప్పటి సీఎం జలగం సైతం రెడ్డి కాంగ్రెస్ వైపుకు మళ్లడంతో జనార్దన రెడ్డి ఒక్కసారిగా రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు.
1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 11 స్థానాలకు గానూ 10 స్దానాలను ఇందిరా కాంగ్రెస్ గెలవడంతో జనార్దనరెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కరుణాకటాక్షాలు లభించి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నారెడ్డి అండతో మంత్రివర్గంలో నంబర్ టూగా ఉంటూ రెండేళ్లపాటు చక్రం తిప్పారు. 1980లో చెన్నారెడ్డి దిగిపోయిన తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సైతం అదే మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన భవనం, కోట్ల మంత్రివర్గాల్లో రెవెన్యూ, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖలను నిర్వహించారు.
1983 ఎన్నికల్లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రభంజనంలో వెంకటగిరి నుంచి మొదటిసారి ఎమ్యెల్యేగా పోటీ చేసిన జనార్దన రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరైన అప్పటి నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, తెదేపా అభ్యర్థి నల్లపురెడ్డి చంద్రశేఖర రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. 1985లో ఎమ్యెల్యే టిక్కెట్ కూడా దక్కలేదు. 1983-89 వరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి తెదేపా ప్రభుత్వంపై పలు ప్రజా ఆందోళన కార్యక్రమాలు, రాస్తారాకోలు నిర్వహించారు. ఆయన హయంలోనే నెల్లూరులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి సొంత కార్యాలయం ఏర్పడింది. దాన్నే నేడు ఇందిరా భవన్ అని పిలుస్తున్నారు.
1988లో ప్రధాని రాజీవ్ గాంధీతో తనకున్న సన్నిహిత పరిచయాల ద్వారా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా జలగం వెంగళరావు స్థానంలో ఎంపికయ్యారు. 1988-89 వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. 1989 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాకుండా తానే స్వయంగా వెంకటగిరి నుంచి పోటీ చేసి మొదటి సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1989-90 వరకు చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం మరియు అటవీ శాఖల మంత్రిగా పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి దిగిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 1990-92 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా పనిచేశారు.
జనార్దనరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే రాజీవ్ గాంధీ మరణం, 1991లో పివి ప్రధాని కావడం జరిగింది. పివి సహాయ సహకారాలతోనే రాజకీయాల్లోకి పైకొచ్చిన నేదురుమల్లి తర్వాత కాలంలో ఆయనతో రాజకీయ విరోధాన్ని పెంచుకున్నారు. జనార్దన రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలను జరిపించే బాధ్యతను భుజానవేశారు పివి. అందుకు ప్రత్యేక ఉదాహరణ 1992లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లినరీ సమావేశాలు. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీలో వివిధ ముఠాలను అదుపులో పెట్టడంలో సమర్ధుడైన జనార్ధనరెడ్డి పార్టీలో అసమ్మతిని అదుపుచేయటానికి అనేక చర్యలు చేపట్టారు. శాసనసభా సభ్యుల మద్దతు కూడగట్టుకోవటానికి వాళ్ళకు హైదరాబాదులోని సంపన్న ప్రదేశాలలో స్థలాలు మంజూరు చేశారు. టెలిఫోను బిల్లులకై ప్రత్యేక అలవెన్సులు, కార్లు కొనుక్కొవడానికి బ్యాంకుల నుంచి సులువైన పద్దతిలో ఋణాలు ఇప్పించారు.
1992 జూన్లో సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే ప్రైవేటు యాజమాన్యం ననిర్వహణలో 20కి పైగా ఉన్న ఇంజనీరింగు, వైద్య కళాశాలలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విధంగా కళాశాలలను స్థాపించడానికి పర్మిట్లు పొందిన అనేక విద్యా సంస్థలు సారా వ్యాపారులు, ఎక్సైజు కాంట్రాక్టర్లు, మంత్రులు పెట్టుబడి పెట్టినవే. వీటికి అనుమతులు మంజూరు చేయడానికి జనార్ధనరెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని వదంతులు వ్యాపించాయి.
ఇదే అంశంపై జనార్దన రెడ్డి ప్రభుత్వంపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తీర్పుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కళాశాలకు అనుమతులు మంజూరు చేయడంలో అనేక అవకతవకలు జరిగినట్టు నిర్ణయించి, అనుమతి జారీ చేస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును రాజ్యంగ విరుద్ధమని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయన స్థానంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డిని కాంగ్రేసు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. ఒకవేళ 1994 వరకు జనార్దన రెడ్దని సీఎంగా ఉంచి ఉంటే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెదేపా తిరిగి అధికారంలోకి రావడం జరిగేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
1994 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఓటమి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ముగిసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేలా చేసింది. 1996 లోక్ సభ ఎన్నికల్లో నరసారావుపేట లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికి ప్రధాని పివి టిక్కెట్ ఇవ్వలేదు. అయితే, 1998 నాటికి తన పాత పరిచయాలను ఉపయోగించుకొని సోనియా గాంధీ ప్రాపకంతో బాపట్ల నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో నరసరావుపేట నుంచి, 2004లో విశాఖపట్నం నుంచి వరసగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
జనార్దన రెడ్డికి రాష్ట్ర రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లోనే పరిచయాలు ఎక్కువ గాంధీల కుటుంబం తర్వాత ఆయనకు పలువురు నేతలు చివరి వరకు సన్నిహితంగా మెలిగారు. తమిళనాడుకు చెందిన రాజకీయ దిగ్గజం జి.కె.మూపనార్, ఆయన శిష్యుడైన మాజీ ఆర్థీక శాఖ మంత్రి చిదంబరంతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే దిగ్విజయ్ సింగ్ అయితే వీరికి ఏకలవ్య శిష్యుడు. తమిళనాడు మాజీ సిఎంలైన దివంగత కరుణానిధి, జయలలితలు, కర్ణాటక మాజీ సిఎంలైన గుండూరావు, వీరేంద్ర పాటిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు లెక్కకు మించిన సన్నిహితులు ఉన్నారు.
జనార్దన రెడ్డికి రాజకీయాల్లో ఎందరినో పైకి తీసుకొచ్చారు. మాజీ మంత్రులైన మాదాల జనకీరాం, కలికి యానాది రెడ్డి తో పాటుగా మాజీ ఎమ్యెల్యేలైన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, జెకె రెడ్డి, ఆనం సోదరులు, మాగుంట సోదరులు, కేంద్ర మాజీ పనబాక లక్ష్మి వంటి ఎందరినో చేరదీసి, ఆదరించి వారు రాజకీయాల్లో ఎదిగేలా చేశారు. అదే విధంగా తనకి ఇష్టం లేని ఎందరినో రాజకీయాల్లో పైకి రాకుండా తోక్కేసిన ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. అందుకు ప్రత్యేక ఉదాహరణ కోటంరెడ్డి సోదరులు (విజయ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర నేత మరియు నుడా ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి).
జనార్దన రెడ్డి రాజకీయ జీవితంలో విరోధాలు గురించి చెప్పుకోకుండా ఆయన ప్రస్థానం ముగియదు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న సమయంలో కోట జమీందారులైన నల్లపురెడ్డి బ్రదర్స్ (శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర రెడ్డి)ను రాజకీయంగా తనకి ఎదురు రాకుండ తొక్కేయాలని చేసిన ప్రయత్నాలలో రాజకీయ విరోధం కాస్త వ్యక్తిగత విరోధంగా మారింది. ఆరంభంలో నల్లపురెడ్లదే పైచేయిగా సాగినా అనంతర కాలంలో జనార్దన రెడ్డి పైచేయి సాధించి సీఎంగా ఉన్న దశలో మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఆయన ఆకస్మిక మరణంలో భాగం అయ్యారు అంటారు రాజకీయ పండితులు.
నల్లపురెడ్డి తర్వాత తన రాజకీయ గురువుల్లో ఒకరైన పివిని సైతం జనార్దన రెడ్డి అవమానించేలా వ్యాఖ్యలు చేశారని చెబుతారు. తన వారి ద్వారా ఆ మాటలు విన్న పివి జనార్దన రెడ్డిని రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితులు కల్పించడమే కాకుండా, తనకు అత్యంత సన్నిహితం అని చెప్పుకునే వైయస్సార్ ద్వారా సైతం తన రాజకీయ కక్షను తీర్చుకున్నారు. పివి తర్వాత నేదురుమల్లిని మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి వైఎస్సార్. 90ల్లోనే తనను సీఎం అవ్వకుండా అడ్డుకున్న వ్యక్తుల్లో జనార్దన రెడ్డి ఒకరని వైఎస్ తన సన్నిహితుల వద్ద పలు మార్లు పేర్కొన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అవ్వాలనే కోరికతో ఉన్న జనార్దన ఆశలపై నీళ్లు జల్లడమే కాకుండా, ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోకుండా అడ్డుకున్నారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికి వైఎస్ టిక్కెట్ ఇప్పించలేదు. ఆ విధంగా జనార్దన రెడ్డి క్రియాశీలక రాజకీయ జీవితానికి తెరపడింది.
జనార్దన రెడ్డి పదవుల్లో ఉన్న సమయంలో ఆయన ఎందరికో ఎన్నో సహాయాలు చేశారు. ఎందరికో ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు సైతం ఇప్పించారు. ఆంధ్రా బ్యాంకులో ఒకానొక సమయంలో ఆయన సిఫారస్సు ద్వారా ఉద్యోగాలు పొందినవారే ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మార్చి జిల్లా యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ఆయన కలలు కనేవారు. ఆ కలలు నెరవేర కుండానే కాలేయ వాధ్యితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూనే 2014, మే 9న తన 79వ ఏట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్