పెరుగుతున్న కరోనా కేసులు..రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

- May 25, 2025 , by Maagulf
పెరుగుతున్న కరోనా కేసులు..రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

న్యూ ఢిల్లీ: గత కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజా కరోనా వేరియంట్లు NB.1.8.1 మరియు LF.7 వలన దేశవ్యాప్తంగా మళ్లీ కలకలం మొదలైంది. గత అనుభవాలను బట్టి చూస్తే ఈ తరహా వేరియంట్లు త్వరగా వ్యాపించే అవకాశం ఉండటంతో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలకు పాల్పడుతోంది.

పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్‌ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో 200మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో.. ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 35 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్‌ అయింది. గాజియాబాద్‌లో ఇప్పటికే 4 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలెర్ట్‌ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. విశాఖ జీజీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

కేసుల పెరుగుదల దృష్ట్యా కేంద్రం కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. ముఖ్యంగా హాస్పిటల్, బస్సులు, మెట్రో వంటి బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com