యువ రాజకీయవేత్త-దేవినేని అవినాష్
- March 16, 2025
దేవినేని అవినాష్ .... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న యువనేతల్లో ఒకరు. బలమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికి తన స్వీయ క్రమశిక్షణ, పట్టుదల,అంకితభావంతో రాజకీయాల్లో ఒక్కోమెట్టు ఎక్కుతూ రాష్ట్ర నేతగా ఎదిగారు. గెలుపోటములతో పనిలేకుండా ప్రజా శ్రేయస్సుకై నిత్యం పరిశ్రామిస్తున్న యువ నాయకుడు దేవినేని అవినాష్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం...
దేవినేని అవినాష్ 1988, మార్చి 15న ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో దేవినేని నెహ్రూ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బికాం పూర్తి చేశారు. అనంతరం లండన్ నగరంలోని లండన్ యూనివర్శిటీ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
అవినాష్ కుటుంబం 70వ దశకం నుంచి విజయవాడ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తుంది. తండ్రి దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ విద్యార్థి నేతగా తన క్రియాశీలక రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని స్థాపించగా కృష్ణా జిల్లా నుంచి ఆ పార్టీలో చేరిన మొదటి నాయకుడు నెహ్రూ గారు. రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ గారి చివరి వరకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నెహ్రూ గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తూ వచ్చారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెహ్రూ ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీలో సైతం రాష్ట్ర నేతగా ఉన్నారు.
తండ్రి స్పూర్తితో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన అవినాష్
యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (యుఎస్ఓ) అధ్యక్షుడిగా తన క్రియాశీలక రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన యువనేతగా ఎదిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి జేఏసి కన్వీనర్‌గా 1,00,000 మంది విద్యార్థులతో కలిసి జలదీక్ష, అనేక ఇతర విద్యార్థి ర్యాలీలతో సహా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అధికార పదవులు అనుభవించి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే ఘోరంగా ఓడుతామని భావించి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖం చాటేసిన సమయంలో అవినాష్ మరియు ఆయన తండ్రి నెహ్రూ గారు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. అవినాష్ గారు ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలైనప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విజయవాడ పార్లమెంటరీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో విభజన చట్టంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై ఎన్డీయే కూటమి మీనమేషాలు లెక్కిస్తుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ విజయవాడ నగరంలో తన నేతృత్వంలో యువతతో కలిసి పలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడ నగరంలో అవినాష్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి విన్న తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కుటుంబ సన్నిహితుల సూచనల మేరకు 2016లో అవినాష్ తన తండ్రితో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో సైతం పదవుల కంటే రాజకీయ నిబద్ధతకే విలువనిచ్చి అధినేత అప్పగించిన ప్రతి పనిని ఆయన అంచనాలకు మించి రాణిస్తూ వచ్చారు. ఆ పార్టీలో పదవుల కోసం అవినాష్ ఎటువంటి పైరవీలు చేయకుండానే తన పనితీరుతో అధినేతను మెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో తన స్థానం కాకపోయినా పార్టీ ఆదేశాల మేరకు గుడివాడ నుంచి పోటీ చేశారు. గుడివాడ టీడీపీ నేతలు వైసీపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అవినాష్ ఓటమికి కారకులయ్యారు. అయినప్పటికీ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ వచ్చారు. అదే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దె రామ్మోహన్ గెలుపునకు కృషి ఆయన్ని గెలిపించారు.
2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ముందుకొచ్చిన మొదటి టీడీపీ నేతగా అవినాష్ ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ అధినేతలు సైతం ఓటమితో కుదేలై ఇంట్లో కూర్చుంటే అవినాష్ మాత్రం అధికార వైసీపీ పెట్టే కేసులను సైతం లెక్కచేయకుండా ధైర్యంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. నాడు అవినాష్ పట్ల రాష్ట్ర యువతలో పెరుగుతున్న ఆదరణ పట్ల అసూయ చెందిన ఆ పార్టీ నేతలు ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు. తన మీద జరిగే తప్పుడు ప్రచారం చేస్తున్న నేతల గురించి అధినేత నారా చంద్రబాబుకు విన్నవించినప్పటికి చర్యలు తీసుకోకపోగా వారికే మద్దతుగా నిలవడంతో అవినాష్ మనస్తాపం చెందారు.
ఇదే సమయంలో తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం కలిగిన యువనేత అవినాష్ గురించి తెలుకున్న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన నేతృత్వంలోని వైసీపీలోకి రమ్మని ఆహ్వానం పలికారు. టీడీపీలో తన పట్ల ఈర్ష్య, అసూయతో తప్పుడు ప్రచారాలు చేసే నేతల మధ్య ఉండలేక 2019 నవంబర్ మాసంలో టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన నాటి నుండి అవినాష్ గారిని సీఎం జగన్ రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. పార్టీలో అవినాష్ చేరిన కొద్దీ సమయానికే విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు.
2019- 24 వరకు విజయవాడ తూర్పు ప్రాంతంలో ప్రభుత్వ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఐదేళ్ల కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెట్టించారు. తనకు ప్రభుత్వ పరంగా ఎటువంటి అధికార హోదా లేకున్నా ప్రజలకు మంచి చేయాలనే గొప్ప సంకల్పంతో ఉన్న యువనేత దేవినేని అవినాష్ గారిని ప్రజలు సైతం అక్కున చేర్చుకున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత మూలంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే, ఓటమి పాలైన తర్వాత రోజు నుంచే అవినాష్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా తిరుగుతూ ప్రజా సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా క్రియాశీలకంగా వైసీపీ కార్యక్రమాలు చేపట్టిన అవినాష్ రాజకీయ నిబద్ధతకు ముగ్దుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ పార్టీ కార్యక్రమాలును చురుగ్గా నిర్వహిస్తూ అధినేత జగన్ నుంచి కితాబులు అందుకున్నారు.
ఒకటిన్నర దశాబ్దం పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అవినాష్ ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగుతున్న అవినాష్ గారిని చట్ట సభల్లో ప్రజా ప్రతినిధిగా తమ సమస్యలపై పోరాడాలని బెజవాడ ప్రజానీకం కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్