సాంఘిక అసమానతలను ప్రశ్నించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే
- April 11, 2025
‘దేశమనే దేహానికి శూద్రులే ప్రాణం.. వారే రక్తనాళాలు’- ఈ మాటలు అనేక సందర్భాలలో నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. మహాత్మా జ్యోతిబా ఫూలే. ప్రజాస్వామ్యం పరిణతి చెంది.. పరిఢవిల్లుతున్న వర్తమాన సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు.వందేండ్లకు పూర్వమే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా పూలే. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే జన్మించారు. తండ్రి గోవింద్ రావు. జ్యోతిరావు ఫూలే చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం పెను విషాదం. వివక్షతో అగ్రవర్ణాలకే చదువు పరిమితమైన నాటి రోజుల్లో ఫూలే తండ్రి గోవిందరావు పూలే తన కొడుకును బడికి పంపించారు. అలా పూలే చదువుకు పునాది పడింది. పూలేకు 13 ఏండ్లప్పుడు 8 ఏండ్లున్న సావిత్రిబాయి ఫూలేతో పెండ్లి జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పూలే చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.
జ్యోతిబా ఫూలే తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్ళి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో తన జీవితం మలుపు తిరిగింది. ఆ తర్వాత సమాజంలోని కుల వివక్షపై తనదైన అభిప్రాయాలు ఏర్పరచుకొని మిగిలినవాళ్ళ కంటే తాము ఉన్నతులమన్న అగ్రవర్ణాల వాదనను తిప్పికొట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా శూద్రులు కలిసికట్టుగా పోరాడాలని జ్యోతిరావు ఫూలే కోరారు.
సత్యాన్ని శోధించి, ఛేదించి, అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేయాలనే ఆలోచనతో ‘సత్యశోధక్ సమాజాన్ని’ స్థాపించారు. అణగారిన వర్గాలకు, వివక్షకు గురవుతున్న బడుగులను అణచివేత నుంచి విముక్తి కల్పించడం, అణగారిన వర్గాల యువతకు పరిపాలనతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైనవి దీని ప్రధాన లక్ష్యాలు.
కుల వ్యవస్థ ప్రాతిపాదిక సమాజ గమనం ఉన్న సమయంలో.. అంటరానితనం కొన్ని కోట్ల మంది జీవితాల్లో అతి సామాన్యమైన విషయంగా ఉన్నప్పుడు-, ఒక వ్యక్తి అణగారిన జీవితాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం.. దానివల్ల ఎదురయిన కష్టనష్టాలను ఓర్చుకొని ముందుకు సాగటం అంత సులభం కాదు. అందుకే ఈనాటికీ మనకు జ్యోతిబా ఫూలే ఆరాధ్యుడయ్యారు. కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచి ఉన్నారు.
వెనుకబడిన వర్గాలైన శూద్ర, అతిశూద్ర వర్గాలకు తరగని దన్నుగా నిలిచారు. దేశ ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, గాంధీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న విశిష్టమూర్తి జ్యోతిరావు ఫూలే. ఆయన 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త. వివక్ష అంతంకోసం మార్గం చూపిన ఆలోచనాపరుడు. గొప్ప సంఘ సేవకుడు. తన అద్భుత రచనలతో అలనాటి సామాజిక రుగ్మతలను దునుమాడిన మహా రచయిత. విద్య గొప్పదనాన్ని గుర్తించిన గొప్ప తత్వవేత్త ఫూలే.
మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మరోవైపు కులవ్యవస్థ వ్యాపిస్తున్న కాలం కూడా అదే. అటు స్త్రీ విద్య పట్ల ఉన్న దురాచారాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి జ్యోతిబా ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 1848లో బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. ఆయన భార్య సావిత్రీబాయి పుణేలో ప్రారంభించిన ఈ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది . దీంతో జ్యోతిబా ఫూలే తన పాఠశాలను మూసివేయవలసి వచ్చింది.
19వ శతాబ్దంలో మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. భార్యాభర్తల మధ్య వయస్సు వ్యతాసం ఎక్కువ ఉండటం వల్ల భర్తలు త్వరగా మరణించేవారు. మహిళలు వితంతువులుగా మారేవారు. వీరి పట్ల సమాజంలో చాలా చులకనభావం ఉండేది. వీరికి రెండో వివాహం చేయటానికి ఫూలే పూనుకున్నాడు. వితంతు పునర్వివాహాల వల్ల అనేక మంది మహిళల జీవితాలు బాగుపడ్డాయి. అలాంటి మరో సున్నితమైన సమస్య- వితంతువులు గర్భిణులు కావటం. అప్పట్లో చాలా మంది బాల వితంతువులు గర్భస్రావం చేయించుకోవటానికి ప్రయత్నించేవారు. వీరిలో చాలా మంది మరణించేవారు కూడా! ఫూలే వీరికి అండగా నిలవటంతో పాటు వితంతు గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించాడు. ఈ సమస్యపై పోరాడిన తొలి వ్యక్తి ఫూలే.
వర్ణవ్యవస్థలో అనేక అవమానాలకు గురయినవారు, అగ్రకులాల ఆధిపత్యం వల్ల బానిసలుగా మారినవారు, బానిసత్వమే తమ జీవనమనే అమాయక భావనలలో ఉన్నవారిలో చైతన్యాన్ని తీసుకురావటమే ఈ సంస్థ ఉద్దేశం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఫూలే రాసిన ‘గులాంగిరి’లోని భావనలు కొన్ని కోట్ల మందిలో ఆలోచనలు రేకెత్తించాయి. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి. తన జీవితం మొత్తం నిమ్న కులాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ఫూలే 1890, నవంబర్ 28న కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!