రాజకీయ కార్యశీలి-పురందేశ్వరి
- April 22, 2025
పురందేశ్వరి...తెలుగునాట రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాయకురాలు. తండ్రి ఎన్టీఆర్, భర్త వెంకటేశ్వరరావు స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్దీ కాలానికే తన వ్యక్తిగత సామర్థ్యంతో కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా నిలిచారు. అనంతరం నరేంద్ర మోడీ సమక్షంలో భాజపాలో చేరిన ఆమె జాతీయ స్థాయిలో పలు పదవులు నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో ఎన్డీయే కూటమిలోకి టీడీపీని తీసుకురావడంతో పాటుగా, ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారు. నేడు ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
ఆంధ్ర చిన్నమ్మగా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి పురందేశ్వరి 1959, ఏప్రిల్ 22న మద్రాస్(నేడు చెన్నై) నగరంలో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం మద్రాస్ నగరంలోనే సాగింది. ఆమె నృత్య శిక్షకుడు వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో శిక్షణ పొందారు. మద్రాస్ ఎస్.ఐ.ఈ.టి ఉమెన్స్ కళాశాలలో బి.ఏ ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తిచేశారు. డిగ్రీలో చదువుకుంటున్న సమయంలోనే కుండ పెళ్ళిలో భాగంగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో వివాహం జరిగింది. అయితే, భర్త ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే, ముంబైలోని జెమాలజీ సంస్థ నుంచి జెమాలజీలో డిప్లొమా పూర్తి చేసిన తోలి దక్షిణాది మహిళగా నిలిచారు.
పురందేశ్వరి తండ్రి ఎన్టీఆర్ తెలుగునాట సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేశారు. ఆయన జాతీయ భావాలను కలిగిన ప్రాంతీయ రాజకీయ నాయకుడిగా భారత రాజకీయాల్లో నిలిచారు. ఇక భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్యెల్యేగా, ఒకసారి లోక్ సభ, ఒకసారి రాజ్యసభలకు ఎన్నికైన దగ్గుబాటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు.
తండ్రి, భర్తలను స్ఫూర్తిగా తీసుకున్న పురందేశ్వరి తన భర్త ప్రోద్బలంతో 2004లో బాపట్ల లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎంపీ. మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారిని ఓడించి సంచలనం సృష్టించారు. 2006లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్యాబినెట్ అర్జున్ సింగ్ అనారోగ్యం కారణంగా రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేని పరిస్థితుల్లో పురందేశ్వరినే ఆ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బాపట్ల ఎస్సి రిజర్వ్ కావడంతో, 2009లో ఆమె విశాఖపట్నం నుంచి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009-14 వరకు యూపీఏ 2 మంత్రివర్గంలో మానవవనరులు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రాన్ని అనైతికంగా విభజన చేసినందుకు తన మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటి భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు గార్ల సమక్షంలో పార్టీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
2014-2024 మధ్యలో పురందేశ్వరి భాజపాలో ఒక్కో మెట్టు ఎక్కుతూ, జాతీయ స్థాయి పార్టీ పదవులను కైవసం చేసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మహిళా మోర్చా ప్రభారిగా పనిచేశారు. 2019లో భాజపా అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు. 2023 చివర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షురాలిగా ఎన్నికైన నాటి నుంచి పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.
ఇదే సమయంలో 2024లో జరిగే సార్వత్రిక సమరంలో భాజపాను గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేశారు. టీడీపీ, జనసేనలను ఎన్డీయేలోకి ఆకర్షించడంలో ఆమె తన వంతు పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి నుంచి పోటీ చేసి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గెలిచిన నాటి నుంచి ఎంపీగా తన నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి అత్యధిక నిధులను రాబట్టారు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షరాలిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటూనే నియోజకవర్గాన్ని అభివృద్ధికి పర్యాయపదంగా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. పరిపాలనలో విశేషమైన అనుభవాన్ని కలిగి ఉన్న పురందేశ్వరి గారు రాబోయే రాజుల్లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!