అనారోగ్యంతో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి

- November 11, 2018 , by Maagulf
అనారోగ్యంతో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి

బెంగళూరు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంత్ కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి చికిత్సను అదే ఆసుపత్రిలో తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ శంకర్ ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. 1959 సెప్టెంబర్ 22న అనంత్ కుమార్ బెంగళూరులో జన్మించారు. వాజ్‌పేయ్ ప్రధాన మంత్రిగా పనిచేసినప్పుడు.. ఆయన మంత్రివర్గంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంత్ కుమార్ ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో తొలిసారిగా లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014లో రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ను నిర్వర్తించారు. జులై 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

అనంత్ కుమార్‌ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనంత్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి, కర్ణాటక ప్రజలకు తీరని లోటన్నారు. అనంత్ కుటుంబ సభ్యులకు, సహచరులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ అనంత్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకుడిగా ఉన్నప్పుడే అనంత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారని.. అప్పటి నుంచి ఆయన మరణం దాకా సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు. తను చేసిన మంచి పని వల్ల ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ తెలిపారు.

కర్ణాటకలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో అనంత్ ప్రముఖ పాత్ర పోషించారని ప్రధాని గుర్తు చేశారు. ఈసందర్భంగా అనంత్ భార్య తేజస్విని, మిగితా కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com