14న 'జయకేతనం' పేరుతో జనసేన ఆవిర్భావ సభ

- March 12, 2025 , by Maagulf
14న \'జయకేతనం\' పేరుతో జనసేన ఆవిర్భావ సభ

పిఠాపురం: ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని… ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ తెలిపారు.

ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామని ఆయన వెల్లడించారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారని వివరించారు. రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టామని వెల్లడించారు. ఇక మూడవ ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com