భారతీయ పనిమనిషికి భూలోక నరకం చూపిన అరబ్బు షేక్..

- October 23, 2017 , by Maagulf
భారతీయ పనిమనిషికి భూలోక నరకం చూపిన అరబ్బు షేక్..

రియాధ్: కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని పాలోడ్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల మంజుషా అనే మహిళ యదార్థ కథ ఇది..మంజుషా భర్త ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. అయిదేళ్లుగా ఆమె కేరళ లోని ఓ వస్త్ర దుకాణంలో నెలకు 5వేల రూపాయల జీతానికి పనిచేస్తోంది. పాఠశాలలో చదువుకొంటున్న ఇద్దరు కుమార్తెలను  పోషిస్తూ, వారి ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడుతోంది.  పిల్లల భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశం వెళ్లాలని నిర్ణయించుకొంది. ఎంతో ప్రయత్నించినా..పలువుర్ని అడిగినా  సౌదీకి వెళ్లేందుకు వీలుపడిలేదు. ఈ క్రమంలో మణిలాల్  అనే ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. సౌదీలో కారు డ్రైవర్‌గా తాను పనిచేసే ఇంట్లో పనిమనిషి అవసరం ఉందనీ, తీసుకెళ్తానని చెప్పాడు. ఆమె మాటలు నమ్మి డబ్బు అప్పు తీసుకుని మరీ వీసాకు ప్రయత్నాలు చేసింది. కోచి విమానాశ్రయం నుంచి రెండు మూడు సార్లు సౌదీకి వెళ్లేందుకు ప్రయత్నించినా అధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆమె ప్రయత్నం విఫలమయింది. కొద్ది నెలల తర్వాత  మంగళూరు విమానాశ్రయం నుంచి వెళ్లొచ్చని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు మంజుషాకు ఫోన్ చేశారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగి.. ఈ యేడాది మార్చి 20న ఆమె సౌదీలో అడుగుపెట్టింది. ముందుగా హామీ ఇచ్చినట్లుగానే దమ్మాం విమానాశ్రయంలో మనీలాల్ ఆమె కోసం ఎదురు చూడసాగాడు. అతడితోపాటు ఓ సౌదీ పౌరుడు కూడా ఉన్నాడు. అరబ్బు కారులో ఆమెతోపాటు మణిలాల్    కూడా ప్రయాణించసాగారు. కొద్ది దూరం వెళ్లాక మణిలాల్  కారు దిగి.. అరబ్ షేక్‌కు ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయాడు. అక్కడ ఏం జరుగుతోందో.. ఆమెకు అప్పటికే అర్థం అయింది.. తాను పనిచేసేది మనీలాల్ ఉంటున్న ఇంట్లో కాదని ఆమె గ్రహించింది. దు:ఖం పొంగుకొస్తున్నా ఓర్చుకుంది. ఓ మూడు అంతస్థుల భవనంలోకి కారు ప్రవేశించింది. అది ఇంద్ర భవనం కాదు.. తనకు నరకకూపం అని ఆమె మొదట్లో గ్రహించలేకపోయింది. ఆ అరబ్బు షేక్ ఇంట్లో 16 మంది పిల్లలు భార్యలు మొత్తం 32 మంది ఉంటారు. ఏ పనీ చేయరు. వారి బాగోగులు చూడటం, వండటం, దుస్తులు ఉతకటం, ఇంటిపని చూడటం... అన్నీ మంజుషానే చూడాలి. రోజుకు 20 గంటలకు పైగానే కష్టపడేది. ఉదయం ఆరు గంటలకు ఆమె పని ప్రారంభిస్తే.. రాత్రి 2గంటల సమయంలో పని పూర్తయ్యేది. ప్రతిరోజూ 20గంటలకు పైగా పనిచేస్తూ ఆరు నెలల పాటు నరకం అనుభవించింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెలకు ఆమెకు 1400 సౌదీ రియాల్స్(24వేల 200 రూపాయలు) వేతనం ఇవ్వాలి. కానీ ఆమెకు నెలకు 1000 రియాల్స్ (17వేల రూపాయలు) మాత్రమే ఇచ్చేవాళ్లు. మొదటి నెల జీతం ఇవ్వలేదు.. రెండో నెలలో కూడా ఆలస్యం చేస్తే.. ఎంతో వేడుకుంటే ఒక నెల జీతాన్ని మంజుషా తండ్రి అకౌంట్‌లో వేశారు. అన్నం పెట్టకుండా, జీతం ఇవ్వకుండా 20, 30 కిలోల బరువులెత్తే పనులు కూడా చేయించడంతో నరకం అనుభవించిందామె. ఆ నరక కూపం నుంచి తప్పించుకునేందుకు మూడు సార్లు ప్రయత్నించిందామె. ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె దొరకిపోవడంతో బాధలు మరింత ఎక్కువయింది. ఆమెతో ఖాళీ పత్రాలపై సంతకం చేయించుకున్నారు. ‘జీతం అంతా చెల్లించారు. యజమాని నాకు ఏ బాకీ లేడు’ అనే సారాంశం ఉన్న పత్రాలు అవి అని తర్వాత ఆమెకు తెలిసింది.  ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్లు తిని వదిలేసిన కంచాల్లోని భోజనాన్ని తినేది. చెత్త కుప్పల్లోని ఆహార పదార్థాలను తీసుకుని తినేది. చివరకు ఓ రోజు అందరూ పడుకున్న సమయంలో ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి.. భారతీయుల కోసం నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ వద్దకు చేరుకుంది. కాళ్ల నిండా రక్తం కారుతూ, వడలిపోయి ఉన్న ఆమెను చూసిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యజమానిపై కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పటికప్పుడు చికిత్స చేయించారు. అధికారుల చొరవతో ఎట్టకేలకు ఆమె స్వగ్రామానికి చేరింది.‘ఇకపై నేను నా జీవితంలో నా దేశాన్ని, నా ఊరును వదిలి వెళ్లను. ఇక్కడే ఉంటా.. ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతా. అన్నయ్యలూ, చెల్లెమ్మలూ మీరు కూడా వెళ్లొద్దు. అందంగా కనిపించే నరకం అది. నా కూతుళ్ల భవిష్యత్తు కోసం కష్టపడాలి. వాళ్లను చదివించాలి. సౌదీకి వెళ్లేందుకు తీసుకున్న అప్పులను తీర్చాలి. అవే నా ముందున్న బాధ్యతలు’ అని మంజుషా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com