విలువలు కలిగిన నాయకుడు-సబ్బం హరి

- June 01, 2025 , by Maagulf
విలువలు కలిగిన నాయకుడు-సబ్బం హరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. విద్యార్ధి దశలోనే రాజకీయాల పట్ల మక్కువ పెంచుకొని రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా సమస్యలపై ఉదృతంగా పోరాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనకెంతో ఇష్టమైన కాంగ్రెస్ పార్టీని సైతం వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పాలక పక్షాల ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద బాధ్యతాయుతంగా స్పందిస్తూ ఉండేవారు. విశాఖ నగరానికి గ్లోబల్ రికగ్నైజేషన్ రావడంలో వీరి పాత్ర చాలా కీలకం. నేడు ఉత్తరాంధ్ర ప్రజా నాయకుడు స్వర్గీయ సబ్బం హరి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

సబ్బం హరి 1952, జూన్ 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తాలూకా తగరపువలస సమీపంలోని  చిట్టివలస గ్రామంలో సబ్బం బంగారు నాయుడు, అచ్చియమ్మ దంపతులకు జన్మించారు. ఎస్.ఎల్.సి వరకు స్వగ్రామం పరిసరాల్లోనే చదువుకున్న తర్వాత విశాఖపట్నంలోని ప్రముఖ ఏ.వి.ఎన్.కళాశాలలో చదువుకున్నారు. అక్కడే ఇంటర్, బీకామ్ పూర్తి చేశారు. తర్వాత వ్యాపార రంగంలో కొంతకాలం పాటు కొనసాగారు.

విద్యార్ధి దశలోనే సామాజిక అంశాలపై అవగహన కలిగి ఉండేవారు. పైగా అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ మీదున్న అభిమానం వల్ల   కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా మారారు. 1984లో ఇందిరాగాంధీని సొంతగార్డులే హత్యచేసిన సంఘటన ఇతడిని బాగా కదిలించింది. హత్య తరువాత, అంత్యక్రియల వరకు మూడు రోజులపాటు టీవీల్లో చూపిన దృశ్యాలను రికార్డు చేశారు. ప్రతిరోజూ కంచరపాలెంలోని తన ఇంటి వద్ద వాటిని ప్రదర్శించేవారు. వాటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారు. ఈ ఒక్క ఉదంతం వల్ల విశాఖ నగర కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

1985లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సబ్బం హరి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పెద్దలైన ద్రోణంరాజు సత్యనారాయణ, సూర్రెడ్డి వంటి వారితో సన్నిహితంగా మెలిగేవారు. విశాఖ నగర యువజన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 1989 ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతగా ఉన్న వైఎస్సార్‌కు దగ్గరయ్యారు. విశాఖ యూత్ కాంగ్రెస్ కమిటీని బలోపేతం చేసిన ఘనత వీరికే దక్కుతుంది.

90వ దశకంలో జిల్లా కాంగ్రెస్ నేతలతో వచ్చిన రాజకీయపరమైన వైరుధ్యాల కారణంగా కొంతకాలం సైలెంట్ అయ్యారు. 1995లో వచ్చిన విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వచ్చి కోరడంతో వారి అభ్యర్థనను మన్నించి పోటీ చేశారు. ప్రత్యక్ష పద్దతిలో జరిగిన ఆ ఎన్నికల్లో విశాఖ వాసులు అత్యధిక మెజారిటీతో ఆయన్ని మేయర్‌గా గెలిపించారు. 1995 నుంచి 2000 వరకు  మేయర్‌గా ఉన్న ఆయన హయాంలోనే విశాఖపట్నం అభివృద్ధి పరుగు పెట్టించింది. నగరంలో రోడ్లు, వంతెనలు మరియు త్రాగునీటి పథకాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఆసియా బ్యాంకు నుంచి అభివృద్ధి నిధులు తీసుకువచ్చి  నగర సుందరీకరణకు వినియోగించారు. ఒకవిధంగా ఈరోజు విశాఖ నగరానికి గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్ రావడంలో సబ్బం హరి పాత్ర చాలా కీలకం.

 విశాఖపట్నం మేయర్‌గా సబ్బం హరికి వచ్చిన జాతీయ స్థాయి గుర్తింపును ఓర్చలేని జిల్లా కాంగ్రెస్ నేతలు, ఆయన మీద పార్టీ అధిష్టానానికి తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉంటడంతో మనస్థాపం చెందిన ఆయన మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అయితే, అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్ మాత్రం హరిని దగ్గరకు తీశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.  2009-14 నుంచి ఎంపీగా కేవలం తన నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేవారు.

2009లో పదవిలోకి వచ్చిన ఆరు నెలలకే వైఎస్సార్ మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే జగన్ వైఖరి నచ్చక తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కొనసాగారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిన నేతల్లో సబ్బం ఒకరు. పార్లమెంట్ కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు సమైక్య వాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చారు. 2014లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ తన ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంద్ర పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి వంటి పలువురు కీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా నామినేషన్ వేసినప్పటికి, చివరి నిమిషంలో విత్ డ్రా చేసుకొని టీడీపీ - భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఇప్పటి మిజోరామ్ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మద్దతుగా నిలిచారు. 2014-19 వరకు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా విశ్లేషణలు చేస్తూ ప్రజలేమనుకుంటున్నారో టీవీ డిబేట్లలో చెప్పేవారు. అప్పట్లో ఆయన విశ్లేషణల కోసం ప్రజల నుంచి అన్ని పార్టీల నాయకులు ఆసక్తిగా వీక్షించేవారు.

2019 నాటికి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక  విధానాలను విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని  అమరావతి నుంచి మూడు రాజధానులుగా ప్రకటించడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై హరి గారు చేస్తున్న విమర్శలను తట్టుకోలేని వైకాపా పెద్దలు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కున్న ఆయనకు రాష్ట్ర మరియు విశాఖ నగర ప్రజలు సైతం మద్దతుగా నిలిచారు.

మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాహితమే పరమావధిగా సబ్బం హరి రాణించారు. ఆయన పెద్ద పెద్ద పదవులు చేపట్టక పోయినప్పటికి, ప్రజా సమస్యల పరిష్కారానికి దీక్షగా పనిచేయడం, ఎటువంటి సమయాల్లో సహనం కోల్పోకుండా తన వాదాన్ని బలంగా వినిపించడం వల్ల ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా మెలిగారు. రాజకీయాల్లో కక్షలు,  కార్పణ్యాలు పెరగడం, క్రమంగా విలువలు పతనం పట్ల పలు సందర్భాల్లో మనస్తాపం చెందారు. ఇదే సమయంలో రాజకీయాల నుంచి దూరంగా జరగాలని అనుకుంటున్న దశలోనే కరోనా సమయంలో అనారోగ్యానికి గురై 2021, మే 3న తన 69వ ఏట కన్నుమూశారు.  
   
    --డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com