సోషలిస్టు నాయకుడు-శరద్ యాదవ్

- July 03, 2025 , by Maagulf
సోషలిస్టు నాయకుడు-శరద్ యాదవ్

శరద్ యాదవ్....భారతదేశ రాజకీయాల్లో సోషలిస్టు అగ్రనేతల్లో ఒకరు. సాధారణ కుటుంబ నేపథ్యం...గొప్ప ఇంజనీర్ కావాలనే ఆయన కలలను ఆపలేకపోయినా, లోహియా భావజాల ప్రభావం ఆయన లక్ష్యం నుంచి మరల్చింది. విద్యార్ధి ఉద్యమాల్లో ఢక్కామొక్కీలు తిని.. జెపి, చరణ్ సింగ్ వంటి ఉద్దండ నేతలకు సన్నిహితుడయ్యారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలుకు కృషి సల్పి సఫలీకృతం అయ్యారు. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. నేడు సోషలిస్టు దిగ్గజ నేత శరద్ యాదవ్ మీద ప్రత్యేక కథనం..

శరద్ యాదవ్ 1947, జూలై 1న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లా బాబాయి గ్రామంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నంద కిషోర్ యాదవ్, సుమిత్ర దేవి. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే సాగినప్పటికి ఆ తర్వాత జబల్‌పూర్ పట్టణానికి మారి అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేశారు. జబల్‌పూర్ రాబర్ట్స్‌సన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సి, ప్రముఖ జబల్‌పూర్ ఇంజనీరింగ్ కళశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈనాటికి ఆ కళాశాల అత్యుత్తమ విద్యార్థులు జాబితాలో శరద్ పేరు నిలిచి ఉంది.

శరద్ బాల్యంలో లేమి మరియు వెనుకబడిన యాదవ సామాజిక వర్గంలో జన్మించడం వల్ల కొంత వివక్షను ఎదుర్కొన్నారు. ఆ అనుభవం ఆయన్ని ఇంజనీరింగ్ వైపు దృష్టి సారించేలా చేశాయి. తమ గ్రామంలో ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి, వివక్షను దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అర్హత ప్రవేశ పరీక్ష రాయగా మొదట్లో అర్హత సాధించకపోవడంతో బీఎస్సిలో చేరి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం సన్నద్ధం అయ్యారు. అలా బీఎస్సి పూర్తి చేసే సమయంలో ఇంజనీరింగ్ సీటు సాధించారు. జబల్‌పూర్ ఇంజనీరింగ్ కళశాలలో ఇంజనీరింగ్ చేరారు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే శరద్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగిగా రిటైర్ అయ్యేవారు. కానీ, విధి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి జాతీయ నాయకుడిగా నిలిపింది.

శరద్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అంబేద్కర్, లోహియా రచనలు చదువుతూ క్రమంగా సామ్యవాద భావజాలానికి క్రమ క్రమంగా  ఆకర్షితుడయ్యారు. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సైతం విద్యార్ధి నాయకుడిగా పలు నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. అదే సమయంలో లోక్ నాయక్ జెపి సంపూర్ణ ఉద్యమంలో భాగమై అరెస్ట్ అయ్యారు. శరద్ అరెస్ట్ అయ్యే నాటికి జబల్‌పూర్ పట్టణంలో ప్రముఖ యువనేతగా ఎదిగారు. జైల్లో ఉన్న సమయంలోనే 1974లో వచ్చిన జబల్‌పూర్ ఎంపీ ఉపఎన్నికల్లో భారతీయ లోక్ దళ్ తరపున పోటీ చేసి గెలిచారు. శరద్ యాదవ్ గెలుపు కూడా ఇందిరాను ఒక విధంగా తన బలం పట్ల అపనమ్మకాన్ని కలగజేసింది అంటారు.

శరద్ ఎంపీగా గెలిచినప్పటికి పార్లమెంట్ గడప తొక్కకుండానే దేశంలో ఎమెర్జెన్సీ రావడం జరిగింది. దాదాపు మూడేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 1977లో ఎమెర్జెన్సీ ఎత్తి వేయడం వల్ల విడుదల అయ్యారు. 1977 సార్వత్రిక ఎన్నికల్లో జబల్‌పూర్ నుంచి రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1977-79 వరకు జనతాపార్టీ జాతీయ కార్యదర్శిగా, యువదళ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సమయంలోనే రైతు నాయకుడు, అప్పటి హోమ్ మంత్రి చరణ్ సింగ్ ప్రధాన అనుచరుడిగా మారారు. 1979లో జనతా పార్టీ రెండు వర్గాలుగా చీలిన సమయంలో చరణ్ సింగ్ పక్షాన నిలబడ్డారు. 1980 ఎన్నికల్లో జబల్‌పూర్ నుండి ఓడిపోయారు.

1980లో చరణ్ సింగ్ ఏర్పాటు చేసిన లోక్ దళ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టి 1989 వరకు కొనసాగారు. సంజయ్ గాంధీ ఆకస్మిక మరణంతో వచ్చిన 1981 అమేథీ ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయారు.1984 ఎన్నికల్లో లోక్ దళ్ నుంచి యూపీలోని బదౌన్ నుండి ఓడిపోయారు. 1986లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. 1988 చివర్లో జనతాదళ్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1989 ఎన్నికల్లో బదౌన్ నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.1989-90 వరకు విపి సింగ్ మంత్రివర్గంలో జౌళి శాఖ  మంత్రిగా పనిచేశారు.

జనతాదళ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ కూటమి మధ్య సమన్వయ కర్తగా, జనతాదళ్ పార్లమెంటరీ బోర్డు ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వంలో శక్తివంతమైన పాత్రను పోషించారు. పైగా బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి విపి సింగ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మండల్ కమిషన్ సిపారస్సులు అమలు చేయడం ద్వారా వెనకబడిన వర్గాలకు 23 శాతం రిజర్వేషన్స్ అమలు జరిగేలా కృషి చేసి చరిత్రలో నిలిచారు. మండల్ కమిషన్ సిపారస్సులు అమలు చేయించడం ద్వారా ఉన్నత వర్గాలకు, దళిత వర్గాల ప్రజలకు దూరం అయిపోయారు. ఆ రెండు వర్గాల వారు ఆయనకు దూరం జరగడం వల్ల ఒక సముదాయానికి నాయకుడిగా మిగిపోయారు.

రిజర్వేషన్స్ వల్ల తనకు వచ్చిన చెడ్డ పేరును గుర్తించి 1991 ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలోని యాదవులకు మంచి పట్టుండే మాధేపురా నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎంపీ అయ్యారు. 1996లో కూడా అదే స్థానం నుంచి ఐదోసారి ఎంపీ అయ్యారు. 1991-97 మధ్యన పార్టీలో లాలు ఆధిపత్యం పెరగడం. ఇతర సముదాయాలకు చెందిన నేతలు క్రమంగా వేరే పార్టీలకు వెళ్లడం ద్వారా జనతాదళ్ బలం తగ్గుతూ వచ్చింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కూటమిలో మంత్రి పదవిని చేపట్టాలని అనుకున్నా, లాలూ తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో మంత్రి పదవికి దూరమయ్యారు. 1997లో లాలూ పార్టీని చీల్చి సొంత కుంపటిని పెట్టుకున్న సమయంలో జనతాదళ్ పార్టీ పగ్గాలను శరద్ చేపట్టి 1999 వరకు నిర్వహించారు. 1998లో మాధేపురా నుంచి పోటీ చేసి లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఓడారు.

1999లో జనతాదళ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కర్ణాటక మాజీ సీఎం జె.హెచ్.పటేల్ భాజపా నాయకత్వంలోని ఎన్డీయే వైపు మొగ్గు చూపడాన్ని నిరసిస్తూ మాజీ ప్రధాని దేవెగౌడ మరోమారు పార్టీని చీల్చి జనతాదళ్(సెక్యులర్) అలియాస్ జేడీఎస్‌ను స్థాపించారు. పటేల్ తర్వాత చీలిన పక్షాన్ని జనతాదళ్ (యూనిటెడ్) పక్షానికి శరద్ నాయకత్వం వహించారు. 1999 ఎన్నికల్లో జనతాదళ్ (యూనిటెడ్) ఎన్డీయే కూటమిలో చేరి, ఆ ఎన్నికల్లో మాధేపురా నుంచి బరిలోకి దిగి లాలూపై గెలిచి ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

1999 నుంచి 2004 వరకు పౌర విమానయానం, కార్మిక సంక్షేమం, వినియోగదారులు & ఆహార శుద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే శరద్ వైఖరి నచ్చక రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీని చీల్చి లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. 2003లో శరద్ యాదవ్, దిగ్విజయ్ సింగ్‌లు కలిసి సమతా పార్టీ నాయకులైన నితీశ్ కుమార్, జార్జి ఫెర్నాండెజ్ మరియు లోక్ శక్తి పార్టీ అధినేత రామకృష్ణ హెగ్డేలను కలిసి ఒప్పించి ఆ పార్టీలను జనతాదళ్ (యూనిటెడ్)లో విలీనం చేయడానికి ఒప్పించారు. నితీశ్ సైతం బీహార్ రాజకీయాల్లో ఆధిపత్యం సాధించాలంటే జనతాదళ్ ముద్ర అవసరం ఉందని గ్రహించి తన సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అలా 2003 చివరఖురాను సమతా, లోక్ శక్తి పార్టీలు విలీనం అయ్యి జనతాదళ్(యునైటెడ్) పార్టీగా రూపాంతరం చెందింది. ఒప్పందం ప్రకారం కొత్త పార్టీకి శరద్ యాదవ్ జాతీయ అధ్యక్షుడయ్యారు. 2003-17 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.

2004 ఎన్నికల్లో మాధేపురా నుండి లాలూ చేతిలో ఓడారు. 2005 ఉప ఎన్నికల్లో లాలూ అనుచరుడైన పప్పు యాదవ్ చేతిలో ఓడిన తర్వాత రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా మారి జార్జి ఫెర్నాండెజ్, జయ జైట్లీలను పార్టీ నుంచి గెంటేశారు. 2009 చివర్లో నితీశ్ ఆదేశాలను ధిక్కరించిన లాలన్ సింగ్, దిగ్విజయ్ సింగ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2009 ఎన్నికల్లో మాధేపురా నుంచి ఏడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో జేడీయూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిన సమయంలో నితీశ్ వైపు నిలిచారు.

2014 ఎన్నికల్లో మాధేపురా నుంచి ఓడిపోయారు. 2015లో రాజ్యసభకు మూడోసారి ఎన్నికయ్యారు. 2015లో నితీశ్ - లాలూ కలయిక కోసం కృషి చేసి వారిద్దరిని కలిపారు. 2017లో నితీశ్ లాలూను విడిచి మళ్ళీ భాజపా వైపు వెళ్లడాన్ని నిరసించినందుకు పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నందుకు నితీశ్ బృందం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అలా శరద్ -  జనతాదళ్ మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల బంధం తెగిపోయింది. 2017లో లాలూ వల్ల నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేసిన శరద్ మునుపటిలాగా ప్రజలకు చేరువ కాలేకపోయారు. 2020 నాటికి లాలూ ఆర్జేడీలో చేరిపోయారు. చివరి దశలో గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపారు.

శరద్ పేరిట పలు రికార్డులు ఉన్నాయి. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఏకైక నాయకుడిగా చరిత్ర సృష్టించారు. కేవలం 30 ఏళ్లకే జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జేడీయూ లాంటి జాతీయ పార్టీకి 14 ఏళ్ళ పాటు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగిన ఘనత కూడా ఆయనకే దక్కింది. తన తరం నాయకుల్లో అత్యధిక సార్లు (7 సార్లు) ఓటమి పాలైన నాయకుడిగా నిలిచారు. ఒకే ప్రత్యర్థి మీద రెండు సార్లు ఓడిన ఘనత కూడా ఆయనదే! 1998,2004లలో మాధేపురా నుంచి లాలూ చేతిలో, 2005,2014 లలో పప్పు యాదవ్ చేతిలో ఓడారు.

శరద్ జాతీయ రాజకీయాల్లో రాణించినా, తన స్వయంకృతం కారణంగా పలు తప్పిదాలకు పాల్పడ్డారు. మండల్ కమిషన్ తర్వాత జనతాదళ్ పార్టీని బలహీన పడకుండా చూడాల్సింది పోయి లాలూకు వత్తాసు పలుకుతూ ఉన్న కారణంగా జార్జి ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్, హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్ వంటి నిఖార్సయిన సోషలిస్టులు పార్టీ నుంచి వెళ్లిపోయారు. వారితో పాటుగా తనను ఎప్పుడు కాపాడతాడు అని భావించిన లాలూ సైతం 1997లో జనతాదళ్ పార్టీని చీల్చి తన రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం జరిగింది. సోషలిస్టు భావజాలాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన సమయాన భాజపా పంచన చేరడం మూలంగా సెక్యులర్ ఇమేజిని పోగొట్టుకున్నారు. లాలూ, నితీశ్ రాజకీయాల్లో కులానికే ప్రాముఖ్యత ఇచ్చి లాలూ పక్షాన నిలబడటం మూలంగా జనతాదళ్ పార్టీ నుంచి గెంటి వేయబడ్డారు. ఇలా రాజకీయంగా ఎన్నో తప్పుల వల్ల ప్రజల నుంచి దూరమయ్యారు. చివర్లో తన తప్పులు తలుచుకొని బాధపడుతూ 2023, జనవరి 12న తన 75వ ఏట గురుగ్రామ్ పట్టణంలో కన్నుమూశారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com