సౌదీ అరేబియాలో 996 సంస్థలకు భారీ జరిమానాలు..!!

- July 04, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 996 సంస్థలకు భారీ జరిమానాలు..!!

రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) అధికారులు ఏప్రిల్, మే నెలల్లో  నిర్వహించిన తనిఖీలలో 996 సంస్థల ఉల్లంఘనలను గుర్తించారు. 5,912 వ్యాపార సముదాయాలను అధికారులు తనిఖీ చేశారు.  అవసరమైన లైసెన్స్‌లు పొందకపోవడం, ఉత్పత్తి భద్రతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు పాల్పడినందుకు 136 సంస్థలను మూసివేశారు. దాంతోపాటు 127 ఉత్పత్తి లైన్‌లను సస్పెండ్ చేశారు. 1,750 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.  

ఈ పర్యటనల సమయంలో అథారిటీ తనిఖీ బృందాలు లైసెన్స్ లేని సరఫరా దారుల నుంచి వస్తువులను కొంటున్న ఆహార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆరోగ్య ధృవీకరణ పత్రాలు లేకుండా అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారని గుర్తించారు. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గడువు ముగిసిన వైద్య ఉత్పత్తులను చట్టవిరుద్ధంగా నిల్వ చేసినందుకు అనేక లైసెన్స్ లేని గిడ్డంగులను సీజ్ చేశారు. మొత్తం 313,789 ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. 

అథారిటీ అధికారులు అనేక ఉల్లంఘనలకు పాల్పడిన ఆహార తయారి కేంద్రాన్ని కూడా సీజ్ చేసింది.  వీటిలో హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ (HACCP) నాణ్యత ధృవీకరణ పత్రాన్ని పొందడంలో ఫెయిల్, ముడి పదార్థాల ఫ్రీజర్‌లలో మీట్ కుళ్లిపోవడం ఉన్నాయి. 2,000 కిలోగ్రాముల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.  ఫ్యాక్టరీపై కేసు నమోదు చేశారు. సౌదీ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ సిటీస్ అండ్ టెక్నాలజీ జోన్స్ (MODON) తనిఖీలలో పాల్గొంది.  నంబర్ 19999ని సంప్రదించడం ద్వారా ఏవైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com