కాంగ్రెస్ రారాజు-రాహుల్ గాంధీ
- June 19, 2025
రాహుల్ గాంధీ..భారతదేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.శతాబ్దం పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటముల తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించి పార్టీకి జవసత్వాలు నిలిపిన ఘనత రాహుల్ సొంతం.పార్టీ అత్యున్నత స్థాయిలో ఉన్నా, నేడు ఒడిదుడుగుల్ని ఎదుర్కొంటున్న మొక్కవోని దీక్ష పార్టీని పటిష్ఠపరుస్తూ, ప్రత్యర్థుల అవమానాల్ని సైతం లెక్కచేయకుండా నేటికీ పార్టీకి పూర్వవైభవం కలిగించాలనే అకుంటిత దీక్షతో పనిచేస్తున్న యువనేత.నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం....
రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించారు.రాహుల్ ఢిల్లీ, డెహ్రాడూన్ లలో చదువుకున్నారు. అనంతరం, తమ కుటుంబ భద్రతా కారణాల రీత్యా రౌల్ విన్సి అనే మారుపేరుతో విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత 1995లో లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. అనంతరం ఇండియాకు తిరిగివచ్చి 2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.
రాహుల్ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీల మొదటి సంతానం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మునిమనవడు.రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలిగా కొనసాగుతున్నారు.రాహుల్ తన తల్లి సోనియా గాంధీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.
2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో అదే నియోజకవర్గం నుండి రెండో సారి విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పదేళ్ళ యూపీఏ పాలనలో జరిగిన పలు అవినీతి కుంభకోణాలు, దేశ శాంతి భద్రతల విషయంలో జరిగిన అవకతవకలు కారణంగా వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు చవి చూసింది. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్ని తక్కువ స్థానాలకు పరిమితమైంది. కనీసం పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు 2019 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ 139 ఏళ్ల చరిత్రలో రాహుల్‌గాంధీ ఎదుర్కొన్నంత తీవ్రమైన సవాళ్లను మరే నేతా ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ మాట్లాడిన ప్రతి మాటను బీజేపీ వాళ్లు ఎద్దేవా చేశారు. పప్పూ అంటూ వెక్కిరించారు. సోషల్ మీడియాలో ఒక జోకర్లా మార్చివేశారు. రాహుల్‌గాంధీని ఒక విఫలనేతగా, రాజకీయాల్లో ఆసక్తి లేని, సీరియ్‌సనెస్ లేని నేతగా ప్రచారం చేశారు.ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించటానికి, తనను తాను రాజకీయ నేతగా నిరూపించుకోవటానికి రాహుల్‌గాంధీ ఎంచుకున్న మార్గం ప్రజల వద్దకు వెళ్లటం.
దేశ ప్రజానీకం మధ్య బీజేపీ మతం పేరిట చిచ్చు పెడుతోందని, దీనికి వ్యతిరేకంగా భారతీయులను ఐక్యపరిచే లక్ష్యంతో పాదయాత్రను చేపడతానని ప్రకటించారు.2022 సెప్టెంబరు 7న.. కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలైంది. దారి పొడవునా రాహుల్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. 150 రోజులపాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3,570 కి.మీ.ల మేర నిరవధికంగా జరిగిన ఈ పాదయాత్ర కశ్మీర్లో ముగిసింది.ఈ పాదయాత్ర దేశ ప్రజానీకంలో రాహుల్ ఇమేజ్ను మార్చివేసింది.
2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవటానికి వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని ఇండియా కూటమి ఏర్పాటులో కూడా రాహుల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపారు.సీట్ల సర్దుబాటులో రాజీ ధోరణి చూపారు. పలు రాష్ట్రాల్లో తక్కువ స్థానాలకు పరిమితమై, స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలు ఎక్కువ సీట్లు తీసుకోవటానికి అంగీకరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయటంలో రాహుల్ ముద్ర సుస్పష్టం.
2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితిని రాహుల్ కల్పించారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ రంగస్థలం నిజంగానే కాంగ్రెస్ ముక్త్ కాబోతోందా అనే పరిస్థితి నుంచి కోలుకొని ఉనికిని మరోసారి బలంగా చాటుకుంది. ఈ మార్పు వెనక ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కృషి కీలకం. అలాగే, ఈ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసిన రెండు చోట్లా భారీ మెజారిటీ సాధించడం విశేషం.వయనాడ్‌లో తన ప్రత్యర్థి అయిన సీపీఐ నేత అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల మెజారీటీతో గెలుపెందారు.ఇక కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న రాయ్‌బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ 3,89,341 ఓట్ల మెజారీటీ సాధించారు.2029 నాటికి ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు రాహుల్ ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!