విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత

- May 26, 2018 , by Maagulf
విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత

విప్లవ చిత్రాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కలిగించిన నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఇటీవల హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా వెంటిలెటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 4.41 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.

మాదాల మరణవార్తతో సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కుమారుడి ఇంటికి తరలింపు 
మాదాల రంగారావు పార్దీవ దేహాన్ని హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన కుమారుడు మాదాల రవి నివాసానికి తరలించారు. ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం రవి నివాసంలో ఉంచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి వృత్విరీత్యా డాక్టర్. అయితే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అభ్యదయ చిత్రాల్లో నటించి హీరోగా మెప్పించారు. వామపక్ష ఉద్యమాలలో భాగమయ్యారు.
 
మాదాల జననం, జీవితం 
మాదాల రంగారావు స్వగ్రామం ప్రకాశం జిల్లా మైనంపాడు. 1948 మే 25న ఆయన జన్మించారు. మాదాల నవతరం పిక్చర్స్‌ బ్యానర్ స్టాపించి విప్లవ చిత్రాలను రూపొందించారు. తన సినీ కెరీర్‌లో మాదాల రంగారావు అభ్యుదయ, విప్లవ చిత్రాలను నిర్మించి ప్రజలకు స్ఫూర్తి కలిగించారు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్‌ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు.
 
విప్లవ చిత్రాలతో సంచలనం
1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు. నాంపల్లి స్టేషన్ కాడా రాజా లింగో, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా, అమరవీరులెందరో అనే పాటలు అత్యంత ప్రజాదరణను పొందాయి.
 
వామపక్ష సిద్ధాంతాలకు అండదండ
తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి మాదాల రంగారావు విరాళంగా ఇచ్చేవారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన లాభాన్ని స్థానిక సీపీఎం కార్యాలయాలకు అందించేవారని చెప్పుకొంటారు. మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకొన్న సిద్ధాంతాలను తుదిశ్వాస వరకు విడవలేదు. తండ్రి రంగారావు బాటలోనే మాదాల రవి నడుస్తూ ఆయనకు ఆదర్శంగా నిలిచారు.
 
దర్శకుడు టీ కృష్ణతో అనుబంధం
నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్‌ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు. ప్రముఖ దర్శకుడు, హీరో గోపిచంద్ తండ్రి టీ కృష్ణతో మంచి అనుబంధం ఉంది. 80వ, 90 దశకాల్లో వామపక్ష భావజాలంతో రూపొందిన వీరి చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. ఓ దశలో స్టార్ హీరోలకు ధీటుగా మాదాల రవి నిర్మించిన చిత్రాలు కలెక్షన్లను సాధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com