దిగ్గజ సాహితీవేత్త-కె.సభ

- July 01, 2025 , by Maagulf
దిగ్గజ సాహితీవేత్త-కె.సభ

దేశవాళీ తెలుగు గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన గొప్ప రచయిత కె .సభా. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  దశాబ్దం పాటు చేసిన వృత్తి నుండి బయటపడి పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా, కథా రచయితగా, కవిగా, నవలాకారుడిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. నేడు ప్రముఖ రాయలసీమ దిగ్గజ సాహితీవేత్త కె. సభ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..

కె. సభగా సాహిత్య,రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన కనక సభాపతి పిళ్ళై 1923, జూలై 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతం కొట్రకోనలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన చెంగల్వరాయుడు, పార్వతమ్మ దంపతులకు జన్మించారు. 8వ తరగతి తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి 16 సంవత్సరాల వయస్సులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ తర్వాత బి.ఏ వరకు ప్రైవేటుగా చదివారు.

ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే రచన రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య పట్టుదలతో చదివి ఎదిగిన సభా ఏనాడూ కష్టాలకు చలించలేదు. సమాజంలో తనచుట్టూ ఉన్న రైతు కూలీలు, రైతులు, వివిధ గ్రామీణ వృత్తులవారు, దళితులు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక అప్పటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే మరోవైపు ఉద్యమశీలత్వంతో కూడిన అనేక రచనలు చేశారు. రైతు రాజ్యం, పాంచజన్యం లాంటి బుర్రకథలు, దయానిధి వేద భూమి లాంటి పద్య కావ్యాలు, విశ్వరూప సందర్శనం లాంటి గేయ కావ్యం, బిక్షుకి, దేవాంతకుడు, దౌర్భాగ్యుడు, మొగిలి ఆయన రాసిన ప్రసిద్ధమైన నవలలు.

రైతు జీవితాన్ని రైతు సమస్యలను రైతాంగ జీవితంలోని మానవ సంబంధాలను, వ్యవసాయ రంగంలోని పరిణామాలను బయట నుండి దూరం నుండి చూసి తెలుగులో చాలా మంది రచనలు చేసి ఉండొచ్చుగాక కానీ, సొంతంగా భూమిని సంపాదించి నేలను సాగు చేసి స్వయంగా వ్యవసాయం చేస్తూ, రైతుగా రైతు పడే కష్టం ఏమిటో రైతు అనుభవాలు ఏమిటో స్వయంగా అనుభవించి రచనలు చేసిన రచయితలు చాలా అరుదు. అలాంటి అరుదైన రచయిత కె.సభా.స్వతహా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం మరియు తానే స్వయంగా వ్యవసాయం చేసిన అనుభవం వల్ల రైతు కష్టాలు ఏమిటో రైతు సమస్యలు ఏమిటో అతడికి స్వయంగా తెలుసు.

ఈ దశలోనే ఆయనకు చిత్తూరు జిల్లా రైతాంగ నాయకుడైన రాజన్న అలియాస్ పాటూరి రాజగోపాల్ నాయుడు గారి పరిచయం సభను రైతు ఉద్యమంలోకి వెళ్లేలా దోహదపడింది. రాజన్న ద్వారా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఆచార్య రంగా, భారతీదేవి రంగా మరియు పలు రైతాంగ నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడింది. రంగా గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైతాంగ రాజకీయ శిక్షణ పాఠశాలలో తర్ఫీదు పొందిన సభ 1947లో శివగిరి రైతాంగ విద్యాలయం తరగతులను విజయవంతంగా నిర్వహించారు. తన జీవిత పర్యంతం మిత్రులైన రాజన్న, రంగా గార్లకు అనుచరుడిగా నిలిచారు.

రైతులకి కూలీలకు మధ్య ఉండే అనుబంధం, రైతుకు రైతు కుటుంబాలతో ఉండే అనుబంధం, రైతుకు మట్టితో ఉండే అనుబంధం, రైతు- వ్యాపారస్తుల సంబంధాలు, రైతులు అధికారుల సంబంధాలు, కరువు కాటకాలు వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు ఇంకి పోవటం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం.సాగునీటి కోసం అలమటించడం, విత్తనాల కొరత, పంటల తెగులు, గ్రామీణ రైతాంగ జీవితంలో పంటల కాలాన్ని అనుసరించి పంట కోతల సందర్భాలను అనుసరించి, చెరుకు గానుగ ఆడే సందర్భాలను అనుసరించి కొనసాగే నవ దంపతుల ప్రేమానుబంధాలు, తల్లి బిడ్డల అనురాగాలు, అత్త మామ కోడళ్ళ మధ్య అనుబంధాలు, ఆడపడుచుల వెక్కిరింతలు, ప్రేమలు, అలకలు, ఒక అద్భుతమైన భారతీయ ఆత్మను సజీవంగా చిత్రీకరించారు.

సమాజంలో ఉండే వివిధ వర్గాలతో రచయితకు ఉండే సమీప్యాన్ని, అనుబంధాన్ని బట్టి, స్పందించే గుణం, సహానుభూతిని బట్టే  రచనలు మేలిమి రకం, తేలిక రకంగా వర్గీకరించబడుతాయి. కె. సభా గారివి మేలిమి రకం రచనలు,  హృదయ సంస్కారం స్పందించేగుణం, మంచి వ్యక్తిత్వం, సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ, సామాజిక శాస్త్రాల అవగాహన కలిగిన రచయితలు రాసే రచనలు ఎప్పుడూ వైవిధ్యభరితంగా విభిన్నంగా ఉంటాయి.

సిద్ధాంతాల కోసం సాహిత్యం కాక, వాస్తవ జీవితాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తున్నప్పుడు ఆ రచనలు -కళాత్మకత, సహజత్వం మామూలు మాటలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలు, సామెతలు, పాత్ర చిత్రణ, రచయిత కంఠస్వరంతో గొప్ప శిల్ప సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. దీనికి తోడు సరిగ్గా ఎక్కడ ప్రారంభం కావాలో అక్కడ ప్రారంభం కావడం, ఎక్కడ మలుపు తీసుకోవాలో అక్కడ మలుపు తీసుకోవటం, ఎక్కడ కొస మెరుపు ఉండాలో అక్కడ కొస మెరుపు ఉండటం, ఎక్కడ కొస మలుపు ఉండాలో అక్కడ కొస మలుపు ఉండటం, ఎక్కడ కథ ముగింపు ఉండాలో అక్కడ సరిగ్గా కథను ముగించటం, ఎక్కడా వాచ్యత లేకపోవడం, అనవసరమైన పదాలు, మాటలు, వర్ణనలు లేకపోవడం, పాత్రలు పాత్రలుగా కాక, సహజ మానవ స్వభావంతో ప్రవర్తించడం వారి రచనల ప్రత్యేకతలు.

గ్రామ స్వరాజ్య వ్యవస్థలో గ్రామీణ జీవితంలో అటు పల్లెలు, ఇటు  నగరాలు, సమాజాలు, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెత్తందారులు, చట్టాలు చట్టాల అమలు, కరువు కాటకాలు, కక్షలు, ఆత్మీయతానుబంధాలు, ప్రేమలు, పగలు, ప్రతీకారాలు, మానవ జీవితంలోని సుఖదుఖాలతో పాటు అనేక అనుభూతులను భావోద్వేగాలను అత్యంత ప్రతిభావంతంగా సహజంగా పాఠకులను ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా రాసిన రచయిత కె.సభా. వర్తమానాన్ని సక్రమంగా అర్థం చేసుకొని, భవిష్యత్తును అంచనా వేయగలిగిన దూరదృష్టి కలిగిన రచయిత కాబట్టే భవిష్యత్తులో ఏర్పడే ఎన్నో సామాజిక ఆర్థిక సాంఘిక రాజకీయ పరిణామాల్ని కాలాని కంటే ముందే గొప్ప దార్శనికుడిగా తన రచనల్లో చిత్రీకరించగలిగారు.

బాల సాహిత్య నిర్మాణంలో ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. పిల్లల కోసం ఆయన చేసిన రచనలన్నీ కలిపి 18 సంపుటాలుగా వచ్చాయంటే ఆయన  బాలసాహిత్యం పట్ల ఎంతటి బాధ్యతతో రచనలు చేశారో తెలుస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కారణంగా ఉపాధ్యాయుడిగా అతడికి కల అనేక అనుభవాలు  అతడి రచనల్లో జీవం పోసుకున్నాయి. రైతు జీవితాన్ని రాయలసీమ గ్రామీణ జీవితాన్ని చితికరించిన కథల్లో సైతం అత్యంత సహజమైన పిల్లల పాత్రల ప్రవర్తన చాలా విశేషంగా పాఠకులను ఆకట్టుకుంటుంది.

పిల్లల మనస్తత్వాన్ని ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు అనటానికి ఆయన కథల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. పరీక్షా ఫలితాలు ,చిట్టి మరదలు, స్వతంత్రోద్యయం, పురవది నాయక ,ఏటిగట్టున, చావు బేరం, చిన్నపిల్లల కోసం రాసిన నవలలు: పసి హృదయాలు, పావురాలు, సూర్యం, చంద్రం, కవి గాయకుడు, మత్స్య కన్యలు, పావురాలు బుజ్జి జిజ్జి ;అరగొండ కథలు, సీసా చరిత్ర, ఐకమత్యం ,చిలకమ్మ, బొంగరం, ప్రాచీన భారత విప్లవ గాధలు, ఎత్తుకు పై ఎత్తు, జాబిల్లి, అన్నయ్య- చిన్నయ్య మొదలైన కథా సంపుటాలు అద్భుతమైన వారి సాహిత్య కృషికి నిదర్శనాలు.

పద్య కావ్యాలు, గేయాలు, కవితలు, కథలు, నవలలు, బాలసాహిత్యం, బుర్రకథలు, పాటలు,  సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సాంఘిక వ్యాసాలు, సమీక్షలు, సాహిత్య విమర్శ , సంపాదకీయ వ్యాసాలు, పరిశోధనాత్మక వార్తా కథనాలు.. ఇట్లా ఎన్నో ప్రక్రియలో ప్రతిభావంతమైన రచనలు చేసిన కేసభా మొదట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఆ చట్రం నుండి బయటపడి పత్రికా రంగంలోకి స్వేచ్ఛగా వచ్చేశాడు. పాత్రికేయుడుగా సంపాదకుడిగా అతడు సామాజిక స్పృహతో ఎన్నో విలువైన వ్యాసాలను రాశాడు. జీవన భద్రతను కాదనుకుని  ఉపాధ్యాయ వృత్తి నుండి బయటపడి, ప్రజల కష్టాలకు బాధలకు సమస్యలకు దుఃఖానికి స్పందించి, చలించి ఉపాధ్యాయ వృత్తి నుండి ఆయన నేరుగా పత్రికా రంగంలోకి వచ్చేయడం ఒక విప్లవాత్మక సాహసోపేతమైన చర్య.

ఆయన్ని కేవలం పద్య కవి గానో, వచన కవి గానో, కథా నవలా రచయితగానో, బుర్రకథా రచయితగానో,   సంపాదకుడిగానో, పాత్రికేయుడి గానో, పత్రికా నిర్వాహకుడిగానో, ఉపాధ్యాయుడి గానో, రైతుగానో .. ఏదో ఒక వృత్తికి లేదా ఒక ప్రవృత్తికి పరిమితం చేయలేం. ఎందుకంటే సాహితీ రంగంలో బహుముఖీన అన్ని రంగాలలో కృషిచేసిన సృజనకారుడు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణల సంఘం, కళాపరిషత్తు, శారదా పీఠం, శ్రీ రమణ పబ్లికేషన్స్ సంస్థలలో గొప్ప సాహిత్య సంస్కృతిక వాతావరణాన్ని సృష్టించి, కొనసాగించి, యువతరాన్ని , కొత్తగా రచనా రంగంలోకి వచ్చిన ఔత్సాహిక రచయితలను ఎంతగానో ప్రోత్సహించి,చివరిలో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లి, ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఉన్న కె. సభా 1980, నవంబర్ 4న కన్నుమూశారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com