భారత ఎన్నికల నిపుణుడు-కె.జె.రావు
- March 01, 2025
ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువు పట్టు. అలాంటి ప్రక్రియలో రాజకీయ నాయకుల అనుచిత ప్రమేయము మొత్తం వ్యవస్థకే శాపగ్రస్థం. ఇలాంటి అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన ఘనత కె.జె.రావు సొంతం.జమ్మూకాశ్మీర్, బీహార్ లాంటి తీవ్రవాద పంథా ఉండే ప్రమాదకర రాష్ట్రాల్లో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడాయన. నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ పరిశీలకులు, ఎన్నికల నిపుణులు కె.జె.రావు జన్మదినం సందర్భంగా ఆయన పై ప్రత్యేక కథనం...
కె.జె.రావుగా ఉత్తర భారత రాష్ట్రాల్లో సూపరిచితులైన కొమ్మాజోస్యుల జగన్నాథరావు 1942, మార్చి 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన అవిభక్త విశాఖ జిల్లా ఆమదాలవలస తాలూకా కొండలమామిడివలస గ్రామంలో జన్మించారు. తండ్రి పంతులు ఊరి కరణం మరియు ఉపాధ్యాయులుగా ఉండేవారు. తండ్రి దగ్గరే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనంతరం హైస్కూల్ విద్య కోసం తమ గ్రామానికి దగ్గర్లో ఉన్న మెట్టపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నం వెళ్లి ఇంటర్ పూర్తి చేసి ప్రముఖ ఎ.వి.ఎన్ కళాశాలలో హెచ్.ఈ.సి విభాగంలో ఇంటర్మీడియట్
తండ్రి, మేనమామ సలహా మేరకు ఇంటర్ తర్వాత పూర్తి చేసిన తర్వాత రావు టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీచర్ ఉద్యోగం వచ్చింది. 1962-63 మధ్యలో 8 నెలల పాటు ఆ ఉద్యోగంలో ఉన్న సమయంలోనే పుణెలోని రక్షణ ఆడిట్ విభాగంలో జూనియర్ ఆడిటర్ ఖాళీలు చూసి దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆడిటింగ్ విభాగంలో చేరారు. ఇదే సమయంలో దూరవిద్య ద్వారా డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేశారు.
డిఫెన్స్ ఆడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో తన సహోద్యోగులతో కలిసి యూపీఎస్సీ గ్రూప్ బికి ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే సెలెక్ట్ అయ్యారు. 1966లో భారత ఎన్నికల సంఘంలో అధికారిగా చేరారు.నాటి నుంచి పదవి విరమణ పొందే వరకు అక్కడే పలు హోదాల్లో పనిచేశారు. 2002లో ఎన్నికల సంఘం కార్యదర్శిగా పదవి విరమణ పొందారు.
దేశంలో ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా జరిగేలా చూడాలనే ఉద్దేశ్యంతో 80వ దశకం మధ్యలోనే ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. వాటిని పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణలో ప్రవేశపెట్టే ముందు ప్రయోగాత్మకంగా కేరళలోని అసెంబ్లీ ఉపఎన్నికల్లో, ప్రధాని రాజీవ్ గాంధీ పోటీ చేసిన అమేథీలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా 1989 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని రాజీవ్ గాంధీ పోటీ చేసిన అమేథీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై విచారణకు నియమించిన కమిటీలో కె.జె.రావు సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుండి పలు ఎన్నికల కమిటీల్లో రావు సభ్యుడిగా పనిచేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారిగా శేషన్ నియమితులైన తర్వాత రావు ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. శేషన్ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన పలు సంస్కరణల్లో రావు గారు సైతం ముఖ్యపాత్ర పోషించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘన చేసే రాజకీయ నాయకుల పాలిట కఠినమైన చర్యలు తీసుకోవాలని శేషన్ ఆధ్వర్యంలో రావు మరియు ఇతర అధికారులు రిపోర్ట్ తయారు చేసి అప్పటి ప్రభుత్వానికి , సుప్రీంకోర్టుకు సమర్పించారు.
పదవి విరమణ తర్వాత రావుకు ఉన్న విశేష అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్న ఎన్నికల సంఘం ఆయన్ని ఎన్నికల సంఘం సలహాదారుగా అప్పటి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జె.ఎం. లింగ్డో నియమించారు. 2002 నుంచి 2004 వరకు రావు గారు సలహాదారుగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన ఆధ్వర్యంలో తీవ్రవాదుల వల్ల ముప్పు అధికంగా ఉన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను రావు గారు తీసుకొని ప్రతి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకుని ఆ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించి వార్తల్లోకెక్కారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన విధంగానే 2005లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గుండాయిజం, మావోయిస్టుల అడ్డాగా ఉన్న బీహార్ రాష్ట్రంలో 80వ దశకం నుంచి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ చాలా క్లిష్టతరంగా ఉండేది. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ లేదా ఈవీఎంల అపహరణ, రాజకీయ నాయకుల అనుచరుల రిగ్గింగ్ వంటి పలు అవాంఛనీయ సంఘటనలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వసాధారణంగా ఉన్న దశలో రావు గారు 2005 అసెంబ్లీ ఎన్నికలను చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పోలింగ్ రోజున ఎటువంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలింగును ప్రశాంతంగా నిర్వహించారు.
బీహార్ రాష్ట్రంలో అంత స్వేచ్ఛా స్వతంత్రతో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూతులకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అన్ని రాజకీయ పార్టీలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రావు గారు సాధించిన ఈ విజయం ఆయన్ని బీహార్ ప్రజల్లో హీరోగా నిలబెట్టింది. ఎంతలా అంటే ఇప్పటికి ఆయన్ని బీహార్ ప్రజలు ఆరాధిస్తారు. ఆ విధంగా బీహార్లో ఉన్న సంఘ విద్రోహక శక్తులకు ఎదురొడ్డి పోరాడి ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన రావు గారిని జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. బీహార్ తర్వాత జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లను తీయడంలో కీలకంగా వ్యవహరించారు.
2006లో ఎన్నికల సంఘం పరిశీలకుడిగా వైదొలగిన రావు గారు ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలని, ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు తన ఎన్నికల సంఘం అధికార మిత్రులతో కలిసి" ఫౌండేషన్ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్" సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థ వ్యవహారాల్లో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకునిగా, గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల శిక్షణ విభాగం సభ్యుడిగా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మారుమూల కుగ్రామంలో జన్మించిన కె.జె.రావు తన కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశం గర్వించదగ్గ ఎన్నికల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రావు గారు లాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వారు కావడం ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణం.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!