అభ్యుదయ వామపక్ష దార్శనికుడు-నల్లమల గిరిప్రసాద్

- April 07, 2025 , by Maagulf
అభ్యుదయ వామపక్ష దార్శనికుడు-నల్లమల గిరిప్రసాద్

నల్లమల గిరిప్రసాద్... తెలుగునాట వామపక్ష భావజాలాన్ని విస్తృతపరిచిన  మార్కిస్టు మేధావి. విద్యార్ధి దశలోనే వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితుడై తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు. వామపక్ష వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళుందుకు పట్టువిడవకుండా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో విలువలు, ఆప్యాయతలు, జనాదరణ కరువైపోతాయని హెచ్చిరించిన మొదటి వ్యక్తి వీరు. నేడు వామపక్ష దిగ్గజ మేధావి నల్లమల గిరిప్రసాద్  మీద ప్రత్యేక కథనం..

నల్లమల గిరిప్రసాద్ అసలు పేరు నల్లమల ప్రసాద రావు. 1931,ఏప్రిల్ 6న నిజాం రాజ్యంలో భాగమైన అవిభక్త ఖమ్మం జిల్లాలోని మధిర తాలూకా తొండల గోపవరం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన నల్లమల రామయ్య దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం గ్రామంలో జరుగగా, తర్వాత కాలంలో ఖమ్మం, విజయవాడ మరియు మద్రాస్ నగరాల్లో సాగింది.

మద్రాస్‌లో చదువుతున్న సమయంలోనే స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆ సంస్థ కార్యకలాపాల్లో భాగంగా కొంత కాలం పనిచేశారు. ఇదే సమయంలో వామపక్ష భావజాలం సైతం పట్ల మక్కువ పెంచుకొని చదువుకు స్వస్తి పలికారు. అనంతరం స్వగ్రామానికి తిరిగివచ్చారు.

కృష్ణా జిల్లాలోని తునికిపాడు గ్రామంలో జరుగుతున్న రాజకీయ పాఠశాలకు తొలిసారిగా గిరిప్రసాద్ హాజరయ్యారు. ఒకపక్క తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ పోరాటంలో భాగమయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న బోడేపూడి వెంకటేశ్వరరావు, టి.బి.విఠల్ రావు మరియు వీరమాచినేని ప్రసాదరావు వంటి వారితో కలిసి పనిచేసారు.

పాల్వంచ ప్రాంతంలో సాయుధ దళాలకు నాయకత్వం వహించారు. గిరి దళం అంటే ఆ రోజుల్లో నైజాం సైనికులకు వెన్నులో వణుకు పుట్టేది. గిరిప్రసాద్ పేరులోని గిరి గురించి రెండు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గిరి ప్రసాద్ అసలు పేరు నల్లమల ప్రసాదరావు  కాగా, సాయుధ పోరాటం అనంతరం ఆయన పేరుకు ముందు గిరి చేరింది. గిరిజన ప్రాంతంలో జరిగిన పోరాటంలో పాల్గొన్న ప్రసాద్‌ను అక్కడి గిరిజనులు అక్కున చేర్చుకుని పోరాటానికి అన్నివిధాలు చేయూతనివ్వడంతో ఆ గిరిజనంలోని గిరిని తన పేరు ముందుకు చేర్చుకున్నారని కొందరు అంటారు. అలాగే, సాయుధ పోరాట యోధుడు, సింగరేణి కాలరీస్ వర్కర్సు యూని యన్ వ్యవస్థాపకుడు శేషగిరిరావును నైజాం మూకలు హతమార్చినప్పుడు ఆ శేషగిరిలోని గిరి పేరును తన పేరు ముందు ఉంచుకున్నారని కొందరు చెపుతుంటారు.

సాయుధ పోరాటం అనంతరం దాదాపు ఐదు సంవత్సరాల పాటు వీరు పలు ప్రాంతాల్లో అజ్ఞాత జీవితం గడిపారు. 1952లో ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. ఆ కేసుల్లో ఏదీ రుజువు కాకపోవడంతో జైలు నుంచి ప్రసాద్ గారు విడుదల అయ్యారు. 1953లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై ఏకదాటిగా 11 సంవత్సరాలపాటు పనిచేశారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా క్షేత్ర స్థాయి నుంచి జిల్లా వరకు పటిష్టమైన కార్యవర్గాన్ని తయారు చేశారు. రాజకీయ తరగతులు ఏర్పాటు చేసి సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికారు.

1962లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్యెల్యేగా ఎన్నికైన గిరిప్రసాద్ శాసనసభలో ఉపనేతగా కొనసాగారు. 1964లో విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు మహాసభలో పార్టీ చీలిక సమయంలో మొదట తటస్థ వైఖరి అవలంబించేందుకు ప్రయత్నించినా చివరకు సిపిఐ వైపు మొగ్గు చూపారు. 1978లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 1991 వరకు పనిచేశారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం సిపిఐ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన విశేష కృషి చేశారు.

1970-90 మధ్య వరకు రాష్ట్ర వామపక్ష రాజకీయాల్లో గిరిప్రసాద్ చేసిన రాజకీయ ప్రయోగాలు మరెవరూ చేయలేదు. తమ పార్టీకి చెందిన  ఎమ్యెల్యేలను రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలకు పంపి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యలను దగ్గరగా వారు పరిశీలించే అవకాశాన్ని కలిగించారు. ఇవే కాకుండా రాజకీయ శిక్షణ తరగతులను సైతం క్రమం తప్పకుండ ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ నూతన కార్యకర్తలను తయారు చేశారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర విజ్ఞానసమితి అధ్యక్షునిగా సైతం ఆయన పనిచేశారు. 1992-97 మధ్యలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1996-97 వరకు సిపిఐ జాతీయ ఉపకార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన కార్యశూరుడు గిరిప్రసాద్.

గిరిప్రసాద్ ఉపన్యాసాలు సాధారణ రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు భిన్నంగా సాగుతుండేవి. అంతర్జాతీయ, జాతీయ విధానాలు మొదలు రాష్ట్ర స్థాయి వరకు ఏ విమర్శ చేసినా నిర్మాణాత్మకంగా ఉండేది. ఒక అంశంపై విమర్శ చేసినప్పుడు అది ఎలా తప్పో కూడా   సవివరంగా ప్రజలకు తెలియజేసేవారు. అంతర్గత సమావేశాల్లో ఆయన ఉపన్యాసం ఆత్మవిమర్శ వైపు సాగేది. పలు సమావేశాల్లో ఆయన పార్టీ అగ్ర నాయకత్వాన్ని హెచ్చరిస్తున్న తీరు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల పట్ల ఆయనకున్న మమకారాన్ని, బాధ్యతను గుర్తుకు తెచ్చేది.

సమకాలీన రాజకీయాలు, సామాజిక పరివర్తన, నూతన ఆర్థిక విధానాలు, రాజకీయాల్లో ధన ప్రవాహం, వ్యవసాయం సహా పలు రంగాలపై బహుళ జాతి కంపెనీలు, విదేశీ సంస్థల పెత్తం దారీ తనం తదితర అంశాలపై మూడు దశాబ్దాల క్రితమే సామాన్య ప్రజలకు హెచ్చరిక చేసిన భవిష్యత్తు దార్శనికుడు నల్లమల గిరిప్రసాద్.

భవిష్యత్ రాజకీయాల గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గరకు ప్రజలు ఇక రాకపోవచ్చు. ప్రజల వద్దకు వెళ్లలేని రాజకీయ పార్టీల మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని, నాయకులు ప్రవర్తన తీరుతో ఆత్మీయ నమస్కారాలు అరుదై పోవచ్చునని, అవినీతి వలన కలుషితమైన నేతల్ని జనం ఏవగింజుకునే స్థితికి దిగజారిపోతున్నారు. రాజకీయాలు అస్తవ్యస్థమై వ్యాపారంగా మారి అవినీతితో కలగాపులగం అయి రాజ్యమేలుతాయని 90వ దశకానికి ముందే బోధించారు.

రాబోయే కాలంలో రాజకీయాలు వ్యాపారాలతో ముడిపడుతున్నాయి. ఓటర్లను టోకున కొనే నాయకులు, వ్యాపారులు అన్ని స్థాయిల్లోనూ  రాజకీయాల్లోకి రావచ్చు. నిబద్దత కంటే నిధులకే ప్రాధాన్యత రానున్నది అంటూ భవిష్యత్ దేశ రాజకీయ, సామాజిక చిత్ర పటాన్ని ఆవిష్కరించిన అరుదైన నాయకుడు గిరి ప్రసాద్. భవిష్యత్‌లో పార్టీల ఎజెండాలు కనుమరుగు కావచ్చు. నేతల చేష్టలే ఎజెండాలుగా మారవచ్చు అంటూ భవిష్యత్ గురించి ఆనాడే హెచ్చరించారు.

సుమారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎర్ర జెండానే ఆశగా, శ్వాసగా బ్రతికిన గిరిప్రసాద్ గారు, ఏనాడు పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించకుండా నిబద్దత కలిగిన కార్యకర్తగా పార్టీ సంస్థాగత బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. పార్టీ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి ఆయన అనుసరించిన అనేక నూతన మార్గాలను అనుసరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన  గిరిప్రసాద్ అనారోగ్యం కారణంగా 1997, మే24న  కన్నుమూశారు. గిరిప్రసాద్ గారు మరణించి మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా అనేక విషయాలపై ఆయన వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు నేటి సమకాలీన రాజకీయ పరిస్థితులకు చక్కగా సరిపోవడం విశేషం.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com