అయోధ్యలో జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ

- May 22, 2025 , by Maagulf
అయోధ్యలో జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ

అయోధ్య: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పవిత్రమైన అయోధ్యలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ జన్మభూమి మందిరం ఇప్పుడు తుది దశలోకి చేరింది. జూన్ 5 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.అయోధ్య ఆలయ నిర్మాణం సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇదే ఆఖరి దశగా మిగిలింది. జూన్ 3 నుండి 5 వరకు, ఆలయ ప్రాంగణంలో రామ్‌దర్బార్ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది.ఈ విషయాలను పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా వెల్లడించారు. జూన్ 5న జరిగే ఈ శుభ ఘట్టానికి వివిధ మతాల గురువులు, ఆధ్యాత్మిక నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కానీ రాజకీయ నాయకులకు, ప్రభుత్వ వీఐపీలకు ఈ వేడుకకు ఉండదన్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక వేడుక అని స్పష్టం చేశారు.ఆయన మాట్లాడుతూ, “ఈ రామమందిరం కోసం దేశం 500 సంవత్సరాల పాటు ఎదురుచూసింది. ఇది ప్రజల విశ్వాసానికి ఫలితంగా వచ్చిన విజయగాధ” అని పేర్కొన్నారు.

భక్తుల కోసం సిద్ధంగా ఉండే రామాలయం
ప్రాణప్రతిష్ఠ అనంతరం వారం రోజుల్లో ఆలయానికి కొత్తగా నిర్మించిన భాగాలను భక్తుల దర్శనానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్పుతో అయోధ్యకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలిగేలా ప్లాన్ చేస్తున్నారు.పూర్వం, ఈ ఆలయం నిర్మాణం చుట్టూ వివాదాలే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ కథలు వెనక్కి వెళ్లిపోయాయి. దేశం అంతా ఈ శుభ సందర్భంగా ఒకటిగా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.

గత జనవరి వేడుక గుర్తుందా?
గత ఏడాది జనవరి 22న, ఆలయంలో బాలరాముడి విగ్రహానికి అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో ఈసారి కూడా రామ్‌దర్బార్ ప్రతిష్ఠ వేడుక భారీగా జరగనుంది.అలాగే, ఆలయం నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు, శిల్పకారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మిశ్రా. “వారు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారు. వారి కృషి వల్లే ఈ మహాయజ్ఞం తుది దశకు వచ్చింది” అని చెప్పారు.

భవిష్యత్తులో రామాలయ ప్రాముఖ్యత
ఈ ఆలయం భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు గర్వకారణంగా మారనుంది. అంతర్జాతీయంగా పర్యాటక ఆకర్షణగా నిలవడంతో పాటు, ఆధ్యాత్మిక కేంద్రముగా ఎదగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com