పౌర హక్కుల మేధావి-బాలగోపాల్
- June 10, 2025
గుండె ఎప్పటికప్పుడు చీరిపోతూ అంతరంగ గాయాలు సలుపుతూ ఉన్నా తాను ఉన్నంత కాలం ప్రజల కోసం, ముఖ్యంగా అభివృద్ధి అంచులకు ఆవల ఉన్నవారి కోసం పనిచేస్తూ పోయారు బాలగోపాల్. బౌద్ధిక ప్రపంచంలో నిమగ్నతకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆచరణ, ఇంగిత జ్ఞానం, విస్తృత అధ్యయనాలతో సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ఆయన చేశారు. తెలుగునాట పౌరహక్కల ఉద్యమాలకు ఊపిరినిచ్చారు. నేడు పౌర హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
బాలగోపాల్ అలియాస్ కందాళ్ల బాలగోపాల్ 1952, జూన్ 10న పార్థనాథశర్మ, నాగమణి దంపతులకు కర్ణాటకలో ఉన్న బళ్లారి పట్టణంలో జన్మించారు. స్వస్థలం మాత్రం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామం. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించింది. బాలగోపాల్ ఊహతెలిసే నాటికి తిరుపతిలో స్థిరపడింది. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు తిరుపతిలోనే చదువుకున్నారు. ఆ తర్వాత గణితంలో పీజీ పూర్తి చేయడానికి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ఆయన అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంత కాలం పోస్ట్ డాక్టరేట్ పరిశోధన చేశారు. గణితంలో గుర్తింపు పొందుతున్నప్పటికీ తన కార్యక్షేత్రం అది కాదని భావించి సమానత్వపు చైతన్యాన్ని, విలువలను సమాజంలో పెంపొందించడం బాధ్యతగా ఎంచుకుని తిరిగి వరంగల్ చేరుకున్నారు. కొంతకాలం కాకతీయ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే సామాజికకార్యాచరణలో పాలుపంచుకున్నారు. తర్వాత 1985లో అధ్యాపక ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి కార్యకర్తగా మారి హక్కుల రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
బాలగోపాల్ చిన్నతనం నుంచే తార్కిక కోణంలో ఆలోచించేవారు. ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... తిరుపతిలో చదువుకుంటున్న సమయంలో రాడికల్ నాయకుడు త్రిపురనేని మధుసూదనరావు గారి శిష్యరికంలో చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు.
తిరుపతిలోనే రాడికల్ ఉద్యమంలో భాగమైన బాలగోపాల్ వరంగల్ చేరుకున్న తర్వాత రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అప్పటి నుండి 1985 వరకు రాడికల్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే, రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత వామపక్ష వాస్తవాన్ని అతిశయం చేసి చెప్పారని మొదట్లో నమ్మిన ఆయన ... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు.
రాడికల్ రాజకీయాల్లో ఉంటూనే ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో 'ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం'లో చేరారు. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1998 వరకూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సంస్థను ముందుండి నడిపారు. నిర్దిష్టంగా ‘విప్లవహింస’, ‘ప్రతిహింస’ లాంటి అంశాలపైనా, మొత్తంగానే మార్క్సిస్టు సిద్ధాంతంలోని కొన్ని భావనలపైనా విభేదించి, సుదీర్ఘ చర్చల అనంతరం 1998లో దాని నుండి బయటకు వచ్చారు.
తన భావాలకు సన్నిహితంగా ఉండే వారితో కలిసి 1998లో మానవహక్కుల వేదికను ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివి కోర్టులలో పీడితుల లాయర్‌గా తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా అప్పటి యువతరాన్ని కదిలించిన 1975 ఎమర్జెన్సీ రోజులు ఆయన జీవితంలో కీలక మలుపు అనుకుంటే అప్పటి నుంచి మరణించే రోజు వరకూ ఆయన క్షణక్షణం కణ కణం పీడితులతోనే, పీడితుల కోసమే. సమస్త రంగాల్లో ఆధిపత్యమూ, వివక్షా వ్యక్తమయ్యే రూపాల గురించిన అవగాహనను పెంపొందించిన వ్యక్తి బాలగోపాల్. సమానత్వ చైతన్యం మన కామన్ సెన్స్‌లో భాగమవ్వాల్సిన పద్ధతి గురించి ఎరుక పరిచినారు.
బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో లా డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు.
బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. అదేవిధంగా 'షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్'ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి.
రాజ్యం, దాని సాయుధ ముఖంగా ఉన్నటువంటి పోలీసు అక్రమాలను ధిక్కరించి కిడ్నాపులు, ప్రాణాంతక దాడులు ఎదుర్కొన్నా వెరువక నిబ్బరంగా నిలిచి ముందు నడిచిన సాహసి. ‘‘శరీరం మాట వినడం మొదలెడితే అది రోజూ ఏదో ఒకటి చెపుతూనే ఉంటుంది’’ అని సొంత శరీరాన్ని కూడా పరాయిగా భావించ గలిగినటువంటి నిర్మమకారం సాధించిన అరుదైన మనిషి బాలగోపాల్. సొంత ఆస్తి మాత్రమే కాదు, ఎంచుకున్న రంగం తప్ప దేన్నీ సొంతంగా భావించకుండా ఉండడాన్ని సాధన చేశారు. సమయాన్నీ, శక్తినీ పూర్తిగా సామాజిక ఆచరణ మీద కేంద్రీకరించడానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఆయన్ని అనుసరణకు అతీతం అనేట్టు మార్చింది. అది అసాధ్యమనిపించేంత ఆచరణ. అరుదైన నమూనా.
హక్కు అనే ఆధునిక విలువను దాని సారాంశంలో విస్తృతం చేయడానికి ప్రయత్నించినవాడు. ఒక దశలో తెలుగు నాట పౌర హక్కుల ఉద్యమానికి, దానికి ప్రధాన రూపమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘానికి పర్యాయపదమై నిలిచినవాడు. పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, మానవహక్కుల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడానికి పరికరాలను, చట్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. రాజ్యహింసను ధిక్కరిస్తూ దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉద్యమించే వారి హక్కుల రక్షణతో ప్రయాణం ఆరంభించి మెల్లమెల్లగా దళిత, ఆదివాసీ, స్త్రీ, మైనారిటీ తదితర సమూహాలకు దానిని విస్తరిస్తూ చివరకు విప్లవహింసలో కూడా అవాంఛనీయమైన ధోరణులను నిలదీసి హక్కుల ఉద్యమంలో తనదైన బాట వేసుకున్నారు.
నిరంతర వేధింపులు, ఎన్నో కేసులు ఉన్న ఆయన పట్టించుకునే వారు కాదు. రాత్రి పగలు ఎన్ని కోర్టు పనులు ఉన్నప్పటికీని శని, ఆదివారాలు ఏజెన్సీ ప్రాంతవాసుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన అటవీ హక్కుల ఉల్లంఘనలు వారు ఎదుర్కొంటున్న రాజ్యహింసను స్వయంగా చూసేవారు. వాళ్లను కలిసి వారితో మాట్లాడటం, అవసరాలకు తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, న్యాయ ప్రక్రియల ద్వారా వారికి దక్కవలసిన ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వాలకు గుర్తు చేసేవారు.
అందుకని ముందుగానే విషయ సేకరణ జరగాలి, వీలైనంత వరకు వ్యాఖ్యానం చేయాలి, కానీ ఒక చారిత్రక సిద్ధాంతంతో మొదలుపెడితే సైద్ధాంతిక పరిమితుల వలన సంఘటనలను పాక్షికంగానే చూస్తాము. విషయ సేకరణ అసమగ్రంగానే ఉండిపోతుంది. అందుకని ఉల్లంఘన జరిగిన స్థలానికి తప్పకుండా వెళ్లడమే పనిగా ముందుకు వెళ్లారు. ఆ కృషిలో భాగమైన సామాజిక పరిశీలన సమాజం గురించి విశ్లేషించడం ప్రజలకు మెరుగైన జీవనం అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శప్రాయమైనది.
కరపత్ర రచనలో కొత్త ఒరవడి తెచ్చినవాడు బాలగోపాల్. తెలుగులో హాయిగా చదువుకోదగిన సులభ శైలిలో కరపత్ర రచన చేయడం అటు యాక్టివిస్టులకు, ఇటు విశాల సమాజానికి ఆయన చేసిన చేర్పే అనుకోవచ్చు. వామపక్ష శిబిరం వరకు అది కచ్చితంగా చెప్పొచ్చు. మానవహక్కుల వేదిక కరపత్రాల్లో అది ప్రతిఫలిస్తుంది. కరపత్రమనే కాదు, రచనలన్నింటా కూడా ‘నేనిది చెపుతున్నాను, చదవండి’ అని కాకుండా సామాన్యుడికి రాగలిగిన సందేహాలను తానే వేసుకుని వాటికి సమాధానాలు కూడా చెప్పే పద్ధతిని – అంటే ఒక రకమైన డైలాగ్ పద్ధతిని అనుసరించిన వాడు బాలగోపాల్. తాను ఎక్కడినుంచి అయితే ఆరంభమయ్యాడో ఆ మార్క్సిస్ట్ సిద్ధాంత మూలాల్లోనే పూరించాల్సిన లోపాలున్నాయి అని గుర్తించి మనిషిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సైద్ధాంతిక తలంలో పనిచేసిన మేధావి.
జమ్మూ కాశ్మీర్ ప్రజలతో మాట్లాడటం అసలు వాళ్లకు ఏం కావాలో తెలుసుకోవడానికి ఒక నిజనిర్ధారణ చేయాలని, ఇతర సంఘాలతో కలిసి వెళ్లడం జరిగింది. స్వయంగా హక్కుల కార్యకర్తగా వెళ్లడం వారి ఆకాంక్షలను తెలుసుకుని పుస్తకంగా రాశారు. ఎన్నో కరపత్రాల ద్వారా వాస్తవాలను తెలియజేశారు. కశ్మీరీ ప్రజలకు వాళ్ల హక్కులు ఎలా హరించబడుతున్నాయో దేశ ప్రజలకు ప్రపంచానికి తెలియజేశారు.ఈ అవమానాలు, అంటరానితనాలు, వివక్ష, దోపిడి, పీడనలు ఎండగట్టే విషయంలో ఎక్కడ రాజీ పడ కుండా లోతైన విశ్లేషణతో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి అంతర్జాతీయ స్థాయి పత్రికలకు ఎన్నో వ్యాసాలు రాశారు.
శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి చిత్తూరు, మదనపల్లి వరకు, కడప, ఇడుపులపాయ, అదిలాబాద్ నుండి భైంసా, వికారాబాద్, తాండూరు వరకు ఎక్కడ హక్కుల ఉల్లంఘనలు జరిగినా నిజ నిర్ధారణ చేసి రిపోర్ట్‌గా రాసి అన్ని పత్రికలకు ప్రకటనలు పంపించేవారు. అందులో జరిగిన అన్యాయాలను ఖండిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండుగా ఉండేది. విషయాన్ని మనం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్లేలా చూసేవారు. అన్ని ప్రజా ఉద్యమాలను సమర్థిస్తూ వారితో కలిసి నడుస్తూ అవకాశమున్న ప్రతిచోటా ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేసేవారు. ఆయన రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు, పుస్తకాలు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశాయి.
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ-దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు. గణితంలో దిట్ట అయిన బాలగోపాల్ సమాజం లెక్కలను తీశారు. ఆయన రాసిన రూపం - సారం పుస్తకం తెలుగు సాహిత్య విమర్శకు ఒక నమూనాగా పనికి వస్తుంది. రూపవస్తు సమన్వయాల సాధన ఏ విధంగా ఉంటుందో ఆయన ఆ పుస్తకంలోని వ్యాసాల్లో నిరూపించారు.
వర్గం, కులం, ప్రాంతం, లింగం, ఇంకా అనేకానేక ఛాయల్లో పని చేసే వివక్షా రూపాలను గుర్తించి వాటి బాధితులకు బాసటగా నిలిచిన స్వరం. కనిపించే ఘటనలపై స్పందించడం మాత్రమే కాకుండా వాటి వెనుక సాగే పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి మనకు ఆయుధంగా అందించిన కలం. ఆధిపత్యాన్ని ధిక్కరించే విషయంలో తన మన అనే భావనలు – అంటే నీ ప్రాంతం, నీ కులం, నీ మతం, ఇత్యాది అంశాలు పనిచేయకుండా ఆలోచించాల్సిన పద్ధతి గురించి నమూనాలను మిగిల్చినవాడు బాలగోపాల్. నీటి పంపకంలో తెలుగువారికి అరుచికరమైన వాస్తవాలను చెప్పాల్సి వచ్చినపుడు, మాదిగ రిజర్వేషన్ విషయంలో వాస్తవం వైపు నిలబడాల్సి వచ్చినపుడు ఆయన చూపిన వైఖరి అనుసరణీయమైనది.
బాలగోపాల్ ఆచరణకు, వ్యక్తిగత జీవితానికి మధ్య తేడాను పాటించలేదు. తాను చెబుతున్న విలువలను ఆయన తన వ్యక్తిగత జీవితంలో అనుసరించారు. ఆయన తన అనుభవాల నేపథ్యం నుంచి, కార్యాచరణ నుంచి ప్రజా ఉద్యమాలను ప్రేమపూరితంగానే ప్రశ్నించారు. ఆ ప్రేమను కూడా భరించలేని స్థితికి విప్లవోద్యమ మేధావులు సహించలేకపోయారు. ఆయన బాహ్య ప్రపంచం దాడులకు, బెదిరింపులకు ఏనాడూ లొంగిపోలేదు. విప్లవోద్యమంలోని లోటు పాట్లను ప్రశ్నించినందుకు ఆయనపై దారి తప్పిన బాలగోపాల్ అంటూ, ఇతరత్రా విమర్శల దాడి జరిగింది. అయినా ఆయన చలించలేదు.
సమాజాన్ని మార్చాలని, కనీస విలువల వైపు సమాజాన్ని నడిపించాలని ఆయన ప్రయత్నించారు. జీవితంలో ఆయన ఏ రోజు కూడా రాజీపడలేదు. అందుకే ఆయన పదునుగా కొత్త ఆలోచనలను ఆయన మన ముందుంచగలిగారు. హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా 'చెరగని హక్కుల స్ఫూర్తి'గా వెలుగొందుతున్నారు. నిజానికి సమాజానికి ఉపయోగపడే వారి ఆరోగ్యాన్ని కాపాడడం కూడా సమాజం బాధ్యత అవుతుంది. మేధావులను గాని, ప్రజా సంఘాలలో పని చేసే వారిని గాని ఎవరినైనా వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవలసిన పని ఆయా సమాజాలది అవుతుంది.
ప్రస్తుతం దేశం సామాజికంగా ఒక సంక్లిష్టమైన సందర్భంలో ఉంది. దశాబ్దంగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై మాట్లాడే వారిపై, ప్రజాసంఘాల పైన కేసులు పెడుతూనే ఉంది. ఈ సమయాన సామాజిక, సాంఘిక శాస్త్రాల ప్రాధాన్యతలు రోజురోజుకు కొరవడుతున్నాయి. యువతలో సామాజిక స్పృహ తగ్గిపోయింది. కొత్తగా ప్రజాసంఘాలలో ప్రజా ఉద్యమాలలో పనిచేసే వారు రోజురోజుకూ కనుమరుగు అవుతున్నారు. ఈనాటి పరిస్థితులపై బాలగోపాల్ ఉండి ఉంటే, ఏం మాట్లాడేవారు, ఏమి చేసేవారు. ఎలా ఆలోచించేవారు అంటూ చాలా వెలితితో కలవర పడుతున్నారు ఆయన అభిమానులు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!