ప్రగతి శీల సామ్యవాది-లోహియా
- March 25, 2025
లోహియా...భారత దేశ రాజకీయాలను సామ్యవాద భావజాలం వైపు నడిపించిన ముఖ్యనాయకుడు. సాంఘిక దురాచారాలను రూపుమాపిన నాడే భారతదేశానికి అసలైన స్వేచ్ఛా, స్వాతంత్రం వస్తాయని నినదించిన తోలి రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని బడుగు, బలహీన వర్గాలు సవాలు చేస్తారని సైతం తన వ్యాసాల్లో పేర్కొన్నారు. సోషలిజం సిద్ధాంతాలను అందరికి అర్ధమయ్యే రీతిలో పలు రచనలు సైతం చేశారు. భారత సోషలిస్టు రాజకీయ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా మీద ప్రత్యేక కథనం...
రామ్ మనోహర్ లోహియా 1910, మార్చి 23న ఒకప్పటి యునైటెడ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని అక్బర్పూర్ పట్టణంలోని సంపన్న మార్వాడి వ్యాపారవేత్తల కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రి హీరాలాల్ స్వయంగా ఆలనాపాలన చూస్తూ వచ్చారు. లోహియా చిన్నతనంలోనే తండ్రితో కలిసి బొంబాయి (నేటి ముంబై) నగరానికి వెళ్ళిపోయింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్, కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని విద్యాసాగర్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్న ఫెడ్రిక్ విలియమ్స్ కళాశాల నుంచి భారతదేశంలో ఉప్పుపై పన్ను అనే అంశం మీద పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు.
లోహియా చిన్నతనం నుంచే జాతీయవాద భావజాలం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. బొంబాయిలోని వారింటికి నాటి స్వాతంత్య్ర సమరయోధులు వచ్చేవారు. గాంధీజీ నాయకత్వంలో దేశ స్వాతంత్య్ర పోరాటం కోసం జరుగుతున్న పోరాటాలను దగ్గరగా చూస్తూ రావడంతో మహాత్ముడి అహింసాయుత సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళినప్పటికి అక్కడి రాజకీయ వాతావరణం నచ్చక జర్మనీ వెళ్లి చదువుకున్నారు. జర్మనీ రాజకీయ పరిస్థితులపై ఆకళింపు చేసుకొని అక్కడి భారతీయ విద్యార్థులతో క్రియాశీలక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. జర్మనీలో ఉన్నప్పుడే వామపక్ష సోషలిజం భావజాలంవైపు పయనించడం మొదలుపెట్టారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా పనిచేయడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల భౌతిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. 1934లో నెహ్రూ, జయప్రకాష్ నారాయణ్ మొదలైన వారితో కలిసి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్య్రం సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకోవాల్సిన ఆవశ్యకతను లోహియా పలు మార్లు బహిరంగంగానే తెలియజేస్తూ వచ్చారు. 1940-47 మధ్యలో దేశంలో జరిగిన పలు ఆందోళన కార్యక్రమాల్లో లోహియా క్రియాశీలకంగా పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో వచ్చిన సిద్ధాంతపరమైన భేధాభిప్రాయాల మూలంగా 1948లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఇతర సోషలిస్టు నేతలతో కలిసి భారతీయ సోషలిస్టు పార్టీని స్థాపించారు. 1952 మొదటి లోక్ సభ ఎన్నికల్లో సోషలిస్టులు ఓటమి పాలైన తర్వాత జయప్రకాశ్ నారాయణ్ రాజకీయాల నుంచి విరమణ పొందగా ఆచార్య కృపలాని నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్టు పార్టీని స్థాపించారు. అయితే, కేరళలో పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దీ సంవత్సరాలకే పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కట్టడంతో పాటుగా వెట్టి చాకిరిపై పార్టీ నేతల మధ్య వచ్చిన సైదంతిక విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి విడిపోయి 1955లో సోషలిస్టు పార్టీని స్థాపించారు.
1955-64 మధ్యలో లోహియా అంశాల వారీగా చేసిన పలు పోరాటాలు దేశ ప్రజల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల యువతలో ఆయనకు విపరీతంగా ఆదరణ లభించింది. రాజకీయాల్లో అత్యధికులుగా ఉన్న బడుగు, బలహీన మరియు మహిళా వర్గాల ప్రాతినిధ్యం పెరగాలని, అన్ని భాషలకు హిందీ, ఇంగ్లీ భాషలతో పాటు సమప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవస్తకృతమైన భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయాలి వంటి పలు అంశాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పోరాడారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన యువకులు సోషలిస్టు పార్టీలో చేరి తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి అనేకులు దేశ రాజకీయాల్లో కాలానుగుణంగా రాణించారు.
1963లో ఫరుకాబాద్ లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీచేసి తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. 1964లో చీలిక ప్రజా సోషలిస్టు పార్టీ మరియు లోహియా సోషలిస్టు పార్టీలు కలిసి సంయుక్త సోషలిస్టు పార్టీ ఏర్పడింది. అదే ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీని ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోకుండా నిలువరించే వ్యూహాలను రచించారు. ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలిపి సంయుక్త విధాయక్ దళ్ కూటమిగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టేలా పార్టీలను ఒప్పించారు. ఆయన ప్రయత్నాలు ముందుగా ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల్లో ఫలించాయి. 1967 నాటికి ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనం అయ్యేలా చేయడంలో లోహియా పాత్ర కీలకం.
దళితులకు వ్యతిరేకంగా పాటిస్తున్న అమానుష విక్షను లోహియా విస్మరించలేదు (ఆ నాటి భాషలో వారిని ‘హరిజనులు’గా లోహియా పేర్కొన్నారు) ముఖ్యంగా సవర్ణులు లేదా ద్విజులు, శూద్రకులాల మధ్య వ్యత్యాసాలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. రాజకీయ, పరిపాలనా రంగాలలోను, వృత్తులు, వ్యాపారాలు, మేధో కార్యకలాపాలలో అగ్రకులస్తులే అగ్రగాములుగా ఉండడం, అధికార పదవులలో శూద్రకులాల వారికి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవడం గురించి ఆయన విపులంగా విశ్లేషించారు.
1958లో రాసిన ఒక వ్యాసంలో ‘దేశ జనాభాలో సవర్ణులు ఐదో వంతు మంది మాత్రమే అయినప్పటికీ జాతి జీవనంలోని నాలుగు ప్రధాన రంగాలు– వ్యాపారం, సాయుధ బలగాలు, సివిల్ సర్వీసులు, రాజకీయ పార్టీలలో అగ్రకులస్తులు ఐదింట నాలుగు వంతులుగా ఉన్నారని’ పేర్కొన్నారు. దేశం సర్వతో ముఖంగా పురోగమించేందుకు ఈ సామాజిక అసమతౌల్యతలను సరిదిద్ది తీరాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న హరిజనులు, మహిళలు, శూద్రులు ముస్లింలు, ఆదివాసీలు నాయకత్వ స్థానాలకు ఎదిగేందుకు దోహదం చేసే పోరాటాలకు సోషలిస్గులు నాయకత్వం వహించాలని లోహియా సూచించారు.
కుల వ్యవస్థ గురించిన లోహియా నిశిత అవగాహన ఆయనను సమకాలీన సోషలిస్టులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. అలాగే ఆయన స్త్రీ వాద దృక్పథం కూడ ఆ విశిష్టతకు మరింత వన్నెనిస్తోంది. భారతీయుల వెనుకబాటుతనానికి, కష్టాలకు కుల, జెండర్ వివక్షలే కారణమని, ఈ రెండూ పరస్పర సంబంధమున్నవని ఆయన అన్నారు. ఒక స్త్రీ పాత్ర వంటగదికే పరిమితం కావాలన్న అభిప్రాయం ఒకటి విస్తృతంగా ఉన్నది. పురుషుల స్థానం శిశు సంక్షణకు పరిమితం కావాలని సోసలిస్టులు ప్రతి వాదన చేయాలని ఆయన సూచించారు. బిడ్డల పెంపకంలో భర్తలు, తండ్రులు స్త్రీలతో సమానంగా పాల్గొనాలని ఆరు దశాబ్దాల క్రితమే లోహియా ప్రతిపాదించడం ఆయన మానవతాపూర్వక దూరదృష్టికి నిదర్శనం.
లోహియా రాజకీయ సంస్కరణ వాదిగానే కాకుండా మంచి వక్తగా సైతం ప్రసిద్ధి గాంచారు. దేశ స్వాతంత్య్రం రోజుల నుంచి లోక్ సభ వరకు ఆయన మాట్లాడిన ప్రతి అంశాలు ప్రజా దృష్టి కోణంలోనే సాగేవి. దేశ రాజకీయాల్లో ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించిన నేతల్లో లోహియాది ప్రథమ స్థానం. తన ఒకప్పటి ప్రాణ స్నేహితుడని చూడకుండా లోహియా తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చేవారు. లోహియా విమర్శల దాడికి తట్టుకోలేక నెహ్రూ పలు సందర్భాల్లో భేలాగా మారేవారు. పార్లమెంట్ సభ్యుడిగా సైతం ఆయన ఇతర ప్రతిపక్ష నేతల్లాగా ఒక అంశానికి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని అంశాలపై, సమస్యలపై సమగ్రంగా మాట్లాడేవారు.
లోహియా తన భావజాల ప్రచార వ్యాప్తికి ఆయనలోని రచయిత బాగా ఉపయోగపడ్డారు. సమకాలీన రాజకీయాలపై విమర్శనాత్మకమైన వ్యాసాలను పలు పత్రికలకు రాసేవారు. ఆయన తుదిశ్వాస వరకు వివిధ పత్రికలకు రచనలు పంపుతూ ఉండేవారు. తన రాజకీయ భావాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో హిందీ భాషలో పలు రచనలు చేశారు. లోహియా రాసిన పుస్తకాలు ఈనాటికి భారత రాజకీయాల వాస్తవ ముఖచిత్రాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
భారతదేశ రాజకీయాలపై మూడు దశాబ్దాల పాటు చెరగని ముద్రవేసి రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన మహా సోషలిస్టు నేతగా రామ్ మనోహర్ లోహియా నిలిచిపోయారు. బడుగులు రాజ్యాధికారాన్ని చేపట్టాలని అభిలాషించిన మొదటి భారతీయ నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. 1967లో కన్నౌజ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనే ఆకస్మికంగా అనారోగ్యానికి గురై తన 57వ ఏట 1967, అక్టోబర్ 12న కన్నుమూశారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాల నిర్వహణలో అగ్రకులాల ఆధిపత్యం 1950లలో వలే నేడు సంపూర్ణంగా లేకపోవచ్చు కానీ సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో ఆ సవర్ణులు, దేశ జనాభాలో తమ నిష్పత్తికి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రభావాన్ని నెరపుతున్నారు. ఆ కారణంగా, నేటి రాజకీయాలపై నాటి లోహియా ఆలోచనలు, భావాలు అసాధారణంగా మన కాలంలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు