తిరుపతి కపిలతీర్థం రోడ్డులో ఓ వ్యక్తి వీరంగం: ఒకరు మృతి

- July 07, 2025 , by Maagulf
తిరుపతి కపిలతీర్థం రోడ్డులో ఓ వ్యక్తి వీరంగం: ఒకరు మృతి

తిరుపతి: తిరుపతిలో సోమవారం ఉదయం ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కపిలతీర్థం రోడ్డులో ఓ ఉన్మాది దాడికి దిగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. నడిరోడ్డుపై నిర్దాక్షిణ్యంగా జరిగిన ఈ ఘటన ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దారుణ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న ప్రజలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతని చేతిలో కర్ర కూడా ఉండడంతో మరింత బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో శేఖర్ అనే 55 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇద్దరికి తీవ్ర గాయాలు
దాడిలో మరో ఇద్దరు–సుబ్రహ్మణ్యం, కల్పన అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గంటపాటు తీవ్ర ఒత్తిడిలో పోలీసులు
నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు దాదాపు గంటపాటు కష్టపడ్డారు. చివరకు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అతను తమిళనాడుకు చెందినవాడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మానసిక స్థితి సాధారణంగా లేదని అనుమానిస్తున్నారు.

నగరంలో భయ వాతావరణం
నగర నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పుణ్యభూమిగా పేరొందిన తిరుపతిలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com