పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి..తొక్కిసలాటలో ముగ్గురి మృతి

- June 29, 2025 , by Maagulf
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి..తొక్కిసలాటలో ముగ్గురి మృతి

పూరీ: ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది.గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మరోవైపు రథయాత్ర ఆలస్యం కావడం పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది.

జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి.ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది.ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు. వీరంతా పూరీ రథయాత్ర కోసం ఖుర్దా జిల్లా నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఘటన జరిగిన ప్రదేశంలో గుంపును నియంత్రించడానికి పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా కథనాలు ఆరోపించాయి.

ఇక‌, రథయాత్ర ఆలస్యం కావడంపై రాజకీయ వివాదం రాజుకుంది.బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ పరిస్థితిని దారుణమైన గందరగోళంగా అభివర్ణించారు.“మనం చేయగలిగింది ప్రార్థించడం మాత్రమే.ఈ ఏడాది ఈ దివ్యమైన ఉత్సవానికి నీలినీడలు అలుముకునేలా చేసిన ఈ గందరగోళానికి బాధ్యులైన వారందరినీ మహాప్రభు జగన్నాథుడు క్షమించాలి” అని ఆయన అన్నారు.

నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథివిరాజ్ హరిచందన్ పరోక్షంగా స్పందించారు. బీజేడీ అనవసరంగా రాజకీయ ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. “గతంలో బీజేడీ ప్రభుత్వం తప్పులు చేసి జగన్నాథుడిని అవమానించింది. 1977 నుంచి రథాలు ఎప్పుడూ రెండో రోజే గుండిచా ఆలయానికి చేరుకునేవి” అని ఆయన తెలిపారు.

సంప్రదాయం ప్రకారం జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలతో కూడిన రథాలను గుండిచా ఆలయానికి తీసుకువస్తారు.అక్కడ దేవతలు వారం రోజుల పాటు బస చేసి, ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. అయితే, ఈసారి యాత్ర ఆలస్యం కావడం, తొక్కిసలాట జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com