ఎమిరేట్స్, ఎతిహాద్ ఫ్లైట్స్ సస్పెన్షన్‌ పొడిగింపు..!!

- June 23, 2025 , by Maagulf
ఎమిరేట్స్, ఎతిహాద్ ఫ్లైట్స్ సస్పెన్షన్‌ పొడిగింపు..!!

యూఏఈ: ఇరానియన్ అణు కేంద్రాలపై దాడుల్లో ఇజ్రాయెల్‌తో చేరాలని అమెరికా నిర్ణయం తీసుకున్న తర్వాత గల్ఫ్ లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతీయ గమ్యస్థానాలకు ఫ్లైట్స్ సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు యూఏఈ విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్ ప్రకటించాయి.

 అమెరికా జోక్యం ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతుందని, సిరియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్ ఇతర గమ్యస్థానాలకు విమాన ప్రయాణానికి మరింత అంతరాయం కలిగించే అవకాశం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే యూఏఈ ఇతర గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. సంయమనం పాటించాలని, ఉద్రిక్తతను తగ్గించాలని కోరాయి.

కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ జూలై 15 వరకు టెల్ అవీవ్‌కు తన విమానాలను నిలిపివేసింది.   

 కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం (KWI) నుండి అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) కు వెళ్లే ఎతిహాద్ విమానం EY652 ఆదివారం సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేశారు.

ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లకు.. అలాగే, వాటి నుండి వచ్చే విమానాలను జూన్ 30 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.

దుబాయ్ ప్రధాన క్యారియర్ అయిన ఎమిరేట్స్.. జూన్ 30 వరకు ఇరాన్ (టెహ్రాన్), ఇరాక్ (బాగ్దాద్ మరియు బాస్రా) లకు వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

షార్జాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా కూడా ఈ నెలాఖరు వరకు ఇరాన్, ఇరాక్, రష్యా, అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్‌లకు సర్వీసులను నిలిపివేసింది. దాంతో, ప్రాంతీయ ఉద్రిక్తతలు, గగనతల పరిమితుల కారణంగా జోర్డాన్‌కు విమానాలు జూన్ 25 వరకు రద్దు చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com