భారీ వర్షాల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

- June 29, 2025 , by Maagulf
భారీ వర్షాల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

 ఉత్తరాఖండ్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌ గత కొన్ని రోజులుగా ప్రకృతి పరాబవానికి నిలయంగా మారుతోంది. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఈ మేఘవర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదులు ఉప్పొంగిపోతూ, కొండచరియలు విరిగిపడుతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రముఖ చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం, భక్తుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని చార్‌ధామ్ యాత్రను 24 గంటలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. యాత్రికులు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో ప్రవేశించిన నేపథ్యంలో, పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

హరిద్వార్, రుషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలతో పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి. చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు.యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు.

ఈ పరిస్థితుల పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ–“ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి” అని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com