ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో G7 టూర్ ముగించిన ట్రంప్
- June 17, 2025
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికా బయలుదేరి వెళ్లారు. G-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇవాళ కూడా ట్రంప్ కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. కెనడా నుంచే ఇరాన్‌కు కీలక హెచ్చరికలు జారీచేసిన ట్రంప్, తక్షణమే టెహ్రాన్‌ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మధ్యమంలో పోస్టు చేశారు. మొదట ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన, కొద్దిసేపటికే సామాజిక మధ్యమంలో ఇరాన్‌కు హెచ్చరికలు చేసి అమెరికా బయలుదేరివెళ్లారు.
అట్టుడుకుతున్న రెండు దేశాలు
మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్‌లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం వందకి పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
టీవీ కార్యాలయంపైనా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ అధికారిక టీవీ-IRIB కార్యాలయంపైనా ఇజ్రాయెల్ క్షిపణి పడింది. ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
యుద్ధవిమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తాం
టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో మూడో వంతు నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు. యుద్ధవిమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని చెప్పారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారని కథనాలు వచ్చాయి.
మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం-NPT నుంచి వైదొలగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌ను ఆపాలంటే ఒక్క ఫోన్‌కాల్ చాలని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘నెతన్యాహు లాంటి నాయకుడిని ఆపాలంటే అమెరికా నుంచి ఒక్క ఫోన్‌కాల్ చాలని, మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!