మొదటి ప్రపంచ యుద్ధ అమరవీరులకు అంజలి ఘటించిన ప్రపంచం
- November 11, 2018
పారిస్, నవంబర్ 11: మొదటి ప్రపంచ యుద్ధంలో అమూల్యమైన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన వీర సైనికులకు ప్రపంచం శిరస్సు వంచి అంజలి ఘటించింది. వారి త్యాగాలను గుర్తుచేసుకుని ఘనంగా నివాళులర్పించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం పారిస్‌లోని చాంప్స్-ఎలిసీ మార్గంలోని ప్రఖ్యాత ఆర్క్ డి ట్రైయంఫ్ యుద్ధ స్మారకం వద్ద సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 70 దేశాల ప్రభుత్వాధినేతలు/వారి ప్రతినిధులు హాజరయ్యారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వారికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. వెంకయ్యనాయుడికి ఎలిసీ రాజప్రసాదంలో మక్రాన్ సాదర స్వాగతం పలికారు.
తర్వాత ఆర్క్ డి ట్రైయంఫ్ వద్ద ఉన్న ఓ యుద్ధ సైనికుడి స్మారకం వద్ద అతిరథ మహారథులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్, భాగస్వామ్య దేశాలకు చెందిన 3,400 మంది తొలి తరం యుద్ధవీరులను సన్మానించారు. ఫ్రాన్స్ సైనిక దళాల విన్యాసాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. నాటి యుద్ధంలో పాల్గొన్న 8 దేశాల సైనికుల వివరాల్ని ఆయా దేశాల స్థానిక భాషల్లో పాఠశాల విద్యార్థులు చదివినప్పుడు ప్రాంగణమంతా పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది.ఆలస్యంగా చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, వరుసలో చివరన నిల్చున్నారు. ఇటీవల తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో డొనాల్డ్ ట్రంప్ అంటీముట్టనట్లే ఉన్నారు. వర్షంతో కొద్దిసేపు కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు నాటి వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1.8 కోట్ల మంది మరణించారు.
ఫ్రాన్స్‌లో భారతీయ సైనికుల జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు
మొదటి ప్రపంచ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలర్పించిన భారత సైనికుల జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లావెంటీ పట్టణంలో ఐదడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఇలాంటివే మరో 57 స్మారక విగ్రహాల్ని నెలకొల్పుతామని ఇంటర్ ఫెయిత్ షహీదీ కమెమోరేషన్ అసోషియేషన్ (ఐఎఫ్‌ఎస్‌సీ) తెలిపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారతీయుల వీరోచిత సాహసాలను వివరిస్తూ తాను రాసిన అన్‌సంగ్ ఇండియన్ హీరోస్ ఆఫ్ వరల్డ్ వార్-1 అనే పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరిస్తామని ఐఎఫ్‌ఎస్‌సీ అధ్యక్షుడు రమేశ్‌చందర్ వోహ్రా చెప్పారు.రిచెబర్గ్ నగరం నీవ్-ఛాపెల్లేలో భారత యుద్ధ వీరుల స్మారకార్థం 12 టన్నుల భారీ కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తున్నామని, 2019లో దీన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
ట్రంప్‌కు టాప్‌లెస్ నిరసన!
కాన్వాయ్‌కు అడ్డంగా దూసుకువచ్చిన మహిళా కార్యకర్త పారిస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేండ్లు పూర్తి అయిన సందర్భంగా పారిస్‌లో నిర్వహిస్తున్న సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్‌కు ఓ మహిళా హక్కుల కార్యకర్త నుంచి ఊహించని షాక్ ఎదురైంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాంప్స్ ఎలిసీ మార్గంలో ట్రంప్ కాన్వాయ్ వస్తుండగా మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అర్ధనగ్నంగా దూసుకువచ్చారు. ఆమె తన ఛాతి భాగంలో నకిలీ శాంతిదూత అని రాసుకుని ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని పారిస్‌కు చెందిన ఫెమెన్ అనే మహిళా హక్కుల సంస్థ ప్రకటించింది. ఈ నిరసనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పారిస్ పోలీసులు ప్రకటించారు.
తొలి యుద్ధ వీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి
మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికులకు ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా నివాళులు అర్పించారు. భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధంలో భారతీయ సైనికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన ధైర్యసాహసాలతో పోరాడారని మోదీ గుర్తుచేశారు. కేవలం శాంతి కోసమే తమ సైనికులు కదనరంగంలోకి దూకారని చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులను జాతి యావత్తూ స్మరించుకొంటున్నదని, వారికి అంజలి ఘటిస్తున్నదని ఆదివారం వరుస ట్వీట్లలో ప్రధాని పేర్కొన్నారు. భయానక యుద్ధం ముగిసి నేటితో (11వ తేదీ) వందేండ్లు పూర్తయ్యాయి. కానీ, ప్రపంచ శాంతి కోసం భారతదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటిస్తున్నా. యుద్ధం వల్ల సంభవించిన మరణాలు, విధ్వంసం వెంటాడకుండా శాంతి, సామరస్యాలు, సోదరభావంతో నిండిన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి కృషిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా అని మోదీ అన్నారు. తొలి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని నీవ్-ఛాపెల్లే, ఇజ్రాయెల్‌లోని హైఫాల్లో నిర్మించిన స్మారకాలను తాను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి