టాలీవుడ్ అయ్యగారు-అక్కినేని అఖిల్

- April 08, 2025 , by Maagulf
టాలీవుడ్ అయ్యగారు-అక్కినేని అఖిల్

అఖిల్ అక్కినేని విషయంలో ఎంత కష్టపడుతున్నా కూడా ఎక్కడో చోట తేడా కొడుతూనే ఉంది. తాత ఏయన్నార్ మహానటుడు.తండ్రి నాగార్జున టాప్ స్టార్.అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు.ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు.ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు.అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు.అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు.ఎందుకనో వారి ఆశలు ఇప్పటి వరకు అంతగా ఫలించలేదు. నేడు అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...

అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల నోముల పంటగా జన్మించిన అఖిల్ సంవత్సరం వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రంలో నటించి అలరించాడు. ఆ తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. అమ్మ అమల, నాన్న నాగార్జున – ఇద్దరూ తెరపై మేటి నటీనటులుగా వెలిగారు. వారి జీన్స్ అఖిల్ ను సినిమా రంగంవైపే పరుగులు తీయించాయి.

చిత్రసీమలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టక ముందు అఖిల్ క్రికెట్ లో భలేగా రాణించాడు. ఆస్ట్రేలియా వెళ్ళి మరీ క్రికెట్ లో  శిక్షణ తీసుకున్నాడు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టుకున్నాడు. అప్పట్లో అఖిల్ ఏ జట్టులో ఉంటే ఆ టీమ్ గెలుస్తుందని సినీజనం భావించేవారు. అఖిల్ క్రికెట్ లో అలరించింది మొదలు అక్కినేని అభిమానులు అఖిల్ ను తెరపై చూడాలని ఆశిస్తూనే ఉన్నారు. అభిమానుల కోరిక తీర్చడానికి అన్నట్టు అక్కినేని హీరోలు అందరూ కలసి నటించిన ‘మనం’ చిత్రంలో తాత, తండ్రి, అన్నతో కలసి ఓ సీన్ లో కాసేపు కనిపించాడు. అందులో అఖిల్ ఎంట్రీ చూసిన అభిమానులు ఆనందంతో చిందులు వేశారు.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సోలో హీరోగా ‘అఖిల్’మూవీతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత ‘హలో’తో ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా అదీ అంతగా అలరించలేదు. ఇక తమ అక్కినేని ప్యామిలీకి అచ్చి వచ్చిన ‘మజ్ను’ టైటిల్ ను తగిలించుకొని ‘మిస్టర్ మజ్ను’ని నేనేనంటూ వచ్చాడు. అదీ నిరాశనే మిగిల్చింది. సోలో హీరోగా మూడు సినిమాలతోనూ ఆకట్టుకోలేకపోయిన అఖిల్ నాల్గవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో ఎబో యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు.

అఖిల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయ్యగారే నెంబర్ వన్.. అనే ట్యాగ్ లైన్‌ను ఎప్పుడు నిజం చేస్తాడో అని అక్కినేని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయ్యగారికి కావాల్సినవన్నీ ఉన్నాయి. కోట్లు పెట్టి సినిమాలు తీసే అన్నపూర్ణ బ్యానర్, ఇండస్ట్రీని ఇన్ ఫ్లూయెన్స్ చేసేంత స్థాయి ఉన్న తండ్రి నాగార్జున ఇలా అన్నీ ఉన్నాయి. కానీ హిట్టుని ఇచ్చే ఆ కాస్త లక్ మాత్రం అఖిల్‌కు రావడం లేదు.

ఏజెంట్ సినిమాతో అయినా హిట్ కొడతాడని అంతా అనుకున్నారు. వైల్డ్ సాలా అంటూ బోల్తా కొట్టేశాడు. ఇక ఎన్నో సమస్యల్ని దాటుకుని ఏడాదికి పైగానే తాత్సారం జరిపి.. చివరకు రీసెంట్‌గానే ఏజెంట్ సినిమాని ఓటీటీలోకి వదిలారు. 

అఖిల్ 6వ మూవీని అన్నపూర్ణ స్టూడియో, సితార బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'లెనిన్' టైటిల్ ఖరారు చేశారు.అఖిల్ లుక్కుతో పాటు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ తన అభిమానుల కోరిక నెర వేర్చాలని కోరుకుందాం. అఖిల్ పడే కష్టానికి ఒక్క హిట్ వచ్చినా చాలు ఆ తరువాత అంతా మారిపోద్దని అభిమానులు అనుకుంటున్నారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com