తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు కసరత్తు

- May 26, 2025 , by Maagulf
తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు కసరత్తు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ విస్తరణ జరగకపోవడం, అనేక మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొద్ది మంది మంత్రులతో పరిమితంగా పాలన కొనసాగిస్తున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ తక్షణమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా, అధిష్ఠానం సూచన మేరకు హస్తినలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేసినట్టు తెలిసింది. సామాజికవర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే, ఎమ్మెల్యేల నుంచి తనకు వచ్చిన వినతులను వేణుగోపాల్‌ ముందు రేవంత్ పెట్టినట్టు సమాచారం. వీటన్నింటిపై చర్చించి ప్రాథమికంగా మరోసారి పేర్లను ఖరారు చేశారని, అయితే, వీటికి ఖర్గే, రాహుల్ ఆమోదం తప్పనిసరి కావడంతో వారితో భేటీ అయ్యాక మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది.

రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నారు. వీరి ఆమోదం అనంతరం కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం మొత్తం 18 మంత్రుల స్థానాల్లో మాత్రం 12 మంది మాత్రమే పదవుల్లో ఉన్నారు. మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com