మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్

- June 13, 2025 , by Maagulf
మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్

న్యూ ఢిల్లీ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి తన అవసరాలను బట్టి మొబైల్ సేవల ప్యాకేజీని సవరించుకునే అవసరం ఏర్పడుతోంది. ఈ దృష్టితోనే కేంద్ర టెలికాం శాఖ (DoT) (Telecom Department) వినియోగదారుల సౌకర్యార్థం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్లాన్ మార్పులో కీలక మార్పులు
ఒక వినియోగదారుడు తన మొబైల్ సర్వీస్‌ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మార్చుకున్న తర్వాత, మళ్లీ మరోసారి ప్లాన్ మార్చుకోవాలంటే కనీసం 90 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ వ్యవధిని ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా పరిగణించేవారు. అయితే, జూన్ 10న టెలికాం శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, ఈ నిరీక్షణ కాలాన్ని 30 రోజులకు కుదించారు. అంటే, ఒకసారి ప్లాన్ మార్చుకున్న తర్వాత, కేవలం 30 రోజుల వ్యవధిలోనే మరోసారి తమకు అనుకూలమైన ప్లాన్‌కు మారేందుకు అవకాశం కల్పించారు.

ఓటీపీ ఆధారిత కేవైసీ–మరింత సులభతరం
ఈ మార్పులు చేయాలనుకునే వినియోగదారులకు ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఈ కొత్త సదుపాయాన్ని పొందాలనుకునే వినియోగదారులు తమ సమీపంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల యొక్క కస్టమర్ సర్వీస్ కేంద్రాలను లేదా అధీకృత ఔట్‌లెట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ మార్పును చేసుకోవచ్చు.

ఈ సౌకర్యం ఎవరికీ వర్తిస్తుంది?
ఈ వెసులుబాటు కేవలం మొదటిసారి తమ ప్లాన్ మార్చుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక వినియోగదారుడు ఈ వెసులుబాటును ఒకసారి ఉపయోగించుకున్న తర్వాత, భవిష్యత్తులో మళ్లీ ప్లాన్ మార్చుకోవాలనుకుంటే, అప్పుడు పాత పద్ధతిలోనే 90 రోజుల నిరీక్షణ కాలాన్ని పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారుల సమయం ఆదా అవ్వడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన సర్వీసులను మార్చుకునేందుకు వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com