బాధిత కుటుంబాలకు మానవత్వంతో సాయం అందించండి: సీఎం రేవంత్
- July 01, 2025
పటాన్ చెరు: సిగాచి రియాక్టర్ల పేలుడు ఘటనపై పూర్తి నివేదికను సత్వరంగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు మానవత్వంతో సహకరించాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యం మీద ఉందని సీఎం స్పష్టం చేశారు. అంతేగాక, ఘటనలో గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, బాడీలను ట్రేస్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు ముఖ్యమంత్రి. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు,దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ అనుమతులు ఇచ్చే సమయంలో పరిశీలన జరిగిందా లేదా?, పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరూ, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ పరిశ్రమను తనిఖీ చేశారా వంటి కీలకమైన ప్రశ్నలు అడిగారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద నివారణకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ప్రతి శాఖ సమన్వయంతో స్పందించాలి అని ఆయన పేర్కొన్నారు.
సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యం స్పందించిందా అని మరో ప్రశ్న వేశారు. ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఊహాజనిత జవాబులు కాకుండా వాస్తవాలను తెలపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని, ఇప్పటికే పరిశీలించిన అధికారులతో కాకుండా కొత్త బృందంతో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
యాజమాన్యం పై సీఎం ఫైర్
సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోందని.. ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని నిలదీశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
హాస్పిటల్లో క్షతగాత్రులకు రేవంత్ పరామర్శ
పరిశ్రమను తనిఖీ చేసిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకోన్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. కాగా తక్షణ సాయంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ను సీఎం రేవంత్ పరామర్శించనున్నారు.
45కి చేరిన మృతుల సంఖ్య
కాగా.. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో సింగరేణి టీమ్ పాల్గొంది. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. 34 మందికి తీవ్రగాయాలు అవగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 29 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మృతదేహాల గుర్తించారు. ఇంకా 17 మంది ఆచూకీ గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!