మరో మూడు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన

- April 07, 2025 , by Maagulf
మరో మూడు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణ పరిస్థితులు కీలకంగా మారుతున్నాయి. వర్షాలు, ఎండలు రెండూ ఒకేసారి ప్రభావం చూపించబోతున్న నేపధ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇటీవలి వాతావరణ మార్పుల ప్రధాన కారణం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితర ఆవర్తన ద్రోణి .ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేమతో కూడిన గాలులు ప్రవహించడంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశముందని హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ పేర్కొంది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనించే అవకాశముందని అంచనా. ఈ అల్పపీడనం ద్రోణితో కలసి వర్షపాతం పెరగడానికి దోహదం చేసే అవకాశముంది. మరోవైపు వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు, కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగాయి. నిజామాబాద్- సాధారణం కన్నా 2.2 డిగ్రీల పెరుగుదలతో 41.3 డిగ్రీలు నమోదు. ఆదిలాబాద్- 1.1 డిగ్రీల పెరుగుదలతో తీవ్ర ఉష్ణోగ్రత. ఖమ్మం- 2.7 డిగ్రీల పెరుగుదలతో 39.4 డిగ్రీలు నమోదవటం. ఇవి వేసవి తీవ్రతను ముందుగానే సంకేతాలుగా అందిస్తున్నాయి.

హైదరాబాద్‌లో వర్షబీభత్సం–రికార్డు స్థాయిలో వర్షపాతం
ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని 148 వర్షపాతం నమోదు కేంద్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ముఖ్యంగా ఉప్పల్, మలక్‌పేట్, ఖైరతాబాద్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో అనేక చోట్ల రహదారులు జలమయమయ్యాయి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్న ఈ సమయాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. వర్షాల ప్రభావం, ఎండల తీవ్రత, కలిపి ప్రజారోగ్యం, వ్యవసాయం మరియు సాధారణ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చే సూచనలను గౌరవిస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాతావరణ సవాళ్లను ఎదుర్కోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com