వామపక్ష ఉద్యమ నేత-బి.వి.రాఘవులు

- July 04, 2025 , by Maagulf
వామపక్ష ఉద్యమ నేత-బి.వి.రాఘవులు

బివి రాఘవులు... తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. నమ్మిన వామపక్ష సామ్యవాదం కోసం ఉన్నత కుటుంబ వారసత్వ పోకడలను వదిలి వ్యవస్థలో మార్పు తేవడమే లక్ష్యంగా వామపక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టారు. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర పొలిట్ బ్యూరో వరకు ఎదిగిన ఆయన్ను చూసిన వారంతా అంత పెద్ద నాయకుడు ఎంత నిరాడంబరంగా వున్నాడో చూడండి అంటూ పార్టీలకు అతీతంగా అభినందిస్తుంటారు. కానీ, అవేమి పట్టని ఆయన రాగద్వేషాలకు అతీతంగా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణమే ధ్యేయంగా ఈనాటికి  ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నేడు వామపక్ష ఉద్యమ నాయకుడు కామ్రేడ్ బి.వి.రాఘవులు మీద ప్రత్యేక కథనం..  

కామ్రేడ్ బివిగా సుపరిచితులైన బి.వి.రాఘవులు పూర్తి పేరు బోడపాటి వెంకట రాఘవులు. 1954, జూన్ 1న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు తాలూకా పెదమోపాడు గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బోడపాటి వెంకట సుబ్బయ్య, పున్నమ్మ. కందుకూరు పట్టణంలో హైస్కూల్ విద్యను పూర్తి చేసిన తర్వాత గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సి రెండో సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేశారు.ఆ తర్వాత కావలి జవహర్ భారతి డిగ్రీ కళశాలలో బీఏ పూర్తి చేశారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లీషులో పిజి డిప్లొమా పూర్తి చేశారు.

రాఘవులు జీవితంలో ఆయన తండ్రి సుబ్బయ్య పాత్ర చాలా కీలకం. తండ్రి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల నిరాడంబరంగా ఉంటూ ఖద్దరును ధరించేవారు. ఆరోజుల్లోనే చదువు మీదున్న మక్కువతో పెళ్ళైన తర్వాత కూడా పట్టుదలతో కష్టపడి ఎస్.ఎల్.సి పూర్తి చేశారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకోని రాఘవులు మేనమామలు, అన్నలు సైతం ఉన్నత చదువులు చదివారు. రాఘవులు రెండో సోదరుడు ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి వ్యవసాయం మీదున్న మక్కువతో రైతుగా స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులు మొత్తం విద్యాధికులు కావడం, ఆధునిక భావాలను కలిగి ఉండటం వలన రాఘవులు చిన్నతనం నుంచే స్వేచ్ఛావాద భావాలను కలిగి ఉండేవారు.

రాఘవులు రెండో అన్న ఒంగోలు ఠాగూర్ ట్యుటోరియల్లో చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఆ ట్యుటోరియల్ నిర్వాహకుడు కామ్రేడ్ మోజెస్ పార్టీ పట్ల అంకిత భావం గురించి అన్న ద్వారా తెలుసుకొని రాఘవులు కమ్యూనిజం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. హైస్కూల్ చదువుకునే రోజుల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతలైన కామ్రేడ్ గుజ్జుల యల్లమందా రెడ్డి, డాక్టర్ కోటారెడ్డి వంటి నాయకుల వల్ల కమ్యూనిజం మీద అభిమానాన్ని పెంచుకున్నారు. గుంటూరులో చదువుతున్న సమయంలో కమ్యూనిజం సిద్ధాంత పుస్తకాలను, హేతువాద రచనలు విరివిగా చదివేవారు.ఆరోజుల్లో వామపక్ష విద్యార్ధి ఉద్యమ నేతలైన డాక్టర్ దేవినేని మల్లికార్జున్ (మల్లిక్), డాక్టర్ చాగంటి భాస్కరరావులు శ్రీకాకుళం సాయుధ ఉద్యమంలో అమరులైన సమయంలో వారిని స్ఫూర్తిగా తీసుకోని విప్లవ దళంలోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే, సన్నిహితుల సూచనలు మేరకు ఆ ఆలోచన విరమించుకున్నారు.

గుంటూరు తర్వాత బాపట్ల వ్యవసాయ కళశాల మొదటి సంవత్సరంలో రాఘవులు ఎస్.ఎఫ్.ఐలో చేరారు. రెండో సంవత్సరం నాటికి విద్యార్ధి రాజకీయాల్లో అతివాద ధోరణి, కాలేజీలో కులతత్వాన్ని వ్యతిరేకించడం కారణంగా ఆయన వ్యక్తిగతంగా పలు ఇబ్బందులను  ఎదుర్కొన్నారు. పరిస్థితులు వికటించడంతో చదువుకు స్వస్తి పలికి కావలి జవహర్ భారతి కళాశాలలో డిగ్రీ కోర్సులో చేరారు. కావలిలో ఉన్న సమయంలోనే విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి నెల్లూరు జిల్లా ఎస్.ఎఫ్.ఐలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. నెల్లూరు జిల్లా వామపక్ష ఉద్దండ నాయకుడైన జక్కా వెంకయ్య మార్గదర్శనంలో రాజకీయ ఓనమాలు దిద్దారు.డిగ్రీ మూడో సంవత్సరంలో దేశంలో ఎమెర్జెన్సీ విధించిన సమయంలో ఫైనల్ ఇయర్ పరీక్షలకు రాస్తూనే పార్టీ కొరియర్ బాధ్యతల్లో ఉండేవారు.

1976లో డిగ్రీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తగా మారారు.1976-78 వరకు నెల్లూరు జిల్లా ఎస్.ఎఫ్.ఐ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటూనే నెల్లూరు పార్టీ కార్యాలయంలో పనిచేశారు.1979లో పార్టీ ఆదేశాల మేరకు విశాఖపట్నం వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేస్తూనే యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్ధి ఉద్యమానికి పునాదులు వేశారు. 1979-81 వరకు ఉత్తరాంధ్ర ఎస్.ఎఫ్.ఐ నిర్వహణ బాధ్యతలు చూసిన ఆయన యూనివర్సిటీలోనే ఎకనామిక్స్ రీసెర్చ్ స్కాలర్‌గా చేరారు. ఆ దశలోనే ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. 80వ దశకం మధ్యలో విశాఖపట్నం జిల్లా సిపిఎం కార్యదర్సులు వివిధ ప్రమాదాల్లో వెంటవెంటనే ఆకస్మిక మరణాలతో పార్టీ పెద్దల ఆదేశాల మేరకు జిల్లా సిపిఎం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

రాఘవులు విశాఖ జిల్లా కార్యదర్శిగానే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యవేక్షణ మరియు సమన్వయ బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఉద్యమాలు నిర్మించారు. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన తర్వాత జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. అలా విశాఖపట్నం జిల్లాతో అవినాభావ సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1994లో సీపీఎం కార్మిక విభాగం సి.ఐ.టి.యూ ప్రధాన కార్యదర్శిగా నియమితులై 1997 వరకు రాఘవులు కొనసాగారు.

1997 నల్గొండ మహాసభల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాఘవులు ఎన్నికయ్యారు. 1997 నుంచి 2014 వరకు వరసగా నాలుగుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వుతూనే వచ్చారు. ఆ 17 ఏళ్ళ కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాల నిర్మాణం మొదలుకొని పార్టీలోకి యువతను చేర్చుకొని వారికి అధ్యయన, శిక్షణ తరగతుల నిర్వహణ, పార్టీలోని అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ సమిష్టి కార్యాచరణతో ముందుకు వెళ్లారు. విశాలాంధ్రకు కట్టుబడి ఎంత వ్యతిరేకత వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేకపోవడం, వానపిక్ భూముల స్వాధీనం వంటి ఎన్నో సమస్యలపై ప్రభుత్వ వర్గాల ఒత్తిడిలను అధిగమించి రాజీలేని పోరాటాలు చేశారు. బహుశా ఇందువల్లనే ఆయనికి పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి ఉద్దండులకు సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా చరిత్రలో నిలిచిపోయారు.  

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైనప్పటికి పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ  నిర్వహణ, అజెండాల రూపకల్పన, ఉద్యమాల నిర్మాణం, సమిష్టి ఐక్య కార్యాచరణ, మహాసభల ఏర్పాటు సమన్వయం వంటి అంశాల్లో మార్గదర్శనం చేసే బాధ్యతలను చేపట్టారు. నాటి నుంచి ఈనాటి వరకు ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ నిర్యాణ సమస్యలను సరిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడు పర్యాయాలు కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు.  

రాఘవులతో కలిసి పనిచేసిన పెనుబల్లి మధు, వంకాయలపాటి శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రంలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కార్యదర్సులయ్యారు. అలాగే, ఆయన పట్టుబట్టి మరి ఎందరో యువకులకు, మహిళలకు పార్టీ పదవుల్లో, ఎమ్యెల్యే మరియు ఎంపీ సీట్లలో  అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కులమతాలకు అతితీతంగా అన్ని వర్గాల సమ్మిళితం వల్లే పార్టీ ప్రజలకు చేరువ అవుతుందని వాదిస్తూ వచ్చేవారు. ఆయన వాదనలను మాజీ సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఏకీభవించేవారు.ఏచూరి పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో బడుగు, బలహీన మరియు యువతకు పార్టీ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ సమావేశాల్లో ప్రొపోజల్స్ పెట్టి అంగీకరింపజేశారు.

ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అనేక రాజకీయ ఒత్తిడులను సునాయాసంగా ఎదుర్కొని ఉద్యమ బాటలోనే సంతోషాలను వెతుక్కోవడం, తానూ సైతం కార్యకర్తల కుటుంబల్లో సభ్యునిగా మెలగడం, నిరాడంబరమైన జీవితాన్ని జీవిస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఏడు పదులకు చేరువైనప్పటికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, పార్టీ అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా వామపక్ష భావజాలమే ఊపిరిగా బ్రతుకుతున్న నిఖార్సయిన నాయకుడైన  రాఘవులుకు సీపీఎం జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

  --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com