ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఐఎస్ఐ ఏజెంట్..
- May 13, 2025
న్యూ ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఈ తరుణంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాక్ హైకమిషన్ ఉద్యోగి ఎహసాన్ ఉర్ రెహమాన్‌పై భారత్ వేటు వేసింది. పెర్సోనా నాన్ గ్రాటా (రాయబార కార్యాలయంలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి)గా ప్రకటించింది భారత్. డానిష్ పేరుతో పాక్ నిఘా సంస్థ ISI కోసం రెహమాన్ పని చేస్తున్నట్లు గుర్తించింది.
రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచర్యానికి పాల్పడుతున్నాడు రెహమాన్. రెండురోజుల క్రితం రెహమాన్‌కు సమాచారం ఇస్తున్న వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెహమాన్ భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకుని పాకిస్తాన్ పంపిస్తున్నట్లు గుర్తించారు.
రెహమాన్ డానిష్‌గా పేరు మార్చుకుని పని చేస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా భారత సైన్యానికి సంబంధించిన సమాచారం మొత్తం ISIకి చేరవేస్తున్నాడు. ఇది గుర్తించి వెంటనే అప్రత్తమైన కేంద్రం రెహమాన్‌పై వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు.. 24 గంటల్లో దేశం విడిచిపోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
తమ నిర్ణయాన్ని తెలుపుతూ భారత్‌లో పాక్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి లేఖ రాసింది విదేశాంగ శాఖ. ”ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించాం. అధికార హోదాకు తగ్గట్లుగా అతడు ప్రవర్తించ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 24 గంటల్లోగా ఆ అధికారి భారత్ విడిచి వెళ్లిపోవాలి’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాక్ హైకమిషన్ ఉద్యోగికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని హైకమిషన్‌లో నియమించబడిన పాక్ జాతీయుడితో సంబంధం ఉన్న గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు మే 11న ప్రకటించారు.
విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా, పాకిస్తాన్‌కు చెందిన ఒక హ్యాండ్లర్‌కు భారత సైన్యం కదలికల గురించి “సున్నితమైన సమాచారం” అందించినందుకు పంజాబ్ పోలీసులు మొదట ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఆ వ్యక్తి ఆధారంగా రెండవ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు యాదవ్ వెల్లడించారు.
రహస్య సమాచారం కోసం ఇద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా చెల్లింపులు అందుకున్నారని దర్యాప్తులో తేలింది. వారు పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నారని, హ్యాండ్లర్ సూచనల మేరకు ఇతర స్థానిక కార్యకర్తలకు నిధులను చేరవేయడంలో సాయపడ్డారని చెప్పారు.
పహల్గాం ఉగ్రవాద దాడి యావత్ భారత్ రగిలిపోయింది. కేంద్రం వెంటనే పాకిస్తాన్ పై చర్యలకు దిగింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాక్ పౌరులు వెంటనే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. సింధు నది జలాల ఒప్పందం సైతం రద్దు చేసుకుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!