ఇరాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్రం చర్యలు

- June 17, 2025 , by Maagulf
ఇరాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్రం చర్యలు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించింది. మొదటి దశలో సుమారు 100 మంది భారతీయులను ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తరలించారు. ఈ బృందం సోమవారం అర్ధరాత్రి తర్వాత అర్మేనియాకు చేరుకుంది.ఇరాన్‌లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వారిలో 6,000 మందికి పైగా విద్యార్థులే కావడం గమనార్హం. ఈ పరిస్థితిలో విద్యార్థుల భద్రత గురించి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇరాన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ప్రస్తుతం ఇరాన్ గగనతలాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో విమాన మార్గం లేకపోవడంతో భారతీయులను భూ మార్గం ద్వారా తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అర్మేనియా, అజర్‌బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మీదుగా వారు భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చింది. ఎల్లప్పుడూ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని, సమాచారాన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవాలని కోరింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా సహకరించాలని సూచించింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చినప్పుడే యుద్ధం ముగుస్తుందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. దీనితో ఇరాన్‌లోని భారతీయుల భయాలు మరింత పెరిగాయి. భారత ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం గమనిస్తూ పౌరుల రక్షణకు పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com