సరికొత్తగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్

- June 08, 2025 , by Maagulf
సరికొత్తగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్

అమరావతి:ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధమవుతోంది. గతంలో నిర్వహించిన పోటీలకు భిన్నంగా ఈసారి మెగా లీగ్ ను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేష్ సిద్ధమవుతోంది. ఈసారి సమూల మార్పులకు ఏసీఏ శ్రీకారం చుట్టింది. తమిళనాడు, కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ల మాదిరిగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఆదరణ పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఏపీలోని నార్త్, సౌత్, సెంట్రల్‌ జోన్ల నుంచి రెండేసి జట్ల చొప్పున మొత్తం ఆరింటిని బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తోంది. సౌత్‌ జోన్‌ నుంచి అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు... సెంట్రల్‌ జోన్‌ నుంచి విజయవాడ, అమరావతి, గుంటూరు, ఒంగోలు... నార్త్‌ జోన్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. ఐపీఎల్‌ విజయవంతం కావడానికి ఉపయోగపడిన ఫార్ములానే ఏపీఎల్‌లో అమలు చేయనున్నారు. ఐపీఎల్‌ తరహాలోనే ఏపీఎల్‌లో జోన్లవారీగా జట్లకు.. విశాఖ, గోదావరి, విజయవాడ, అమరావతి, కడప ఇలా పేర్లు పెట్టనున్నారు.

ఆరు జట్లు... ఏడు మ్యాచ్‌లు

ఈసారి పోటీల్లో పాల్గొనే ఆరు జట్లు కచ్చితంగా ఒక్కొక్కటి ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో 19 రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో లైటింగ్‌ సదుపాయం లేకపోవడంతో అక్కడ డే మ్యాచ్‌లను నిర్వహించి, కడప, విశాఖల్లో మాత్రం డే అండ్‌ నైట్‌ పోటీలు జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రీమియర్‌ లీగ్‌కు వచ్చే ఆదరణను బట్టి.. వచ్చే ఏడాది నుంచి మరో రెండు జట్లకు అవకాశం కల్పించనున్నారు. ఏపీఎల్‌లో పాల్గొనే ఆరు జట్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల కోసం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ)ను ఆహ్వానిస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌కు అనూహ్యస్పందన వస్తోంది. ఫ్రాంచైజీల కోసం పోటీ పడేవారి వార్షిక టర్నోవర్‌ గత మూడేళ్లుగా కనీసం రూ.100 కోట్లు ఉండాలనే నిబంధన పెట్టడంతో 20కి పైగా పెద్ద సంస్థలు ఈవోఐలు సమర్పించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com