కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్

- May 08, 2025 , by Maagulf
కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ: రెడ్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేద రోగులకు ఉచితంగా రక్తం అందజేస్తున్నట్టు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గవర్నర్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖాధ్యక్షులు అబ్దుల్ నజీర్ గురువారం రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన వరల్డ్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ థలసీమియా డే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ 20 బ్లడ్ సెంటర్లను నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం 65,000 పైబడి రక్త యూనిట్లను సేకరిస్తోందని, లక్షకు పైగా యూనిట్లను అవసరమైన నిరుపేదలకు జారీ చేస్తోందని తెలిపారు. వీటిలో మూడొంతులు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ ఉద్యమం కోసం విశేష సేవలు అందించి గరిష్టంగా విరాళాలు సమీకరించిన జిల్లా కలెక్టర్లకు గవర్నర్ అవార్డులు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ అవార్డు తన ఒక్కరి సొంతం కాదని, వరద బాధితుల సహాయార్థం, సహాయం చేసిన ప్రతి ఒక్కరి కృషికి ఇది గుర్తింపు అన్నారు. అవార్డుతో తన బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో కూడా జిల్లా ప్రజల కోసం పూర్తిస్థాయిలో, అంకితభావంతో పనిచేస్తానన్నారు. దూరదృష్టి, అపారమైన అనుభవంతో జిల్లా యంత్రాంగానికి మార్గదర్శకత్వం వహించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేసారు. తూర్పు గోదావరి కలెక్టర్ పి. ప్రశాంతి, కృష్ణా కలెక్టర్ డి.కే. బాలాజీ, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు కలెక్టర్ ఓ. ఆనంద్, నంద్యాల కలెక్టర్ జి. రాజకుమారి, కాకినాడ కలెక్టర్ సాగిలి షాన్ మోహన్, కర్నూలు కలెక్టర్ పి. రంజిత్ బాషా, బాపట్ల కలెక్టర్ జె. వెంకట మురళి లకు పతకాలు అందుకున్న వారిలో ఉన్నారు.

తొలుత గవర్నర్ రాజ్‌భవన్‌ నుండి వర్చువల్‌ విధానంలో శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్‌లో స్థాపించిన రెడ్ క్రాస్ థలసీమియా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ సెంటర్‌ను ప్రారంభించారు. కీలక రక్త మార్పిడి చికిత్స అవసరమున్న పిల్లలు, వ్యక్తులకు మద్దతుగా ఈ పథకం చేపట్టారు. గవర్నర్ మాట్లాడుతూ ఇక రక్త కణ విభజన ఉన్న అన్ని బ్లడ్ సెంటర్లలో ట్రాన్స్‌ఫ్యూషన్ సేవలను విస్తరించాలన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ చైల్డ్ కేర్, మహిళా సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తొలిమహిళ సమీరా నజీర్, గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, రెడ్ క్రాస్ ఏపీ రాష్ట్ర శాఖ చైర్మన్ వై.డి. రామారావు, సీఈఓ ఏ.కె. పరీడా, వివిధ జిల్లా శాఖల చైర్మన్లు, రాజ్‌భవన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com