ఆధునిక మహారాష్ట్ర శిల్పి-యశ్వంతరావ్ చవాన్

- March 12, 2025 , by Maagulf
ఆధునిక మహారాష్ట్ర శిల్పి-యశ్వంతరావ్ చవాన్

యశ్వంతరావ్ చవాన్...భారతదేశ రాజకీయాల్లో శిఖరసామానులైన నేతల్లో ఒకరు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చవాన్ సాహెబ్ మహాత్ముడి స్పూర్తితో చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.మరాఠా సమాజాన్ని రాజకీయాల్లో అణచాలనే దురుద్దేశంతో చేసిన ప్రయత్నాలను విఫలం చేశారు.కేంద్ర మంత్రివర్గ వ్యవస్థలో కీలక మూల స్థంభాలైన విదేశాంగ, ఆర్థిక, హోమ్ మరియు రక్షణ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. మహారాష్ట్రను దేశ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలిపిన ఘనత ఆయన సొంతం అంటే అతిశయోక్తి కాదు. నేడు మరాఠా రాజకీయ శిఖరం యశ్వంతరావ్ చవాన్ జయంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ... 

భారతదేశ రాజకీయాల్లో చవాన్ సాహెబ్‌గా ప్రసిద్ధిగాంచిన  యశ్వంతరావ్ బల్వంతరావ్ చవాన్ 1913, మార్చి 12న ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో భాగమైన అవిభక్త సతారా జిల్లా దేవరాష్ట్రే గ్రామంలో మధ్యతరగతి మరాఠా రైతు కుటుంబానికి చెందిన బల్వంతరావ్ చవాన్, విఠాబాయ్ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయనకు తండ్రి లేని లోటు తెలియకుండా తల్లి మరియు  మేనమామలు గారాబంగా పెంచారు. కరద్ పట్టణంలో హైస్కూల్ వరకు చదువుకున్న తర్వాత కొల్హాపూర్ పట్టణంలోని రాజారామ్ కాలేజీలో ఇంటర్, బీఏ (పొలిటికల్ సైన్స్) పూర్తిచేశారు. ఆ తర్వాత పూణే లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. 

చవాన్ విద్యార్ధి దశలోనే మహాత్ముడి స్పూర్తితో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత లాయర్‌గా పనిచేస్తున్న సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ వచ్చారు.క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1946లో దక్షిణ సతారా నుంచి బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే ఏడాది రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.ఎం.మున్షికి పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులై 1952 వరకు పనిచేశారు. 1952లో ఉత్తర కరద్ నుంచి రెండోసారి ఎన్నికైన తర్వాత మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో పౌరసరఫరాలు, స్థానిక సంస్థల పరిపాలన, అటవీ మరియు కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ శాఖల మంత్రిగా 1956 వరకు పనిచేశారు. 

1956లో మొదలైన గుజరాత్ రాష్ట్ర ఉద్యమ సెగతో సీఎం పదవికి రాజీనామా చేసిన మొరార్జీ స్థానంలో సమర్ధుడైన మూడో బొంబాయి రాష్ట్ర  చవాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరాఠా సామాజిక వర్గానికి చెందిన మొదటి సీఎంగా చవాన్ నిలిచారు. 1957 అసెంబ్లీ ఎన్నికలు చవాన్ నాయకత్వంలో జరగగా కాంగ్రెస్ మరోపర్యాయం అధికారంలోకి వచ్చింది. సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ రాష్ట్ర సాధన ఆందోళనకారులతో మాట్లాడి భాషాప్రయుక్తంగా బొంబాయి రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అంగీకరించడమే కాకుండా కాంగ్రెస్ అధిష్టానాన్ని, అప్పటి ప్రధాని నెహ్రూను ఒప్పించారు. 1960లో బొంబాయి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మహారాష్ట్ర తోలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

1962 అసెంబ్లీ ఎన్నికల్లో చవాన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే, 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిని చవిచూసిన తర్వాత అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సమర్ధుడైన చవాన్  గారిని బాధ్యతలు చేపట్టామని ప్రధాని నెహ్రూ కోరడంతో సీఎం పదవికి రాజీనామా చేసి దేశ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే శాఖను నెహ్రూ తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సైతం నిర్వర్తించారు. రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు నూతన ఆయుధాలను సమకూర్చేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ఆయన వల్లే దేశ రక్షణ రంగం బలోపేతం అయ్యింది.1966లో మొదటి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో సైతం ఎన్నో సంస్కరణలను  ప్రవేశపెట్టారు.  

1969లో కాంగ్రెస్ రెండుగా చీలిన సమయంలో ఇందిరా గాంధీ వైపు చవాన్ నిలవడమే కాకుండా కాంగ్రెస్ ఎంపీలను ఆమె పక్షానే నిలిచేలా వ్యవహరించారు. 1970లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బ్యాంకుల జాతీయకరణ, రాజ్యభరణాల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేశారు. చవాన్ హయాంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ సామ్యవాద పంథాలోకి మళ్లింది. 1974లో ఇందిరా గాంధీ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1974-77 వరకు ఆ శాఖలో ఉన్న చవాన్ 1975లో ప్రధాని  ఇందిరా దేశంలో విధించిన ఎమెర్జెన్సీ మూలంగా ఆయన అపఖ్యాతి పాలైనప్పటికి ఇందిరాను సమర్థిస్తూ వచ్చారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడటమే కాకుండా స్వయంగా ఇందిరా ఓటమిపాలైన సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా ఎన్నికై ఆరో లోక్ సభలో ప్రతిపక్ష నేతగా 1979 వరకు వ్యూవహరించారు. 

1978లో బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిన సమయంలో పార్టీ సీనియర్ల బాటలోనే ఇందిరా గాంధీపై తిరుబాటు చేసి దేవరాజ్ ఆర్స్ నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్స్) వర్గంలో చేరారు. ఆ అనాలోచిత  నిర్ణయం మూలంగా చవాన్ రాజకీయ జీవితం చరమాంకంలోకి వెళ్ళిపోయింది.

 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వంలో దేశ ఉపప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ నెలల్లోనే ప్రభుత్వం పడిపోవడం, 1980లో ఇందిరా తిరిగి ప్రధాని కావడం చకచక జరిగిపోయాయి. కష్ట సమయంలో తనని వదిలి వెళ్లిన యశ్వంత్ చవాన్ పట్ల ఇందిరా రాజకీయ కక్ష పెంచుకున్నారు. 1981లో చవాన్‌ను ఇందిరా గాంధీ తన పార్టీలోకి రాణించినప్పటికి అడుగడుగునా అవమానాలతో వేధించడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రిగా చవాన్ గారికి ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 8వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా నియమించారు. 1982-84 వరకు చవాన్ ఆ పదవిలో ఉన్నారు. యాదృచ్చికంగా చవాన్ అనుభవించిన చిట్ట చివరి పదవి ఇదే కావడం విశేషం. 

యశ్వంతరావ్ చవాన్ మహారాష్ట్ర సీఎంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్రంలో సహకార మరియు పారిశ్రామిక రంగాలకు పెద్ద పీట వేశారు. ముంబై నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంగా తీర్చిద్దేందుకు చవాన్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే.  నేడు దేశానికే ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న ముంబై నగరం ఎదుగుదలలో ప్రధాన భాగం చవాన్ గారికి దక్కుతుంది. 

చవాన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సాహిత్య రంగంలో కూడా కొనసాగారు. మరాఠీ భాషలో ఆయన పలు పుస్తకాలు రాశారు. మరాఠీ సాహిత్య రంగాన్ని భావి తరాలకు అందివ్వాలనే తలంపుతో సీఎంగా ఉన్న సమయంలోనే మరాఠీ బాషా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు భారీగా నిధులు మంజూరు చేశారు. ఢిల్లీలో ఉన్నా హిందీలో కంటే మరాఠీలొనే మాట్లాడేందుకు ఇష్టపడేవారు. 

చవాన్ గురించి చెప్పుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మరాఠా సామాజిక వర్గాన్ని రాజకీయ రంగంలో అణిచివేసేందుకు మరాఠీ బ్రాహ్మణ వర్గం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో చవాన్ పాత్ర కీలకం. అవిభక్త బొంబాయి రాష్ట్రంలో చవాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో బ్రాహ్మణ   సామాజిక వర్గానికి చెందిన వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయనకు పాలనా వ్యవహారాల్లో సహాయ నిరాకరణ చేయడం ద్వారా చవాన్ ఆగ్రహానికి గురయ్యారు.

 బ్రాహ్మణ అధికార లాబీని సమూలంగా నాశనం చేసేందుకు ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన నిమ్న వర్గాల అధికారులను చవాన్ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. రాజకీయాల్లో మరాఠాల ఆధిపత్యం మొదలైంది చవాన్ తోనే. ఆయన ఇచ్చిన స్పూర్తితో అప్పటి వరకు వ్యవసాయ రంగానికే పరిమితమైన ఆ సామాజిక వర్గీయులు రాజకీయాల్లో క్రియాశీలకం అవుతూ వచ్చారు. చవాన్ సైతం ఎందరో సామాన్య మధ్యతరగతి మరాఠా యువకులను రాజకీయాల్లో పైకి తీసుకువచ్చారు. వారిలో ముఖ్యుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. 

5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సామాన్య కార్యకర్తగా మొదలైన చవాన్ దేశంలోనే అతిపెద్ద రాజకీయ నేతగా ఎదిగినప్పటికి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండానే చివరి వరకు నిరాడంబరంగా జీవించారు.కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగానే ముద్రపడిన ఆయన అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచిన చవాన్ సాహెబ్ 1984, నవంబర్ 25న తన 71వ ఏట గుండె పోటుతో ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణించి నాలుగు దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికి మహారాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలు ఆయన నామస్మరణ చేస్తూనే ఉన్నాయి.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com