ఘనంగా 'తెలుగు జాతీయం-చంద్రబోస్' పాటల విభావరి కార్యక్రమం
- March 16, 2025
హైదరాబాద్: సినిమా సమాజ ఉన్నతిలో భాగస్వామి కావాలి తప్ప, సమాజాన్ని ప్రతికూల విధానాల వైపు నడపకూడదని భారత గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో "ఐ ఫ్లై స్టేషన్", "స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "తెలుగు జాతీయం-చంద్రబోస్" పేరుతో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా అత్యంత ప్రభావశీలమైన బలమైన మాధ్యమమని, దాన్ని సమాజ అభ్యున్నతి కోసం ఉపయోగించాలని సూచించారు. సినిమా రంగం నుంచి తాను ఆకాంక్షిస్తున్నది ఇలాంటి మార్పునే అన్నారు." సమాజంలో నేటికీ ఆక్కడక్కడ మూఢనమ్మకాలు, సామాజిక-లింగ వివక్షలు, నిరక్షరాస్యత, అవగాహనలేమి వంటి పలు ప్రతికూల అంశాలు చోటు చేసుకుంటున్నాయి.వీటి పట్ల సమాజం, యువతను జాగృతం చేసే విధంగా సినిమాలు రావాలి.ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని, భారతదేశ నిజమైన చరిత్రను తెలియజేసే సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచం గుర్తిస్తోంది.మన భాష సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇదే సరైన సమయం. మన భాషను, మన సంస్కృతిని మనమే కాపాడుకోకపోతే...ఇంకెవరు కాపాడుతారు.
- మనమే గౌరవించుకోకపోతే...ఇంకెవరు గౌరవిస్తారు.
- మనమే సంస్కరించుకోకపోతే...ఇంకెవరు సంస్కరిస్తారు? " అని అన్నారు." మనం మనలాగే గుర్తింపు పొందాలి.మనం మనలాగే గౌరవం పొందాలి.నిఖార్సైన భాష సంస్కృతులతో మనగలిగిన నాడు ప్రపంచం మనల్ని గౌరవించి తీరుతుంది. మన కుటుంబ వ్యవస్థకు ప్రపంచమంతా చేతులెత్తి మొక్కడానికి కారణం ఇదే. భారతీయ సంగీతం, కళలు, విద్యలను ప్రపంచం గౌరవించడానికి కారణం కూడా ఇదే." అని చెప్పారు.
"మనకు ఆస్కార్ తెచ్చిపెట్టిన "నాటు నాటు" పాట సైతం స్వచ్ఛమైన తెలుగు పదాలతో నేసినదే. పొలం గట్టు దుమ్ము, పోలేరమ్మ జాతర, కిర్రు చెప్పలు, కర్రసాము, మర్రి చెట్టు నీడ, ఎర్రజొన్న రొట్టె, మిరప తొక్కు...ఇవన్నీ తెలుగు వారి సొంతం." ఇలాంటి అచ్చ తెలుగు పదాలతో పాట రాసి మనం మనలాగా గుర్తింపు పొందవచ్చు అని చంద్రబోస్ నిరూపించారు అని చెప్పారు. చంద్రబోస్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, పెద్ద పెద్ద సమాసాలు, వ్యాకరణ కసరత్తులు లేకుండా…సాధారణ పదాలతో ఆయన పాటలు ఉంటాయని అన్నారు.
ఈ రోజు ఈ కార్యక్రమానికి తాను రావడానికి గల కారణాల్లో... "ఆస్కార్ గ్రంథాలయం - చల్లగరిగ" కూడా ఒకటి అని వెంకయ్య నాయుడు చెప్పారు.
"తాను జీవితంలో ఎదగడానికి కారణం అయిన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్నిర్మించి, యువతకు ప్రేరణగా నిలిచిన చంద్రబోస్ ను, వారికి ప్రోత్సాహం అందిస్తున్న వారి శ్రీమతి సుచిత్రా చంద్రబోస్ లను అభినందించాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక మంచి పనిని నలుగురిలో అభినందిస్తే...ఆ దిశగా మరింత మంది స్ఫూర్తిని పొందుతారని నా ప్రగాఢ విశ్వాసం. 'ఇంటికో స్వచ్ఛాలయం...ఊరికో గ్రంథాలయం' ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్నది నా ఆకాంక్ష. ఆస్కార్ అవార్డుకు స్ఫూర్తిగా చంద్రబోస్... గ్రంథాలయం నిర్మించడం అభినందనీయం. " అని వెంకయ్య నాయుడు అన్నారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన “ఐ ఫ్లై స్టేషన్” సంస్థ నిర్వాహకులు, నటులు ప్రదీప్ ను, వారి సరస్వతి ప్రదీప్ ను, అదే విధంగా “స్పందన” ఫౌండేషన్ సభ్యులను, వారి బృందాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అభినందించారు. బలవన్మరణాలకు ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువతను... ఆ అగాధం నుంచి బయట పడవేయడానికి “స్పందన” ఫౌండేషన్ చొరవ తీసుకోవడం చాలా మంచి విషయం అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







