రూపాయి మళ్లీ..

రూపాయి మళ్లీ..

ముందురోజు స్వల్పంగా కోలుకున్న రూపాయి తిరిగి బలహీనపడింది. బుధవారం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తొలుత 70.75 వరకూ జారినప్పటికీ చివర్లో కోలుకుంది. 3 పైసల స్వల్ప లాభంతో 70.46 వద్ద ముగిసింది. అయితే అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాద భయాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథ పాలసీ నేపథ్యంలో మరోసారి నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 38 పైసలు(0.55 శాతం) క్షీణించి 70.84 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 44 పైసలు(0.62 శాతం) నీరసించి 70.90 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, దేశీ స్టాక్స్‌లో ఇటీవల తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ఆరంభంలోనే నష్టాలు
రూపాయి నాలుగు రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్‌పడిన సంగతి తెలిసిందే. వారం ప్రారంభంలో రూపాయి 88 పైసలు(1.25 శాతం) పతనమై 70.46 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 70 మార్క్‌ ఎగువకు తిరోగమించింది. ఈ బాటలో మంగళవారం సైతం 3 పైసలు క్షీణించి 70.49 వద్ద ముగిసింది. అయితే బుధవారం నామమాత్రంగా బలపడింది. కాగా..నేడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. దీంతో రూ. 10,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేయనుంది. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ రూపాయి కొంతమేర బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Back to Top