సోషలిస్టు దళిత దిగ్గజం-రామ్ విలాస్ పాశ్వాన్

- July 05, 2025 , by Maagulf
సోషలిస్టు దళిత దిగ్గజం-రామ్ విలాస్ పాశ్వాన్

రామ్ విలాస్ పాశ్వాన్... దేశ రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన నేతల్లో ఒకరు. సోషలిజానికి దళితవాదాన్ని జోడించి సరికొత్త రాజకీయాలకు నాంది పలికారు. లోహియావాదిగా రాజకీయ ఓనమాలు దిద్ది... దేశంలోనే అతిపెద్ద సోషలిస్టు దళిత నేతగా ఎదిగారు. 7 కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా నిలిచారు. స్వపక్ష, విపక్ష, పరపక్ష భేదాలను చూడకుండా అందరికి అందుబాటులో ఉంటూ వారికి అత్యంత ప్రీతి పాత్రుడయ్యారు. నేడు సోషలిస్టు దళిత దిగ్గజ నేత రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం....

 రామ్ విలాస్ పాశ్వాన్ 1946, జులై 5న బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లా హాజీపూర్ అలౌలీ బ్లాక్‌లోని షాహర్‌బన్నీ గ్రామంలో నిరుపేద దుస్సాద్ దళిత కుటుంబానికి చెందిన జామున్ పాశ్వాన్, సియాదేవి దంపతులకు జన్మించారు. పాశ్వాన్ బాల్యం, ప్రాథమిక విద్యను గ్రామంలోనే పూర్తి చేసిన తర్వాత అలౌలీలో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఖగారియాలోని కోసి కాలేజీలో లా డిగ్రీ మరియు పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ పూర్తి చేశారు. పీజీ చదువుతున్న సమయంలోనే ప్రభుత్వ టీచర్ మరియు బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో డిఎస్పీ ఉద్యోగాలను సాధించారు. అయితే, అందులో చేరలేదు.

పాశ్వాన్ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పలు రకాల వివక్షను ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మిత్ర బృందంలో ఉన్నత కులాలకు చెందిన వారే ఎక్కువగా ఉండేవారు. కాలేజీ రోజుల్లో అంబేద్కర్, లోహియా, జెపి రచనలు చదివి సోషలిజం భావాలను విద్యార్ధి దశలోనే అలవర్చుకున్నారు. విద్యార్ధి రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా వ్యవహరించనప్పటికి సంయుక్త సోషలిస్టు పార్టీ విద్యార్ధి విభాగం నేతలతో సన్నిహితంగా మెలిగేవారు. వారి ద్వారా యూపీ సోషలిస్టు నేత రాజ్ నారాయణ్ పరిచయం అయ్యారు. కరడుగట్టిన లోహియవాదిగా ముద్రపడిన రాజ్ సానిహిత్యంలో పాశ్వాన్ సైతం లోహియవాదిగా మారారు. రాజ్ ద్వారా అప్పటి బీహార్ సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు.  

1969 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలౌలీ నుంచి సంయుక్త సోషలిస్టు పార్టీ తరపున పాశ్వాన్ తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బీహార్ రాజధాని పాట్నా రాజకీయాలను అవపోసన పట్టి కర్పూరికి అనంగు శిష్యుడయ్యారు.1972లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దీ కాలం స్తబ్దుగా ఉన్నప్పటికి 1973లో జెపి నాయకత్వంలో తలపెట్టిన బీహార్ సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1975లో ఎమ్యెర్జెన్సీ విధించిన తర్వాత అరెస్ట్ అయ్యి 1977 వరకు జైల్లోనే గడిపారు. 1977లో జెపి ఏర్పాటు చేసిన జనతాపార్టీలో చేరిన పాశ్వాన్ తొలిసారిగా హాజీపూర్ లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

1979లో జనతాపార్టీలో వచ్చిన చీలిక సమయంలో అప్పటి ప్రధాని మొరార్జీ పక్షంలో కాకుండా కర్పూరి, రాజ్ నారాయణ్ మరియు చరణ్ సింగ్ పక్షంలో నిలిచారు. చరణ్ సింగ్ నేతృత్వంలో ఉన్న జనతా పార్టీ (సెక్యులర్) పార్టీ తరపున 1980 ఎన్నికల్లో హాజీపూర్ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. జనతా (సెక్యులర్) పేరును లోక్‌దళ్ పార్టీగా మార్చిన తర్వాత లోక్‌దళ్ సభ్యుడిగా పార్లమెంటులో గుర్తించ బడ్డారు.1982లో లోక్ దళ్ పార్టీ రెండుగా చీలిన సమయంలో కర్పూరి నాయకత్వంలోని లోక్‌దళ్(కర్పూరి) పక్షంలో చేరారు. ఆ పక్షం తరపున లోక్‌సభలో నాయకుడిగా 1982-84 వరకు ఉన్నారు.

లోక్‌దళ్(కె) పార్టీలో ఉంటూనే దేశంలో దళిత ఉద్యమనేత కాన్షిరాం దళితులను సంఘటితం చేసి రాజకీయ లబ్దిని పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలకు విరుగుడుగా 1983లో దళిత్ సేన పేరుతో ఒక సమాంతర రాజకీయ వేదికను నిర్మించి బీహార్, యూపీ దళిత వర్గాలకు నాయకుడిగా నిలిచారు. ఈ ప్రయోగానికి అప్పటి దళితనేత, మాజీ ఉపప్రధాని జగ్జీవన్ రామ్ సైతం కొంత సహకారం అందించారు అంటారు. అయితే,1984లో హాజీపూర్ నుంచి తొలిసారి ఓటమి పాలైనప్పటికి 1985లో లోక్‌దళ్ పార్టీ తిరిగి చీలిక పక్షాలన్నీ విలీనం కావడం వల్ల జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు లభించింది. 1985-86 వరకు లోక్‌దళ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాశ్వాన్ వ్యవహరించారు.

1987లో చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ పోకడలను వ్యతిరేకిస్తూ చంద్రశేఖర్ నేరుత్వంలోని జనతాపార్టీలో చేరి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1987-88 వరకు కొనసాగారు. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ పూనుకొని ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కార్యదర్శిగా, అలాగే, పూర్వ జనతాపార్టీ విలీన పక్షాలన్నీ విలీనం అయ్యి ఏర్పడ్డ జనతాదళ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు  చేపట్టారు. ఒకేసారి రెండు కీలకమైన పదవులు చేపట్టిన ఏకైక నాయకుడిగా అప్పటి జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. 1990 మధ్య వరకు ఆ జోడు పదవులతో జాతీయ రాజకీయాల్లో బిజీగా మారడం మూలాన తానూ స్థాపించిన దళిత్ సేన విభాగం క్రమంగా రాజకీయ ప్రాధాన్యత కోల్పయి బీహార్ రాష్ట్రంలోని తన సొంత జిల్లా ఖగారియా, ముంగేర్ జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యింది. దళిత్ సేన బలహీన పడటం వల్ల కాన్షిరాం, మాయావతిల బీఎస్పీ యూపీ రాజకీయాల్లో బలపడుతూ వచ్చింది.

1989 ఎన్నికల్లో హాజీపూర్ నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత విపి సింగ్ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక మరియు సంక్షేమ శాఖ మంత్రిగా 1989-90 వరకు పనిచేశారు.1990 బీహార్ సీఎంగా లాలూ యాదవ్ అయ్యేందుకు మద్దతుగా నిలిచారు. అలాగే, వివాదాస్పద మండల్ కమిషన్ అమలును వ్యతిరేకిస్తూ నేషనల్ ఫ్రంట్ కార్యదర్శి, జనతాదళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలిపారు. 1991లో హాజీపూర్ నుంచి కాకుండా రోసేరా నుంచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1990-96 మధ్యలో బీహార్ సీఎంగా ఉన్న లాలూ జనతాదళ్ పార్టీ మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించి, తన నియంతృత్వ విధానాలతో సహచర సభ్యులను  బాధపెట్టడం మొదలుపెట్టారు. లాలూ బాధితుల్లో బాధితుల్లో పాశ్వాన్ ఉన్నప్పటికీ సమాంతర వ్యవస్థ లేక జనతాదళ్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

1996 ఎన్నికల్లో తిరిగి హాజీపూర్ నుంచి ఐదోసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత 1996-98 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవెగౌడ & గుజ్రాల్ మంత్రివర్గాల్లో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. 1997లో లాలూ జనతాదళ్ పార్టీని చీల్చి ఆర్జేడీని ఏర్పాటు చేసుకున్న తర్వాత శరద్ యాదవ్, దేవెగౌడ మరియు ఇతర నేతలతో కలిసి జనతాదళ్ పార్టీని నడిపించారు. 1998 నుంచి 2000 వరకు జనతాదళ్ పార్టీలో ఎన్నో చీలికలు ఏరపడ్డాయి.

1998 ఎన్నికల్లో హాజీపూర్ నుంచి ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో సహచర నేత శరద్ యాదవ్, జె.హెచ్. పటేల్ నాయకత్వంలో ఏర్పడ్డ జనతాదళ్ (యునైటెడ్) వైపు నిలిచిన పాశ్వాన్ హాజీపూర్ నుంచి ఏడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజపేయ్ మంత్రివర్గంలో 1999 నుంచి 2002 వరకు కమ్యూనికేషన్స్, బొగ్గు గనులు మరియు మైనింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు.

జనతాదళ్(యునైటెడ్) బలహీన పడిందని గ్రహించి 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ఈ పార్టీలోకి ఒక్క శరద్ యాదవ్ తప్పించి మిగిలిన బీహార్ జనతాదళ్ ఎంపీలు చేరారు. తాను సొంతంగా పార్టీ స్థాపించినప్పటికి ఎన్డీయే కూటమిలోని కొనసాగారు. అయితే, 2002 గోద్రా అల్లర్ల కారణంగా తన మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగారు. 2003లో సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరిన పాశ్వాన్ 2004లో హాజీపూర్ నుంచి ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర ఎరువులు మరియు రసాయనాల శాఖల మంత్రిగా పనిచేశారు.

2009లో అనివార్య కారణాల వల్ల యూపీఏ నుంచి బయటికి వచ్చి పూర్వ జనతాదళ్ పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన మూడో  ఫ్రంట్ కూటమిలో చేరిన పాశ్వాన్ లాలూ ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల గోదాలోకి దిగగా హాజీపూర్ నుంచి 33 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ సైతం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికి వారి మధ్య పొత్తు 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు సాగింది. 2010లో తొలిసారి పాశ్వాన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత లాలూతో తెగతెంపులు చేసుకొని ఒంటరి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, 2013లో భాజపా అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ వైదొలిగిన తర్వాత పాశ్వాన్ ఎన్డీయేలో చేరారు.

2014లో ఎన్డీయే కూటమి తరపున హాజీపూర్ నుంచి తొమ్మిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర ఆహార సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల నాటికి వయోభారం కారణంగా ఎన్నికల గోదా నుంచి వైదొలిగి రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019-21 వరకు మోడీ 2.0 మంత్రివర్గంలో కేంద్ర ఆహార సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు.

పాశ్వాన్ 80వ దశకం నుంచి దేశ దళిత రాజకీయాల్లో కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చారు. అయితే, 80వ దశకం చివరి నాటికి బీహార్ దళిత వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. దళితుల సంక్షేమం కోసం పాశ్వాన్ ప్రత్యక్షంగా ఎటువంటి ఉపకారం చేయకపోయినా పరోక్షంగా మాత్రం దళితుల రాజకీయ చైతన్యం కోసం పాటుపడ్డారు. సామ్యవాదం ద్వారానే అంబేద్కర్ కలలు గన్న సమానత్వం వస్తుందని ప్రగాఢంగా విశాసించి, సామ్యవాదాన్ని దళిత వాదానికి ముడిపెట్టి సోషలిస్టు దళిత సంక్షేమం అనే సరికొత్త రాజకీయ సిద్ధాంత భావజాలానికి ఆద్యుడయ్యారు. ప్రకాశ్ అంబేద్కర్, ఆర్.ఎస్. గవాయ్ మరియు కాన్షిరాంలతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికి దళిత ప్రగతికి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మద్దతు పలికారు. సమకాలీన రాజకీయ జీవితంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి దళిత రాజకీయాల్లో తనను దాటి జాతీయ దళిత ప్రతినిధిగా మారిన సమయంలో కొంత రాజకీయ పరిణామాలను ఎదుర్కొన్నారు.

పాశ్వాన్ బీహార్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించింది చాలా తక్కువనే చెప్పాలి! తన సమకాలీన రాజకీయ జీవితంలో బీహార్ రాష్ట్రానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ మరియు సుశీల్ కుమార్ మోడీలతో పోలిస్తే బీహార్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసే ఘటనలు లేవనే చెప్పవచ్చు. సుదీర్ఘకాలం జాతీయ రాజకీయాలకు పరిమితం కావడం మూలాన స్వరాష్ట్ర రాజకీయాల్లో ఇతర నేతల్లా ఎదిగేందుకు అవకాశాలు రాలేదు. అయితే, 2000 అసెంబ్లీ ఎన్నికలో ఎన్డీయే కూటమిలో ఉన్న సమయంలో నితీశ్ కుమార్ సమతా పార్టీతో, భజాపాతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో బరిలోకి దిగినప్పుడు 12 రోజుల పాటు ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తన తమ్ముడైన పశుపతి ద్వారా కొంత రాజకీయం చేశారు. 

అలాగే, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజారిటీ రాని పక్షంలో తన పార్టీకి వచ్చిన 29 స్థానాలలో బీహార్ రాజకీయాల్లో కింగ్ మేకర్  పాత్ర పోషించాలని ఆశించినప్పటికి, ఎన్డీయే, యూపీఏ కూటములు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోవడంతో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావడంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే పాశ్వాన్ కోరిక తీరకుండానే ఉండిపోయింది. 

పాశ్వాన్ రాజకీయ ఆశావాది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే ఎరుకతో ఉండేవారు. అందువల్లనే ఆయన దేశ రాజధాని కేంద్రంగా అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. సహాయం కోసం తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయపడతారు. ఇలా అందరికి సహాయలు చేస్తూ తనకు అవసరమైన సమయంలో వారి నుంచి తిరిగి సహాయలు పొందేవారు. అంతేందుకు గోద్రా అల్లర్లను సాకుగా చూపి ఎన్డీయే నుంచి వైదొలిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన సన్నిహిత వర్గాల ద్వారా సోనియాకు దగ్గరై యూపీఏ కూటమిలో చేరారు. 2014లో తిరిగి తన ఎన్డీయే పక్షంలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. రాజకీయ కక్షలకు అతీతంగా అన్ని పార్టీలతో సావాసం చేస్తూ లాభపడ్డారు. ఇదే సూత్రాన్ని లేటుగా పాటించిన మరాఠా యోధుడు శరద్ పవార్ సైతం రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. 

ఆరు దశబ్దాల రాజకీయ జీవితంలో రామ్ విలాస్ పాశ్వాన్ దాదాపు మూడు దశాబ్దాల పాటు 7 ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాను ప్రాతినిధ్యం వహించిన హజీపూర్ నియోజకవర్గానికి కొన్ని వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను  పరుగులు పెట్టించారు. హజీపూర్ అంటే పాశ్వాన్, పాశ్వాన్ అంటే హజీపూర్ అనేలా జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. ఇలా రాజకీయాల్లో నిరసావాదాన్ని దరి చేరనియకుండా 9 సార్లు లోక్ సభకు , రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలకమైన నేతగా వ్యవహరిస్తున్న పాశ్వాన్ అక్టోబర్ 8, 2020న గుండె పోటు కారణంగా న్యూ ఢిల్లీలో తన 74వ ఏట కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com